* భారత స్టాక్ మార్కెట్ సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇంట్రా డేలో 40,857.73 పాయింట్లను తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ నేటి మార్కెట్ ముగిసే సరికి 40,829 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 12, 056 పాయింట్ల వద్ద మార్కెట్‌ను ముగించింది. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం పరిణామాలు శాంతించే దిశగా సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొత్త ఉత్సాహంతో మార్కెట్‌ను ఉరకలెత్తించారు. నేటి మార్కెట్‌లో మెటల్ స్టాక్స్ కీలక పాత్ర పోషించి ముందడుగు వేశాయి. టెలికాం, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా పరుగులు పెట్టాయి. భారత మార్కెట్లతో పాటు మరోవైపు ఆసియాలోని ఇతర మార్కెట్లు కూడా అదే ఉత్సాహాన్ని కనబరచాయి. జపాన్, చైనా ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లకు ఊతమిచ్చారు. ఇంకోవైపు ఐరోపా మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.
* తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె విరమించారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని అశ్వత్థామ పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరగుతుందనే నమ్మకముందని అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు.
* వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తోన్న పెట్రోల్ ధర.. సోమవారం నాటికి ఈ ఏడాదిలో గరిష్ఠానికి చేరుకుంది. కాగా డీజిల్ ధర మాత్రం నిలకడగా ఉండటం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లో ఈ రోజు పెట్రోలు ధర లీటరుకు 12 పైసల చొప్పున పెరగ్గా.. చెన్నైలో 13 పైసలు పెరిగింది. దేశ రాజధానిలో పెట్రోల్ ధర గత నాలుగు రోజుల్లో లీటరుకు మొత్తం 46 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భగ్గుమంటున్న ముడిచమురు ధరలే ఇందుకు కారణంగా చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం పెట్రోలు ధరలు లీటరుకు.. దిల్లీలో రూ.74.66, కోల్‌కతాలో రూ.77.34, ముంబయిలో రూ.80.32, చెన్నైలో రూ.77.62 కాగా.. స్థిరంగా ఉన్న నేటి డీజిల్ ధరలు లీటరుకు.. దిల్లీలో రూ.65.73, కోల్‌కతాలో రూ.68.14, ముంబయిలో రూ.68.94, చెన్నైలో రూ.69.47గా నమోదయ్యాయి.
* దేశీయంగా మొబైల్ తయారీ రంగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ తన ఐఫోన్ Xఋ మోడల్ తయారీని భారత్‌లో ప్రారంభించిందని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే యాపిల్‌కు ఛార్జర్లు సరఫరా చేసే సాల్‌కాంప్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. చెన్నైకి సమీపంలోని సెజ్‌లో మూతపడిన నోకియా ప్లాంట్‌ను ఆ కంపెనీకి కేటాయించినట్లు చెప్పారు. 2020 మార్చి నుంచి అక్కడ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో రూ.2వేల కోట్లు ఆ కంపెనీ పెట్టుబడి పెట్టనుందని వివరించారు. పదేళ్లుగా మూతపడిన నోకియా ప్లాంట్‌ను సాల్‌కాంప్ పునరుద్ధరించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అలాగే దేశీయ మొబైల్, ఇతర విడిభాగాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.6 బిలియన్ డాలర్లు దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.