1. పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్‌ఎల్‌వీ సంకేతాలను అంటార్కిటకలోని ఇస్రో కేంద్రం అందుకుంది.
2. కాపు నేస్తం పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించే కాపు నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపునకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి కొత్త కార్డుల పంపిణీ, అసైన్డ్ భూముల వ్యవహారం, మైనింగ్ లీజుల రద్దు ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి.
3. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం కొనసాగుతోంది. విధుల్లోకి చేర్చుకోవాలని డిపోల ఎదుట కార్మికులు రెండో రోజు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్దకు కార్మికులు చేరుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
4. ‘మహా’ గవర్నర్ మార్పు..?
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని మారుస్తారని, రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
5. అజిత్ స్థానం పదిలం..!
‘తాను గతంలో ఎన్సీపీలోనే ఉన్నానని.. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నానని’ ఇటీవల చెప్పిన మాటలను అజిత్ పవార్ మరోసారి గుర్తు చేశారు. అంతకుముందు ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. అజిత్ పవార్‌ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్షమించారని తెలిపారు. చివరకు తన తప్పుని తెలుసుకొని అజిత్ పార్టీలోకి తిరిగొచ్చారన్నారు. అందుకే పార్టీలో ఆయన స్థానానికి ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు.
6. మళ్లీ తిరిగి వస్తాం..: అమృత ఫడణవీస్
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన భార్య అమృత మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ హిందీలో ట్విట్ చేశారు. ‘త్వరలోనే తిరిగి వచ్చి కొమ్మలపై పరిమళాలను వెదజల్లుతాం. ప్రస్తుతం శరదృతువు నడుస్తుంది. వాతావరణం మారేంత వరకు వేచి చూస్తాం’ అంటూ ఆమె హిందీలో ట్విట్ చేశారు.
7. సంపూర్ణేష్‌బాబుకు తప్పిన ప్రమాదం
సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు ప్రమాదం తప్పింది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో సంపూర్ణేష్‌తోపాటు భార్య,కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.
8. శబరిమల చేరకుండానే వెనుతిరిగిన తృప్తి దేశాయ్
మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ భద్రతా కారణాలతో శబరిమలకు చేరకుండానే వెనక్కివెళ్లారు. ఆమెకు, సహచరులైన ఏడుగురు మహిళలకు శబరిమల దేవాలయం వరకు రక్షణ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పడంతో తృప్తి ఈ నిర్ణయం తీసుకొన్నారు.
9. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 60, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.36 గా ఉంది.
10. రాజధాని శ్మశానం అయితే కాటి కాపరి ఎవరు?: కూన రవికుమార్
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మతితప్పి పిచ్చోడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆందోళన బొత్స ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజధాని అమరావతి శ్మశానం అయితే కాటి కాపరి ఎవరో చెప్పాలన్నారు. బొత్స బరువు కాదు..అహంకారం తగ్గించుకోవాలన్నారు. జగన్ అవినీతిని హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా పెట్టిందని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు
నేటి పది ప్రధానవార్తలు – 11/27
Related tags :