1. మార్గశిర మాస విశిష్టత ఇదే. – ఆద్యాత్మిక వార్తలు – 11/27
మాసానాం మార్గశీర్షోహం – అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ, కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమనీ చెప్పాడు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది.
లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాల పుణ్యప్రదం. కుదరనివారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతీరోజూ శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో, మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు.మార్గశిర శుద్ధషష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలూ, ఉత్సవాలూ, నాగప్రతిష్టలూ జరుగుతాయి.మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవావతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంది కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవస్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.మార్గశిర శుద్ధేకాదశి *శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా *మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా, సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. భగవద్గీత నిత్యపారాయణ, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ, విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేయాలి.మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో తోలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.మార్గశిర శుద్ధపూర్ణ శ్రీ దత్తజయంతి. దీనినే కోరలపూర్నిమ, నరక పూర్ణిమ అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్ర్యనసూయలకు జన్మిన దత్తాత్రేయుడు, మౌనముద్రతోనే ఉపదేశం చేసి, పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్త్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి, ఆ పరమగురువుని స్మరించుకుంటారు.
మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్త్యనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.
ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది.
2. శరవేగంగా యాదాద్రి ఆలయం పనులు
యాదాద్రి ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, స్తపతి సలహాదారు ఆనందచార్యుల వేలు, ఆర్కిటెక్ ఆనందసాయి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.యాదాద్రి గర్భాలయం ముఖద్వారంపై అమర్చేందుకు పంచలోహంతో తయారు చేసిన హిరణ్యాక్షుడి రాజ్యసభను తిలకించారు. ప్రహ్లాదుడి చరిత్ర తెలుపుతూ 10 ఫ్యానల్ను గర్భాలయ ముఖ ద్వారంపై అమర్చనున్నారు. అంతేకాకుండా రాతితో తయారు చేసిన ద్వారపాలకుడిని అమర్చనున్నారు. యాదాద్రి పనులను ఎప్పటికప్పుడు వైస్ చైర్మన్ కిషన్రావు, స్తపతిసలహాదారు ఆనందచార్యుల వేలు, అనందసాయిలు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులన్నీ ఈ నెల చివరి వరకు పూర్తిచేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఉప స్తపతులు, సహాయ స్తపతులు శ్రమిస్తున్నారు.
3. కల్యాణానికొక ముడి!
తిరుమల కల్యాణవేదికలో టీటీడీ ద్వారా పెళ్లి చేసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా ‘అన్మ్యారీడ్ సర్టిఫికెట్’ ఉండాల్సిందే! ఈ మేరకు టీటీడీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. రెండునెలల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇకపై దానిని కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి తిరుమలలోని ‘కల్యాణవేదిక’లో టీటీడీనే ఉచితంగా వివాహాలు జరిపిస్తుంది. దీనికోసం వధువు, వరుడు పుట్టినతేదీలు, విద్యార్హతా పత్రాలు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. వధువు, వరుడి తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరుకావాలి. ఒకవేళ ఏవరైనా మరణించి ఉంటే, వారి డెత్ సర్టిఫికెట్ జతచేస్తేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. అయితే ఇటీవల టీటీడీకి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి.కొందరు భార్య లేక భర్త విడిపోయి తిరుమలలో రెండో వివాహం చేసుకోవటంతో మొదటి భర్త లేక మొదటి భార్య నుంచి ఇబ్బందులొస్తున్నాయి. దీంతో ఇతర పత్రాలతో పాటు ‘ఆన్మ్యారీడ్ సర్టిఫికెట్’ కూడా జత చేయాలని నిబంధన విధించారు. ఎవరైనా ఆ సర్టిఫికెట్ తీసుకురాకపోతే వధువు, వరుడి వయస్సు 25లోపు ఉన్నా, టీటీడీ ఉద్యోగుల్లో ఎవరైనా తెలిసినవారుఉన్నా లేఖ రాయించుకుని పెళ్లికి అనుమతిస్తున్నారు. వయసు అధికంగా ఉండేవారిని మాత్రం ఇప్పటిదాకా తిరస్కరిస్తున్నారు. ఇకమీదట అందరికీ ‘అన్మ్యారీడ్ సర్టిఫికెట్’ తప్పనిసరి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వధువు,వరుడు తమ ప్రాంతాల ఎమ్మార్వో లేక తహసీల్దార్ నుంచి ఈ సర్టిఫికెట్ పొంది అందజేయాల్సి ఉంటుంది. ఎమ్మార్వో, తహసీల్దార్ అందుబాటులో లేకపోతే వీఆర్వో, గ్రామ పంచాయతీ బాధ్యుల నుంచి సర్టిఫికెట్ తీసుకురావచ్చు. మరోవైపు కల్యాణవేదికలో జరిగే వివాహ వేడుకను వీడియో రికార్డు చేసుకునేందుకు అదనపు లైట్ల అమరికకు వీలులేదని టీటీడీ కొత్త నిబంధన విధించింది. వీడియోగ్రఫీ కోసం అదనపు ఫ్లడ్లైట్ల ఏర్పాటుకు వినియోగించే విద్యుత్కేబుళ్ల వల్ల కరెంట్షాక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సాధారణ లైటింగ్తో మాత్రమే ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని, అదనపు లైట్ల వైరింగ్ ఏర్పాటు చేయటం నిషిద్ధమని కల్యాణవేదికలో సూచికబోర్డులు ఏర్పాటుచేశారు.
