Movies

డబ్బున్న వారందరికీ సావిత్రి జీవితం ఒక గొప్ప పాఠం

Actress Savitri's Life History - A Life Lesson To Everyone

*** మరపురాని అభినేత్రి…సావిత్రి.
ఒకప్పుడు వెండితెరను ఏలిన నాయకి. అగ్రహీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న కథానాయిక. తెలుగు సినిమా చరిత్రలోనే ఆమెది ఒక ప్రత్యేక ప్రస్థానం. చిన్నతనంలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్రతారగా వెలుగొందిన అందాల అభినేత్రి. అడిగినవారికి లేదనకుండా దానం చేసిన దానకర్ణ. ఇదంతా పేజీకి ఒకవైపు మాత్రమే. రెండవ వైపు ఆమె జీవితం అర్థంలేని ప్రశ్నల వేదిక. రెండు పెళ్లిైళ్లె పిల్లలున్నవాడితో పెళ్లి. పిల్లలు పుట్టాక భర్త దూరమై, మద్యానికి బానిసై, బంధువులు మోసం చేసి, బతుకు భారమై చిన్నవయస్సులోనే ఇక సెలవంటూ వెండితెర నుంచి నిష్క్రమించిన సావిత్రి చివరి పేజీ ఇది.

అలనాటి అందాల తార సావిత్రి. తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన ఈమె తెలుగు సినిమా మూలపురుషులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్తో సహా కృష్ణ తదితర నటులందరితో ఆడిపాడింది. అందం, అభినయం కలగలిపిన ఆమె సినిమా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అయితే సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన సావిత్రి తన పర్సనల్ జీవితాన్ని మాత్రం ఎప్పుడూ బహిర్గత పరుచలేదు. సావిత్రి అసలు పేరు కొమ్మారెడ్డి సావిత్రి.. ఈమె జనవరి 11, 1937న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు నిశ్శంకరావు గురవయ్య, సుభద్రమ్మ. వీరికి సావిత్రి రెండో సంతానం. సావిత్రికి ఆరు నెలలు ఉన్నప్పుడే తండ్రి టైఫాయిడ్ కారణంగా చనిపోయాడు. గురువయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. అక్కడే పాఠశాల విద్య చేసి నృత్యం, నాటక రంగాల్లో శిక్షణ కూడా తీసుకుంది. నాటక రంగంపై అభిమానంతో ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలోకి ప్రవేశించింది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంక్రటామయ్య పోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టిసారించింది. ఎన్నో కష్టాలను ఓర్చి అభినేత్రిగా పేరొందింది. కేవీరెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో చిన్న పాత్రలో నటించింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమాతో హీరోయిన్గా సావిత్రి ఎంట్రీ ఇచ్చింది.

*** వరుస విజయాలు
దొంగరాముడు, అర్ధాంగి, దేవదాసు, చరణదాసి సినిమాలతో చక్కటి పేరు సంపాదించింది సావిత్రి. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాతో టాప్ హీరోయిన్గా సావిత్రి తెలుగు సినిమాల్లో ఎదిగింది. ఈమె తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. తమిళనాట నడిగెయర్ తిలగం బిరుదు పొందింది. చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత, వింతసంసారం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి సావిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సమానంగా పారితోషికం అందుకున్న నటి సావిత్రి ఒక్కరే కావడం గమనార్హం.

