* బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ 5, ఇషాంత్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించారు. శనివారం 240 పరుగులతో వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులు మాత్రమే చేయగలిగింది.
* రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అన్ని డిపోల్లో ఆదివారం తలపెట్టిన మానవహారాలు, మౌనదీక్షలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఎంజీబీఎస్‌లో ఐకాస నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఐకాస నేతలు ధన్యవాదాలు తెలిపారు.
* అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణాన్ని ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఆదివారం ఝార్ఖండ్‌లోని బిశ్రామ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా సభకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా జైశ్రీరాం.. అంటూ భారీ ఎత్తున నినాదాలు చేయడంతో ఆయన స్పందిస్తూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు.
* రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు ఛాయా విరాని, రైనా కరాని, మంజరీ కాకర్, సురేశ్ రంగాచార్, సీఎఫ్‌ఓ మణికంఠన్.వి కూడా రాజీనామా చేశారు. వీరిందరి రాజీనామాలను పరిశీలనార్థం రుణ సంస్థల కమిటీ (సీఓసీ)కు పంపగా తాజాగా సీఓసీ వాటిని తిరస్కరించినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్ సందర్భంగా ఆర్‌కామ్ తెలిపింది.
* ఎంపీ సీఎం రమేశ్ కుమారుడి వివాహానికి తాను దుబాయ్ వెళ్లానంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 2015లో తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పటి పాత ఫొటోలతో కొత్త కథ అల్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
* మహారాష్ట్ర రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను భాజపా వలకు చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. వారు ఉన్న మూడు వేర్వేరు హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. హోటళ్ల ప్రైవేటు సెక్యూరిటీ కూడా తనిఖీ లేకుండా ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదని తెలుస్తోంది.
* టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో చారిత్రక డేనైట్ టెస్టు సందర్భంగా కోహ్లీ(136) పింక్ బాల్‌తో 27వ శతకం బాదిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాన్ ట్వీట్ చేస్తూ అతడిని ప్రశంసించాడు. ‘రెడ్ బాల్, వైట్ బాల్, ఇప్పుడు పింక్ బాల్. ఈ తరంలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కోహ్లీనే’ అని పేర్కొన్నాడు.
* తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి .. ప్రయాణికులను పలకరిస్తూ మెట్రో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో ప్రయాణంతో ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. పనిదినాల్లో రద్దీ చాలా పెరిగిందని, ఎప్పటికప్పుడు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని సిబ్బంది మంత్రికి వివరించారు.
* ‘రాగల 24 గంటల్లో’ సినిమాతో తాజాగా మంచి హిట్ అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. దీని తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘భార్యదేవోభవ’ పేరుతో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు ఇందులో పది మంది హీరోయిన్లు నటించబోతున్నారని తెలిపారు. వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నామని అన్నారు. ‘రాగల 24 గంటల్లో’ సినిమాను నిర్మించిన శ్రీనివాస్ కానూరు దీన్ని కూడా నిర్మించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.