పరాయి స్త్రీతో భర్త కాస్త చనువుగా ఉంటేనే ఏ భార్యా ఒప్పుకోదు. అలాంటిది భర్తకు తానే స్వయంగా పెళ్లి చేయడమా..? ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో గురువారం అలాంటి అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసికి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. పిల్లాపాపలతో హాయిగా జీవితం గడిచిపోతుండగా.. రామ కావసికి ఇటీవల కాలంలో ఐత మడకామి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ రామ కావసిని ఐత పట్టుబట్టింది. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. తనకు పెళ్లి అయిందని, ఇప్పటిలో పెళ్లి చేసుకోలేనని రామ కావసి తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె.. మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో రామ కావసిపై ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే, ఈ విషయం రామ కావసి భార్య గాయత్రికి తెలిసింది. తన భర్త జైలు పాలైతే తమ పరువు పోతుందని, కుటుంబం వీధి పాలవుతుందని ఆమె ఆందోళన చెందింది. దీనికి పరిష్కార మార్గం ఏంటా అని ఆలోచించి.. చివరకు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించింది. అలా చేస్తే తన భర్త ఊరిలోనే ఉంటాడని.. తన కుటుంబానికి ఏ డోకా ఉండదన్న నిశ్చయానికి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరితో మాట్లాడి వారిని ఒప్పించింది.
ఊరిలోని సిద్ధి ఈశ్వర్ మందిరంలో గురువారం వారి వివాహానికి స్వయంగా ఏర్పాట్లు చేసింది. పూజారి సమక్షంలో గ్రామస్తుల మధ్య వారిద్దరినీ అగ్నిసాక్షిగా ఒక్కటి చేసింది. మరోవైపు.. రామ కావసిపై ఐత మడకామి పెట్టిన కేసును కొట్టివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.