*** మనసు పారేసుకుంది
మొదటిసారి సినిమా చాన్సుల కోసం ప్రయత్నం చేసిన సందర్భంలోనే, అంటే 13 యేండ్ల వయసులోనే సావిత్రి జెమినీ గణేశన్ని మొదటిసారి చూసింది. ఆయన యువకుడు, అందగాడు. అప్పటికింకా తమిళ హీరో కాలేదు. జెమినీ స్టూడియోలో స్టిల్ ఫొటోగ్రాఫర్గా చేస్తుండేవాడు, ఆయనకి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దరు భార్యలూ, పిల్లలు కూడా! సావిత్రికి స్టిల్ ఫొటోలు తీసింది ఆయనే. ఆయన ఆమెకి తీసిన ఫొటోల సంగతెలా ఉన్నా ఆయన రూపం సావిత్రి మనస్సనే ఫిలిమ్ మీద శాశ్వతంగా ముద్రించుకుపోయింది. అందుకే 1953లో కేవలం 18వ ఏటనే ఎవరికీ చెప్పకుండా ఆయన్ని రహస్యంగా పెళ్ళి చేసుకుంది. నిజానికి 1953 నాటికే ఆమె దక్షిణపథాన ఒక స్టార్గా వెలుగొందుతున్నది, కనుక ఈ వార్త సహజంగానే దేశంలో గగ్గోలు పుట్టించింది. GG కి మూడో భార్యగా సావిత్రి అని శీర్షికలు పెట్టాయి పత్రికలు. అయితే అప్పట్లో ఏక పత్నీత్వం వంటి చట్టాలేవీ లేవు కనుక సమస్యేం తలెత్తలేదు. ఒకవేళ తలెత్తినా సావిత్రి తాను నమ్మినదానికి నిలబడే మనిషే తప్ప లోకాన్ని లెక్కచేసే తత్త్వం కాదు.

*** భాష మీద పట్టు
సావిత్రి చాలా తెలివిగల మహిళ. ఎక్కువ చదువుకోనప్పటికీ జీవితమే ఆమెకి ఎంతో నేర్పింది. మాతృభాష అయిన తెలుగు మీద గట్టి పట్టుండడమే కాక, తమిళ, హిందీ భాషల్ని సైతం మాతృభాషంత ధారాళంగా మాట్లాడేది. ఇంగ్లీషు కూడా స్వయంకృషితో అభ్యసించింది. ఇంగ్లిషు పత్రికలవారికి ఇంగ్లిషులోనే ఇంటర్వ్యూలిచ్చేది. మద్రాసొచ్చిన మూడేళ్లల్లోనే తమిళం లిపితో సహా ఆమె పట్టేసింది. అక్కడ తాను పాల్గొన్న అన్ని సభల్లోనూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మాట్లాడేది. హిందీలో కూడా సితారోంసే ఆగే (ధర్మేంద్రతో), బలరామ్-శ్రీకృష్ణ (పృథ్వీరాజ్ కపూర్తో) ఇత్యాదిగా 5 సినిమాలు చేసింది.

*** ఇష్టాయిష్టాలు
మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే జెమినీగణేశన్తో పాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతేకాదు ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్, రేలంగి, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని బాగా అనుకరించేది.

*** తరగని ఆస్తి..
దేశంలో ఏ నటీ అనుభవించనంత గొప్ప సామాజిక గౌరవాన్ని పొందింది సావిత్రి. ఆమె ఆ రోజుల్లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబరుగా ఉండేది. ప్రత్యేకంగా ధ్వనించే ఆమె కారు హారన్ విని మద్రాస్ రోడ్లమీద జనం సావిత్రి, సావిత్రి అంటూ వాళ్ళంతట వాళ్ళు పక్కకి తొలిగి దారిచ్చేవారు. సాంప్రదాయిక పాత్రలు చేస్తూ, నిజజీవితంలో కూడా సాంప్రదాయికంగానే ఉన్న సావిత్రి సాధించిన ఆర్థిక విజయాలు సైతం తక్కువవి కావు. ఆ రోజుల్లో హీరోల తరువాత అంతటి పారితోషికం తీసుకున్న ఏకైకనటి ఆమె. కొన్ని సినిమాలకైతే హీరోతో సమానంగా తీసుకునేది. ఆమెకి మద్రాసులో కోట్లాది విలువ చేసే నాలుగు బంగళాలు, కొడైకెనాల్లో ఒక గెస్ట్ హౌస్, విజయవాడలో రెండు బంగళాలు, హైదరాబాద్లో ఒక బంగళా, కృష్ణాజిల్లాలో విజయ్ స్పిన్నింగ్ మిల్స్ పేరుతో ఒక పరిశ్రమ, ఒక వ్యవసాయిక ఎస్టేటు, మద్రాసులో సావిత్రీ ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీ ఉండేవి. ఇంట్లో ఎప్పుడూ 6 కార్లుండేవి. ఇవన్నిటి వల్ల ఆమె ఏడాదికి రు. 8 లక్షల ఆదాయపన్ను కట్టాల్సి వచ్చేది. ఆమె నిర్మించిన కొన్ని సినిమాల మీద వచ్చిన భారీనష్టం కారణంగా ఒకసారి ఆదాయప్పన్ను చెల్లించలేకపోతే ఆ శాఖ అధికారులు ఆమె దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ఆ రోజుల్లోనే రు. 30 లక్షలంటేనే మనకి అర్థం కావాలి. అప్పట్లో ఎంత పెద్ద స్టార్లని పెట్టి తీసినా సినిమా నిర్మాణ ఖర్చు రూ.4 లక్షలకి మించేది కాదు.

*** దేశంకోసం దానం చేసి
సావిత్రి దాత్రుత్వానికి అద్దం పట్టే ఆ ఘటన ఇదే.. అది 1965 భారత్ పాక్ మధ్య రెండవసారి యుద్ధం జరుగుతున్న సమయం. ఆ యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది. ఆ నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి మందుగుండు సామాగ్రి కొనుగోలు కోసం విరాళాలు విరివిగా ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు. ఆ క్రమంలో 1965 సెప్టెంబర్ నెల ప్రధాని చాంబర్లోనికి ఆయన గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది ప్రముఖ నటిగారు వేచి ఉన్నారని చెప్పాడు. ప్రధాని శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు. 5 నిమిషాల తర్వాత అప్పటికి సుమారు 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అందమైన యువతి చిరునవ్వుతో మొహం కళకళలాడుతుండగా వంటినిండా నగలతో ధగధగలాడుతూ ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది. ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గారికి తాను ఎవరో పరిచయం చేసుకుంది. శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు. ఆ తర్వాత ఆమె వచ్చిన పని చెబుతూ.. తన ఆభరణాలన్నింటినీ తీసి శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ.. ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది. తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక చూసి ఆనందం నిండిన కళ్ళతో.. భేటీ నువ్వు మహనీయురాలమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు అన్నారట. ఆమెతో కరచాలనం చేసి, ఎంతో గౌరవంగా గుమ్మం వరకు వచ్చి సాగనంపారట.

*** అంబారీ మీద ఊరేగించి…
కాసు బ్రహ్మానందరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో సావిత్రికి గజారోహణ సన్మానం జరిగింది. ఆమెతో పాటు ఆమె భర్త GGని కూడా కూర్చోబెట్టి ఊరేగించారు. ఆ ఊరేగింపులో సావిత్రి అధిరోహించిన ఏనుగు వెంట రోడ్లమీద రాష్ట్ర ముఖ్యమంత్రి, కేబినెట్ సభ్యులూ నడిచారు.

*** దర్శక నిర్మాతగా
సావిత్రి 83 చిత్రాల్లో నటించింది. అలాగే ఆరు చిత్రాలకు దర్శకత్వం, కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే కొన్ని చిత్రాలు విజయం సాధించలేదు. మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్ధికంగానూ, మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించింది. తెలుగులో విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో జెమినీ గణేశన్తో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థికపతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుంచి అణ్ణానగర్కు నివాసం మారింది. 1972 తరువాత సావిత్రి జీవితంలో పతనం మొదలైందని చెప్పాలి. భర్తతో విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో అతని నుంచి విడిపోయింది.

*** ఆఖరిరోజుల్లో
సావిత్రి చివరిరోజుల్లో ఉన్న కార్లు కూడా పోవడంతో షూటింగులకు కూడా బస్సు ఎక్కి వెళ్ళేదట. భర్తకు దూరం కావడం, నమ్మినవారు అందరూ మోసం చేయడం బాధాకరమైన విషయాలు. జీవితంలో అన్నివిధాలా నష్టపోయిన ఆ మహానటి తాగుడు, నిద్రమాత్రలకు అలవాటుపడి అనారోగ్యంపాలై విషాదకర పరిస్థితుల నడుమ 1981 డిసెంబర్ 26న తుదిశ్వాస విడిచింది. మూడున్నర దశాబ్దాల క్రితం మరణించినా.. మరపురాని అభినేత్రి.. మరిచిపోలేని మంచి మనిషి.. తెలుగింటి మహానటి సావిత్రి.
అది 1981 డిసెంబర్ 26 చెన్నైలోని ఒక ఆసుపత్రి. అప్పటి వరకు నిశ్చబ్దంగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణంలో అలజడి మొదలైంది. అప్పటికి 19 నెలలుగా కోమాలో ఉన్న నిండైన బొద్దుశరీరం ఇప్పుడు గాలితీసిన బెలూన్ల చిక్కిపోయింది. అందానికే వన్నె తెచ్చిన ఆమె రూపం కళావిహీనమైంది. ఎన్నెన్నో భావాలను పలికించిన ఆమె చిలిపికళ్లు మూతలు పడ్డాయి. చిక్కిశల్యమైన శరీరం.. ఎవరూ గుర్తుపట్టలేని ఆకారం.. మూడు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిలా తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన వెండితెర సామ్రాజ్ఞి తన చివరి మజిలీలో విషాదకర పరిస్థితుల్లో తనువు చాలించడం విచారకరం.

*** ఇల్లు కూడా లేని పరిస్థితి
అలనాటి మేటి నటి సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా మహానటి బయోపిక్ రావడం అనేక మంది ప్రముఖులు ఆ మహానటితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో. పాత తరంలో ప్రముఖ సినీ జర్నలిస్టుగా పేరుగాంచిన గుడిపూడి శ్రీహరి సావిత్రి గురించి అనేక విషయాలు తెలిపారు. సావిత్రి చివరి దశలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొందని, ఆఖరికి ఆమె శవాన్ని ఉంచడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి వచ్చిందని గుడిపూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. భర్త జెమినీ గణేశన్ ఇంటికి తీసుకువెళ్లే సాహసం చేయలేకపోయారని, ఇతర సినీ ప్రముఖులు కూడా ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఎంతో బాధ పడ్డారని ఆనాటి దయనీయ క్షణాలను గుర్తుచేసుకున్నారు. చివరికి జెమినీ గణేశన్ అంగీకరించడంతో సావిత్రి భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచారని, ఆ మహానటి కడసారి చూపుల కోసం కిలోమీటర్ల కొద్దీ జనాలు బారులు తీరారట.

*** ఇలా తెలిసింది
జెమినీ గణేశన్ను పెళ్లి చేసుకున్న విషయం మూడేండ్ల తర్వాత ఇండస్ట్రీతో పాటు ప్రపంచానికి తెలిసింది. అసలు ఆమె జెమినీ గణేష్ను పెళ్లి చేసుకున్న విషయమే చాలా విచిత్రంగా బయటికొచ్చింది. లక్స్ యాడ్లో నటించడానికి చేసిన అగ్రిమెంట్ పై ఆమె సావిత్రీ గణేశ్ అని సంతకం చేసింది. ఆ విధంగా వారి వివాహం బయటి ప్రపంచానికి తెలిసింది. సావిత్రి-జెమిని గణేశ్కు ఒక కుమార్తె చాముండేశ్వరీ.. కుమారుడు సతీష్ కుమార్.