DailyDose

సమ్మె విరమిస్తున్నాం-తాజావార్తలు-11/25

Aswatthama Reddy Announces Closing Of TSRTC Strike-Telugu Breaking News-11/25

* తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె విరమించారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని అశ్వత్థామ పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

* మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమికి చెందిన 162 మంది ఎమ్మెల్యేలు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో మహాబల ప్రదర్శన నిర్వహించారు. వీరు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. సమావేశానికి 162 మంది వచ్చారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. మరోవైపు మేమంతా 162 మంది సభ్యులమున్నామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రాండ్ హయత్‌ హోటల్లో ఫ్లకార్డులు ప్రదర్శించారు.

* ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌ శర్మ స్పందించారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇష్టమొచ్చినప్పుడు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరటం కుదరదని స్పష్టం చేశారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నానని చెప్పారు. రేపు కార్మికులు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

* నేర రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. నేర రికార్డులు ఉన్న వ్యక్తులను రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలబెట్టకుండా సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ భాజపా నేత, సీనియర్‌ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

* ఐఐఎం అహ్మదాబాద్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరారు. జగన్‌పై 31 క్రిమినల్‌ కేసులతో పాటు సీబీఐ విచారణ కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు. జగన్‌ ఎన్నో సూట్‌కేస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి రూ.వేల కోట్లు మళ్లించారని కళా ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారన్నారు.

* రాజధాని ప్రాంతంలో 57 శాతం నుంచి 90 శాతం వరకే కట్టిన నాలుగు భవనాలు తప్ప ఇంకేమీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. తెదేపా మాయలో రాజధాని రైతులు పడొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. అమరావతి పట్టణమా? గ్రామమా? అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

* గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు రెండున్నర గంటలపాటు ఆమెతో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సహా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు.. 5100 ప్రైవేట్ రూట్లకు రవాణా అనుమతుల విషయాన్ని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది.

* ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లో చేపట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి (వీఆర్‌ఎస్‌) అనూహ్యంగా 92 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ స్థాయిలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నాయి. ఈ రెండు సంస్థల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు గడువు డిసెంబర్‌ 3తో ముగియనుంది.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమ కూటమికే మెజార్టీ ఉందనీ.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. బలం లేని దేవేంద్ర ఫడణవీస్‌ ప్రభుత్వం నిలబడదని వ్యాఖ్యానించారు. కర్ణాటక, గోవా, మణిపూర్‌లో మెజార్టీ లేకపోయినా భాజపా ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా పవార్‌ గుర్తు చేశారు. ఇది గోవా కాదు.. మహారాష్ట్ర అని తెలుసుకోవాలని భాజపాను పరోక్షంగా హెచ్చరించారు.

* పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఉంటున్న శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించారు. దేశమంతటా జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర ప్రకటించిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం. వలస వచ్చిన వారందరికీ టీఎంసీ ప్రభుత్వం భూమి హక్కు కల్పిస్తుందని ఆమె తెలిపారు.

* మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని ఏర్పర్చడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన లోక్‌సభలో మహారాష్ట్ర అంశంపై మాట్లాడారు. ‘మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీకి గురైంది. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించిన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.

* గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలంటూ ముగ్గురు సభ్యులతో మంత్రి కేటీఆర్‌ కమిటీని నియమించారు. చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌తో పాటు లీ అసోసియేట్స్‌ ప్రైవేట్‌ సంస్థతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్‌ డిజైన్‌, ప్రమాద నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని కేటీఆర్‌ ఆదేశించారు.

* తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి సూరాడ దీప్తిశ్రీ (7) అదృశ్యం ఘటన విషాదాంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన చిన్నారి కోసం మూడు రోజులుగా పోలీసులు గాలించగా.. తాజాగా కాకినాడలోని ఇంద్రపాలెం లాకుల దిగువన డ్రెయిన్‌ వద్ద గోనెసంచిలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. సవతి తల్లి శాంతికుమారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

* పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమఫలాలు చేరాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుంటూరులో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సుచరిత హామీ ఇచ్చారు.

* కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దిగువ సభలో సోమవారం జరిగిన పరిణామాలు తీవ్ర ఆవేదనను కల్గిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక విలువలను కాలరాసేలా వ్యవహరిస్తూ తిరిగి తమపై విమర్శలు చేస్తోందన్నారు. మహారాష్ట్రను కాంగ్రెస్‌ హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించినా.. అక్కడ రాజకీయంగా, నైతికంగా భాజపాదే విజయమన్నారు.

* ఇసుక వారోత్సవాలు అని ముఖ్యమంత్రి జగన్ అంటుంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. జగన్‌ అన్నది ఇసుక ‘వార్’ ఉత్సవాలని తర్వాత అర్థమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక ‘వార్‌’లో భాగంగా ఇసుక వాటాల కోసం గుంటూరు జిల్లాలో వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలగొట్టుకుంటున్నారంటూ ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

* దేశ రాజధాని నగరం దిల్లీలో ఉగ్ర దాడి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. అంతర్జాతీయ ముష్కర సంస్థ ఐసిస్‌తో ప్రభావితమైనట్టు అనుమానితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దిల్లీ ప్రత్యేక పోలీస్‌ విభాగం డీసీపీ ప్రమోద్‌ కుష్వాహా వెల్లడించారు. అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

* రాజ్యసభలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. మార్షల్స్‌కు సైనికాధికారుల తరహాలో ఉండే డ్రెస్‌కోడ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో తిరిగి వారు పాత తరహా డ్రెస్‌లోనే కనిపించారు. పాత పద్దతిలో ‘బంద్‌గలా సూట్‌’ ధరించారు. కానీ, ఈసారి తలపాగా లేకపోవడం గమనార్హం. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా గత సోమవారం నుంచి మార్షల్స్‌కు నూతన డ్రెస్‌కోడ్‌ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.

* ఏపీ రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌పై రివర్స్‌టెండరింగ్‌ అంశంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేయాలని సీఆర్‌డీఏకు తాజాగా ఆదేశాలిచ్చింది. అమరావతిలోని నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ ద్వారా 1200 ఫ్లాట్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ గతంలోనే టెండర్లు పిలిచింది. ఈ మేరకు పనులు కూడా మొదలు పెట్టింది. 300 ఫ్లాట్లకు నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేపట్టింది.

* దలాల్‌స్ట్రీట్‌ మెరిసిపోయింది. ఉరకలేస్తున్న ఉత్సాహంతో సరికొత్త శిఖరాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా వెల్లువెత్తిన కొనుగోళ్లతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 530 పాయింట్ల లాభంతో 40,889 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 159 పాయింట్లు దూసుకెళ్లి 12,074 వద్ద ముగిసింది.