చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన వర్తక సుంకాల వల్ల మనదేశంలో బాగా లాభపడిన రంగాల్లో క్వార్ట్జ్ స్టోన్ తయారీ పరిశ్రమ ఒకటి. గత ఏడాది కాలంలో దీనివల్ల మనదేశంలో నుంచి క్వార్ట్జ్ స్టోన్ ఎగుమతులు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. ఇదే అదనంగా ఈ రంగానికి చెందిన సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని బహుముఖంగా విస్తరించే సన్నాహాలు చేపట్టాయి. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న సంస్థలు కొన్ని కాగా, మరికొన్ని సంస్థలు అయితే పూర్తిగా నూతన కర్మాగారాలను స్థాపించే పనిలో నిమగ్నమయ్యాయి. మరోపక్క కొన్ని చైనా కంపెనీలు మనదేశంలో క్వార్ట్ స్టోన్ తయారీ సంస్థలకు పెట్టుబడులు/ యంత్ర సామగ్రి సమకూర్చి ఇక్కడి నుంచి యూఎస్‌కు ఎగుమతులు నిర్వహించటానికి ప్రయత్నాలు ఆరంభించాయి. ఇలా ఎన్నో రకాలుగా మనదేశంలోని క్వార్ట్జ్ స్టోన్ తయారీ సంస్థలకు, ముఖ్యంగా రంగానికి మేలు జరిగింది. ఇప్పటికే ఇక్కడి నుంచి క్వార్ట్జ్ సర్ఫేస్ ఉత్పత్తులు అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఇటీవలి పరిణామాల వల్ల వచ్చే నాలుగైదేళ్లలో వీటి ఎగుమతులు బాగా పెరుగుతాయని, పరిశ్రమకు ఇదొక సువర్ణావకాశమని అందరూ భావిస్తున్న తరుణంలో అమెరికా ప్రభుత్వ వర్తక సుంకాల రూపంలో విరుచుకుపడింది.
భారత్‌తో పాటు టర్కీ నుంచి క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని, దీనివల్ల అమెరికా సంస్థలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ కొంతకాలం క్రితం కాంబ్రియా అనే సంస్థ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ (యూఎస్డీఓసీ) ముందు ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై దాదాపు గత ఆరు నెలలుగా విచారణ సాగుతోంది. మనదేశానికి చెందిన కంపెనీలు దీనిపై అక్కడ న్యాయవాదులను పెట్టుకొని తమ వాదన వినిపిస్తున్నాయి. తమపై సుంకాల భారం మోపటానికి వీల్లేదని పేర్కొంటూ అందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తున్నాయి. కానీ ప్రాథమికంగా మనదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులపై 4.32 శాతం అదనపు సుంకాన్ని (సీవీడీ- కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ) విధించింది. దీన్ని వ్యతిరేకించేందుకు దేశీయ కంపెనీలు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సుంకాన్ని ఏకంగా 83.79 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశీయ కంపెనీలు కంగుతిన్నాయి. ఇది అన్యాయం, అక్రమం… అని వాపోతున్నాయి.
క్వార్ట్జ్ స్టోన్ దేశీయ వినియోగం ఎంతో తక్కువ. దాదాపు 90 శాతానికి పైగా ఎగుమతులే జరుగుతాయి. అందులోనూ యూఎస్ మార్కెట్‌కే ఎగుమతులు ఎక్కువ. ఇంత పెద్దఎత్తున సుంకాల భారాన్ని స్థానిక కంపెనీలు భరించలేని పరిస్థితి. దీనివల్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. అసలు తమపై ఇంత అధిక సుంకాల భారాన్ని మోపటానికి అవకాశమే లేదు, ఇలాంటి నిర్ణయం యూఎస్డీఓసీ ఎందుకు తీసుకుందో అర్ధం కావటం లేదు- అని స్థానిక పరిశ్రమ ప్రతినిధి ఒకరు అన్నారు. క్వార్ట్జ్ స్టోన్ తయారీలో అగ్రగామి సంస్థ అయిన పోకర్ణ లిమిటెడ్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది కాక దివ్యశక్తి గ్రానైట్స్ కూడా క్వార్ట్జ్ స్టోన్ తయారీలోకి అడుగుపెట్టింది. ఇంకా గుజరాత్, మహారాష్ట్రలో ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ ఈ నిర్ణయం పెను నష్టం చేస్తుందని అంటున్నారు.
ఈ ఏడాది మే నెలలో ‘కాంబ్రియా’ అనే యూఎస్ సంస్థ చేసిన ఫిర్యాదుపై ఇంకా విచారణ పూర్తికాలేదు. ప్రాథమిక పరిశీలన అనంతరం 4.32 శాతం పన్ను భారాన్ని మోపారు. అదే ఎక్కువ అనుకుంటుంటే అనూహ్యంగా దానికి ఇరవై రెట్లు అధికంగా 83.79 శాతం పన్ను విధించటం ఎంతమాత్రం సమంజసంగా లేదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి అధిక సబ్సిడీలు పొందిన సంస్థలు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో తక్కువ ధరకు విక్రయించగలుగుతాయి. చైనా కంపెనీలు చేసేది అదే. కానీ మనదేశంలో క్వార్ట్జ్ స్టోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పెద్దగా లభించే సబ్సిడీలు లేవు. అందువల్ల డంపింగ్ డ్యూటీలు ఇష్టానుసారం విధించటానికి వీల్లేదు. ఇదే విషయాన్ని యూఎస్డీఓసీ ముందు మనదేశానికి చెందిన కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికి తమకు వ్యతిరేకంగా నిర్ణయం రావటం నిరుత్సాహాన్ని కలిగించిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. తదుపరి సమీక్షలో అయినా దీన్ని రద్దు చేయటం లేదా బాగా తగ్గించటానికి యూఎస్డీఓసీ సిద్ధపడేలా తమవంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికి అయితే ఇది ఎంతో నష్టం కలిగించే పరిణామంగా భావిస్తున్నాయి.
QuartzStoneపై అమెరికా పిడుగు
Related tags :