ఇటీవల సెయింట్ లూయిస్ నగరంలో జరిగిన ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి వార్షిక వైజ్ఞానిక మహాసభలో తెలుగువాడైన డా. సురేంద్ర దారాకి “డిస్టింగ్విష్డ్ అచీవ్ మెంట్ అవార్డ్ ఇన్ ఎక్స్టెన్షన్” (కీటకశాస్త్ర విస్తరణలో విశిష్ట సాధన పురస్కారం) లభించింది. ప్రపంచవ్యాప్తంగా 7000 మందికి పైగా సభ్యులున్న ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రతిసంవత్సరమూ వివిధ కీటకశాస్త్ర సంబంధిత రంగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన శాస్త్రవేత్తలకు పురస్కార ప్రదానం చేస్తుంది. రైతులకూ, ఇతరులకూ వుపయోగపడే విధంగా పరిశోధనలు చేసి, ఆ పరిశోధన ఫలాలను సమర్ధవంతంగా ఉపయోక్తలకు అందేట్టు చేసే విభాగంలో ఈ పురస్కారన్ని ఇస్తారు. ఈ పురస్కారాన్ని ప్రారంభించిన 40 సంవత్సరాల్లో మొదటిసారిగా అందుకున్న ఆసియావాసి సురేంద్ర కావడం విశేషం. పర్యావరణహితమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులపై 25 సంవత్సరాలుగా 140 కి పైగా ప్రయోగాలు చేసి, 350 వరకూ పరిశోధనా వ్యాసాలు వ్రాసిన సురేంద్ర ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి వ్యవసాయ, సహజవనరుల విభాగంలో కీటకశాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తూర్పు ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికాలోని అభివృద్ధిచెందే పలుదేశాల్లోని రైతులకు సమగ్ర సస్యరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై తరచూ శిక్షణనిచ్చే సురేంద్ర దారా పుట్టిందీ, పెరిగిందీ తూర్పుగోదావరిజిల్లా పెద్దాపురంలో. బాపట్ల వ్యవసాయ కళాశాలలోనూ, ఆపై అమెరికాలోని వర్జీనియా టెక్ లోనూ చదువుకున్న సురేంద్ర పశ్చిమాఫ్రికా, కెనడా, అమెరికాలోని పలుప్రాంతాల్లో పనిచేసారు.
పెద్దాపురం శాస్త్రవేత్తకు అమెరికా పురస్కారం
Related tags :