4. శుభమస్తు
తేది : 27, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋవు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న రాత్రి 8 గం॥ 40 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 4 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(నిన్న ఉదయం 9 గం॥ 26 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 14 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 1 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 34 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 1 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 13 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : వృచ్చికము
చరిత్రలో ఈ రోజు/నవంబర్ 27
1888 : లోక్‌సభ మొదటి అధ్యక్షుడు జి.వి.మావలాంకర్ జననం (మ. 1956).
1907 : హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ జననం.(మ.2003)
1935 : భారత క్రికెట్ క్రీడాకారుడు ప్రకాష్ భండారి జననం.
1940 : ప్రపంచ ప్రసిద్ద యుద్ద వీరుడు బ్రూస్ లీ జననం (మ.1973).
1953 : హిందీ సినిమా సంగీత దర్శకుడు బప్పీలహరి జననం.
1974 : కవి, పత్రికా సంపాదకుడు శీరిపి ఆంజనేయులు మరణం. (జ.1861).
1986 : భారత క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా జననం.
2008 : భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం.
5. హ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
27.11.2019 వతేది, బుధవారము ఆలయ సమాచారం
శ్రీ స్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికాల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ.. అనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు… అభిషేక సేవా అనంతరము శ్రీస్వామి వారి దర్శనము ఉ.10.00 గంటల నుండి మధ్యహ్న 12.00 గంటల వరకు వుండునుశ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వారి అర్జిత కళ్యాణోత్సవము ఉదయము 11.00 గంటల నుండి ప్రారంభమగునురెండవ మహాగంట నివేదనమ.12.30 నుండి 1.00 లోపు, బాలబోగ్యం త్రికాల నైవేద్యాము సమర్పణమ 1.00 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికాల నైవేద్యాదులు సమర్పణ మహ మంగళ హారతి, పరివార దేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
ఆర్జిత సేవాల వివరములు
27.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్ : 21
27.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 3
27.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) శ్రీవారి అర్జిత కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు బుకింగ్ : 1
నేత్రపర్వంగా కార్తీక లక్ష దీపోత్సవం..
కార్తీక మాస అమావాస్య సందర్భంగా నెల్లూరు రూరల్ పెద్దచెరుకూరులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం నేత్రపర్వంగా సాగింది. శివలింగం, నంది, ఓంకారం, స్వస్తిక్, ఓం ఆకారాల్లో దీపాలు వెలిగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయ ప్రాంగణం కార్తీక శోభను సంతరించుకుంది. ఈ పూజా కార్యక్రమాలను అర్చకుడు మోహన కృష్ణ నేతృత్వంలో నిర్వహించగా ఏర్పాట్లను వెడిచర్ల రాజారెడ్డి, అభిలాష్ రెడ్డి పర్యవేక్షించారు.
6. బరిమల చేరకుండానే వెనుతిరిగిన తృప్తి దేశాయ్
మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ భద్రతా కారణాలతో శబరిమలకు చేరకుండానే వెనక్కివెళ్లారు. ఆమెకు, సహచరులైన ఏడుగురు మహిళలకు శబరిమల దేవాలయం వరకు రక్షణ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పడంతో తృప్తి ఈ నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం ఉదయం కేరళకు చేరుకున్న ఆమె భద్రత కోసం ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఆమెకు భద్రత కల్పించలేమని అధికారులు చెప్పడంతో పుణెకు తిరిగి పుణెకు వెళ్లాలని నిశ్చయించుకొన్నారు. ఈలోగా కమిషనర్ కార్యాలయం వద్దకు ‘శబరిమల కర్మ సమితి’ సభ్యులు చేరుకొని తృప్తి, అమె బృందానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా తృప్తి మాట్లాడుతూ, ‘‘శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై న్యాయస్థానం స్టే ఇవ్వలేదు. అందువల్లే గుడికి వెళ్లేందుకు ఉదయం ఇక్కడకు చేరుకున్నాము. కానీ, వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. రక్షణ కల్పించమని కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాము. కేసు విచారణలో ఉన్నందున భద్రత కల్పించలేమని పోలీసులు అన్నారు. ఇది సరికాదు’’ అని చెప్పారు. తను, మిగిలిన మహిళలు పోలీసుల భద్రత మధ్య కార్యాలయంలో ఉండటం కూడా సురక్షితం కాదని అధికారులు చెప్పడంతో వాపస్ వెళ్లక తప్పలేదని తృప్తి వెల్లడించారు. తాను భవిష్యత్తులో కూడా ఇక్కడకు వస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు రాజకీయ పార్టీలతో సంబంధమున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు.
7. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ‘పోలి స్వర్గం నోము’ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా … ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.ఇక కథలోకి వెళితే … ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది అయిన కోడలే ‘పోలమ్మ’. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం … పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి … పూజలు చేయడానికి … అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి … పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపిందిఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు … కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది.
8. శ్రీశైలం, శ్రీశైల దేవస్థానంలో, ప్రారంభమైన హుండీల లెక్కింపు. కార్తీక మాసములో హుండీల ద్వారా లభించిన నగదు, వెండి, బంగారం లెక్కింపు. లెక్కింపు నిర్వహిస్తున్న దేవస్థాన సిబ్బంది, శివసేవకులు.
దేవస్థాన అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో.
నిఘా కెమెరాల చిత్రీకరణతో లెక్కింపు….
9. జనవరి 6న వైకుంఠ ఏకాదశి
* 10 రోజుల పాటు ద్వారాలు తెరవాలని నిర్ణయం
* మరింత మందికి వైకుంఠ దర్శనం కోసమే
* ఆగమ శాస్త్ర నిపుణులు అంగీకరించారన్న టిటిడి అధికారులు.
వైకుంఠ ద్వారాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టిటిడి భావిస్తోంది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. ఆగమ శాస్త్ర నిపుణులు ఇందుకు అంగీకరించారని, పాలక మండలి ఆమోదం తరువాత నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల భక్తుల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. జనవరి 6 న వైకుంఠ ఏకాదశి రానుంది. పాలక మండలి అంగీకరిస్తే, అప్పటి నుంచి సంక్రాంతి పండగ ముగిసేవరకూ ఈ ద్వారం తెరచుకునే ఉంటుందన్నమాట…
10. భద్రాదిలో నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. అదేవిధంగా రంగనాథస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈనెల 28వ తేదీ (గురువారం) తాతగుడి సెంటర్‌లో వేంచేసి ఉన్న గోవిందరాజస్వామివారికి పంచామృతాభిషేకం, 29వ తేదీ శుక్రవారం సందర్భంగా స్వర్ణ కవచాలంకరణ, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం, మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు బీపీఎల్ భక్తబృందంచే లక్ష్మీఅష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 5గంటలకు ఆరాధన, సంధ్యాహారతులు, రాత్రి 7గంటలకు దర్భార్‌సేవ, 8 గంటలకు చుట్టుసేవ, 9గంటలకు పవళింపు సేవ నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. డిసెంబర్2వ తేదీ రాజా తూము నర్సింహదాసు జయంతి ఉత్సవాలు ప్రారంభమవు తాయని వెల్లడించారు.డిసెంబర్ 6నుంచి 10వరకు అంతరాలయంలో తిరుమంగైళ్వార్ తిరునక్షత్రోత్సవాలు, 8వ తేదీ గీతా జయంతి, శ్రీవైష్ణవి ఏకాదశి, 11వ తేదీ తిరుప్పాణ్యాళ్వార్ తిరునక్షత్రోత్సవం, 12వ తేదీ కృత్తికా దీపోత్సవం సందర్భంగా సాయంత్రం అంకురారోపణ యాగశాలలో నిర్వహించబడునని పేర్కొన్నారు. 16వ తేదీ రాత్రి 11.54నిమిషాలకు ధనుసంక్రమణ ప్రవేశం, 17వ తేదీ ఉదయం తెల్లవారుజామున 4గంటలకు తెరిచి 5గంటల వరకు ఆరాధన నిర్వహిస్తారు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులను కండన్, ఆండాల్ అమ్మవారిని వేంచేయింప చేసి అభిషేకం నిర్వహిస్తారు.5నుంచి 6గంటల వరకు తిరుప్పావై 30 పాశురాలు విన్నపం చేసిన పిదప, 7నుంచి 8.30నిమిషాలకు అమ్మవారిని తాతగుడిసెంటర్ వరకు తిరువీధిసేవ గావిస్తారు. 26వ తేదీ సూర్యగ్రహణం సందర్భంగా 25వ తేదీ రాత్రి ఆలయ తలుపులు మూసివేసి 26వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శాంతి హోమాలు నిర్వహించి, సాయంత్రం 3.30నిమిషాలకు భక్తులకు సర్వదర్శనం కల్పించబడునని తెలిపారు.
11. శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భావిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేసింది. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. ఈ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి అంగీకరించింది. ఒకవేళ పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది.