DailyDose

ఇసుక ట్రాక్టర్లకు GPSలు-తాజావార్తలు-11/26

YS Jagan Orders Sand Tractors Be Fitted With GPS-Telugu Breaking News-11/26

* మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిసెంబర్‌ 1న శివాజీ పార్కులో ఉద్ధవ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ వెల్లడించారు.

* రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ నవశకం లబ్ధిదారుల ఎంపికపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కింద 45.82లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలపారు. మరో 2.14లక్షల మంది రైతులకు వారంలోగా చెల్లించాలని చెప్పారు డిసెంబరు 15 నుంచి 18 వరకు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇసుక రవాణా వాహనానికీ డిసెంబరు 10 నాటికి జీపీఎస్‌ జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

* తెదేపా నేతలు రాజధానినే కాకుండా రాష్ట్రాన్ని కూడా శ్మశానం చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, యనమల రామకృష్ణుడు ట్విటర్‌ ద్వారా కొత్త అవతారం ఎత్తారని ఆయన ఎద్దేవా చేశారు. నా వ్యాఖ్యలపై పత్రికాముఖంగా స్పందించలేక ట్వీట్‌లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

* పేరుమోసిన భారతీయ కార్టూనిస్టు సుధీర్‌ దార్‌ నేటి ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 87 సంవత్సరాలు. దార్‌ తన 58 సంవత్సరాల కెరీర్‌లో అనేక ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలతో, పత్రికలతో కలసి పనిచేశారు. 1960 నుండి 2000 వరకు పనిచేసిన ఆర్కే లక్ష్మణ్‌, ఓ.వీ. విజయన్‌, రాజిందర్‌ పురి, అబు అబ్రహాం వంటి భారత దేశపు రెండవ తరం కార్టూనిస్టులలో ఒకరు.

* కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు కేంద్రం సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సిరిసిల్లలో సీపీసీడీఎస్‌ పథకం కింద మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని కేంద్రమంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రకాశ్‌ జావడేకర్‌తో సమావేశమయ్యారు. ఫార్మా సిటీలో జరిగిన అభివృద్ధిని జావడేకర్‌కు ఆయన వివరించారు.

* ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.కె.జైన్‌ సూచించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర రుణాలను ప్రారంభించారు. ఈ పథకం కింద చిన్న, మధ్యతరగతి సంస్థలకు రుణాలను మంజూరు చేశారు. వీటికి వడ్డీరేట్లు చాలా తక్కువ.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాయలసీమ పర్యటన ఖరారైంది. డిసెంబరు 1 నుంచి ఆరు రోజుల పాటు ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. చిత్తూరు, కడప జిల్లాలో పర్యటించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, మేధావులతో చర్చించనున్నారు.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తన భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాడని సమాచారం. కెరీర్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే మహీ ఉన్నాడని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత అతడు జట్టుకు స్వతహాగా దూరమయ్యారు.

* స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా పుణె సమీపంలోని తన ఛకన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని దాదాపు నెలరోజులపాటు నిలిపివేయనుంది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు దీనిని మూసివేయనున్నట్లు సమాచారం. ఎగుమతులు తగ్గడం, దేశీయ డిమాండ్‌ ఆశించిన మేరకు లేకపోవడం, ఆమియో సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌ను, డీజిల్‌ ఇంజిన్ల తయారీని నిలిపివేయడం వంటివిగా భావిస్తున్నారు. కానీ, వీటిని ఫోక్స్‌వ్యాగన్‌ తోసిపుచ్చింది.

* తెలుగు నటీనటుల సంఘంలో నెలకొన్న వివాదాలపై ఆ సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ సినిమా విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ‘మా’ అంతర్గత విభేదాలపై స్పష్టత ఇచ్చారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే తాను ఒక టర్మ్ మాత్రమే అధ్యక్షుడిగా చేస్తానని చెప్పినట్లు నరేష్ పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మంటే ఈ క్షణమే దిగిపోడానికి సిధ్ధంగా ఉన్నానని తెలిపారు.

* మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

* భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగమే మనందరికీ ఆదర్శనమన్నారు. మన ఆదర్శాలు, ఆకాంక్షలతో పాటు భారతీయుల భవిష్యత్‌ కూడా రాజ్యాంగంతో ముడిపడి ఉందన్నారు. దేశంలో అత్యున్నత చట్టం రాజ్యాంగమేనని తెలిపారు.

* తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వైకాపా నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కడప జిల్లాలో వరుసగా రెండో రోజు ఆయన పర్యటిస్తున్నారు. రాజధాని అమరావతిని బొత్స స్మశానంతో పోల్చటం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.మహోన్నత నాగరికత పట్ల అయినా కనీస గౌరవం ఉండాలన్న చంద్రబాబు..అదీ లేకుంటే 5కోట్ల మంది ప్రజలపట్లయినా కనీస మర్యాదలుండాలన్నారు.

* హాస్టల్‌ ఫీజుల పెంపుదలను సమీక్షించేందుకు దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం నివేదిక సమర్పించింది. రుసుముల పెంపుపై విద్యార్థుల ఆందోళనతో జేఎన్‌యూ యాజమాన్యం.. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు 50శాతం తగ్గించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ తగ్గింపును అందరికీ వర్తింపజేయాలని కమిటీ సూచించింది.

* సీఎం జగన్‌తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ.. ఇకపై సీఎం జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా స్తబ్ధుగా ఉన్న వంశీ..ఈరోజు సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు లోగో, నినాదాన్ని ఖరారు చేశారు. ఇందుకోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 6వేల మందికి పైగా ఈ పోటీలో పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపించారు. ఇందులో నుంచి ఓ లోగోను ఎంపిక చేసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

* నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 3లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నిర్లక్ష్యంగా బస్సు నడిపాడంటూ స్థానికులు డ్రైవర్‌ను చితకబాదారు. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. మృతురాలిని టీసీఎస్‌ ఉద్యోగి సోహిని సక్సేనగా గుర్తించారు.

* విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ వంతెనలో రెండో భాగం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని తెదేపా ఎంపీలు కోరారు. తెదేపా లోక్‌సభాపక్షనేత కేశినేని నాని నేతృత్వంలో ఆ పార్టీనేతలు కేంద్రమంత్రిని కలిశారు. విజయవాడ బైపాస్ రోడ్డు, రాజధానిని అనుసంధానించే రోడ్ల అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.

* ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు చెందిన ఎంట్రీ లెవెల్‌ చిన్న కారు ఆల్టో విక్రయాలు 38 లక్షలు దాటాయని సంస్థ ప్రకటించింది. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైన ఈ మోడల్ చిన్న కారు 2016లో 30 లక్షల మార్క్‌ దాటిందని సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ల జాబితాలో గత 15 ఏళ్లుగా మారుతీ ఆల్టో మొదటి స్థానంలో ఉందని ఎంఎస్‌ఐ తెలిపింది.

* దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల అంచనాలు, దేశీయంగా కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సరికొత్త రికార్డులకు దూసుకెళ్లిన సూచీలు.. చివర్లో తడబడ్డాయి. మదుపర్ల లాభాల స్వీకరణ ముందు నిలవలేక నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు పతనమై 40,821 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,038 వద్ద ముగిసింది.