Movies

ఏది పడితే అది రాసేసేవారు

Raveena Tandon Feels Bad For Absence Of Social Media In 1990s

సోషల్‌మీడియా.. సినీ తారలను తమ అభిమానులకు మరింత దగ్గర చేస్తున్న ఓ సామాజిక వేదిక. ప్రస్తుతం ఎందరో సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయాన్ని, నిజానిజాలను గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ 90ల్లో సోషల్‌మీడియా లేకపోవడం ఒక బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఇటీవల రవీనా హిందీలో ప్రసారమయ్యే ‘ది లవ్‌ లాఫ్‌ లైవ్‌’ షోలో పాల్గొన్నారు. ‘90ల్లో సోషల్‌మీడియా అనేది లేకపోవడం ఒక బాధాకరమైన విషయం. దీనివల్ల మా మీద వచ్చిన పలు కాంట్రవర్సీలపై అప్పటి నటీనటులం స్పందించలేకపోయేవాళ్లం. ఆ రోజుల్లో మా గురించి పత్రికల్లో, టీవీల్లో వచ్చిన కాంట్రవర్సీలు మాత్రమే ప్రజలు నమ్మేవారు. కాంట్రవర్సీలపై స్పందించేందుకు మాకు వేరే దారి లేకపోయింది.’ అని ఆమె అన్నారు. 2018లో భారత్‌లో ప్రారంభమైన మీటూ ఉద్యమంపై స్పందిస్తూ..‘ఒకవేళ ఆరోజుల్లో కనుక నాకు సోషల్‌మీడియా ఉండి ఉంటే. ఎందరో జీవితాలను నేను బయటపెట్టేదాన్ని’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుల్హేరాజా, అందాజ్‌ అప్నా అప్నా, ఘర్‌వాలీ బహర్‌వాలీ, లాడ్లా, ఆంటీ.. వంటి వరుస విజయాలతో రవీనా టాండన్‌ ఒకప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగారు. దీంతో ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సైతం రవీనా టాండన్‌ తన ఫస్ట్‌ క్రష్‌ అని ఓ సందర్భంలో తెలిపారు.