DailyDose

నేడు కూడా లాభాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం-11/27

Indian Stock Markets Still In Profits-Telugu Breaking News-11/27

* దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 60, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.36 గా ఉంది.
*సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ డిఫెన్స్‌లో అడ్వాన్స్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను అందించడానికి టాలెంట్‌స్ర్పింట్‌, ఐఐటీ కాన్పూర్‌ చేతులు కలిపాయి. సైబర్‌ సెక్యూరిటీలో తాజాగా వచ్చిన ధోరణులతో ఈ సర్టిఫికేషన్‌ కోర్సును రూపొందించామని, తొలి బ్యాచ్‌ 2020 మొదట్లో ప్రారంభమవుతుందని టాలెంట్‌ స్ర్పింట్‌ సీఈఓ శంతనూ పాల్‌ తెలిపారు.
*కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి పట్టుబడటంతో పాటు అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలున్న 21 మంది ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ (కంపల్సరీ రిటైర్‌మెంట్‌) కింద తాజాగా ఉద్వాసన పలికినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.
*ఐటీ-బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) ఉద్యోగుల్లో ఆంగ్ల ప్రావీణ్యతను మెరుగుపరిచేందుకు గాను బ్రిటిష్‌ కౌన్సిల్‌తో నాస్కామ్‌ జట్టు కట్టింది. దీంతో 2 లక్షల మందికి నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ వేదికపై ఇంగ్లీష్‌ స్కోరు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు ఆంగ్ల పరీక్షల్ని నిర్వహించనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఉద్యోగుల వృద్ధికి ఆంగ్ల భాష ఒక అడ్డంకి కాకూడదనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు పేర్కొన్నాయి. భారత వృద్ధిలో 6.6 శాతం వాటా బీపీఎం పరిశ్రమదే. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న 40 లక్షల మందికి ఆంగ్ల ప్రావీణ్యతను పెంపొదిస్తే.. అది భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఉపకరిస్తుందని నాస్కామ్‌ వివరించింది.
*మూత్ర పిండాల రోగులకు డయాలిసిస్‌ సేవలందిస్తున్న నెఫ్రోప్లస్‌ విదేశాలకు సేవలను విస్తరిస్తోంది. రెండు నెలల్లో వియత్నాం, ఇండోనేషియాల్లో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నెఫ్రోప్లస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉప్పల విక్రమ్‌ తెలిపారు.
*టాటా మోటార్స్‌ కొత్త ఎస్‌యూవీకి గ్రావిటాస్‌ అని పేరును ప్రకటించారు. లాండ్‌రోవర్‌ డి8 ప్లాట్‌ఫామ్‌పై ఒమేగా ఆర్కిటెక్చర్‌తో పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తయారైన ఈ ఎస్‌యూవీని ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. విలాసంలోను, పనితీరులోను కూడా ఇది ఇతర ఉత్పత్తులకు గట్టి పోటీ ఇస్తుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు.
*టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ.. బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4 వీ, అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ మోటార్‌ సైకిళ్లను విడుదల చేసింది. ఆర్‌టీఆర్‌ 4వీ మోటార్‌సైకిళ్లను సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌, రేస్‌ గ్రాఫిక్స్‌ సహా ఇతర గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దినట్లు తెలిపింది. 197.75 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ-డీసీ ధర రూ.1.24 లక్షలుండ గా ఆర్‌టీఆర్‌ 160 4వీ (డిస్క్‌) ధర రూ.1.03 లక్షలని టీవీఎస్‌ తెలిపింది. కాగా ఆర్‌టీఆర్‌ 160 4వీ (డ్రమ్‌) ధర రూ.99,950 లుగా ఉందని పేర్కొంది.