ఏదైనా ఫంక్షన్ వచ్చినా.. పండుగలు వచ్చినా… చాలా మంది కొనాలనుకునేది బంగారాన్నే. ఈ కొనుగోళ్లు కూడా సాధారణంగా కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. బంగారాన్ని కొన్న తర్వాత చాలా మంది రిసిప్ట్స్ దాచుకోవడం మర్చిపోతుంటారు. అయితే ఈ రిసిప్ట్స్‌ను చాలా భద్రంగా దాచుకోవాలట. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు, ఎక్కడ నుంచి, ఎంత మొత్తంలో బంగారం కొన్నారో చూపించడానికి ఈ రిసిప్ట్సే ఆధారంగా పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక ట్యాక్స్ స్క్రుటినీ సమయంలో కూడా ఈ రిసిప్ట్స్ ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. ‘ఇన్‌వాయిస్‌లు దాచిపెట్టుకునే వారు, ఎక్కడ నుంచి గోల్డ్ కొన్నారో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు వివరించేందుకు ఆందోళన చెందాల్సినవసరం లేదు. రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి’ అని క్లియర్‌ట్యాక్స్ సీఈవో, ఫౌండర్ అర్చిత్ గుప్తా తెలిపారు. ఒకవేళ మీకు రూ.50 లక్షలు మించి ఆదాయం ఉంటే, రిటర్న్‌లు ఫైల్ చేసేటప్పుడు కచ్చితంగా మీ దగ్గర ఉన్న గోల్డ్ హోల్డింగ్‌ను వెల్లడించాలి. జువెల్లరీ కూడా దీనిలో భాగమే. వారసత్వంగా వచ్చిన బంగారానికైతే, ఒరిజినల్ కొనుగోలుదారు ఈ బంగారానికి ఎంత చెల్లించాడో తెలపాల్సి ఉంటుందని గుప్తా అన్నారు. ఒకవేళ కొన్నప్పుడు దీని ధర ఎంత ఉందో వివరాలు లేకుంటే.. 2001 ఏప్రిల్ 1న మార్కెట్ వాల్యు ఎంత ఉంటే అంత వెల్లడించాల్సి ఉంటుందని గుప్తా చెప్పారు. గోల్డ్‌ను ఇండియా వెలుపల కొంటే, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో దీన్ని ఫారిన్ అసెట్ షెడ్యూల్‌లో కచ్చితంగా చూపించాలని ట్యాక్స్‌స్పానర్.కామ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ సుధీర్ కౌషిక్ చెప్పారు. గోల్డ్ అనేది క్యాపిటల్ అసెట్(మూలధన ఆస్తి). ఎలాంటి మూలధన లాభాలను పన్ను చెల్లింపుదారుడు ఆర్జించినా.. దానిపై పన్ను అనేది తప్పనిసరిగా కట్టాలి. మూడేళ్ల కంటే తక్కువ ఏళ్ల నుంచి గోల్డ్ మీ దగ్గరుంటే, దానిపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ మూడేళ్ల కంటే ఎక్కువ ఏళ్ల నుంచి ఉంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 20 శాతం పన్ను చెల్లించాలి. గోల్డ్ అమ్మితే మూలధన లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది రిసిప్ట్స్ ఉంటేనే.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌కు చూపించడానికి వీలవుతుందని కౌషిక్ తెలిపారు. ఎంతైనా గోల్డ్ ఉండొచ్చు… సీబీడీటీ సర్క్యూలర్ ప్రకారం మీ దగ్గర ఎంత బంగారం ఉండాలనే విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. అయితే ట్యాక్స్ స్క్రుటినీ సమయంలో మాత్రం జువెల్లరీ కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో వివరించాల్సి ఉంటుంది. అలాగే వారసత్వంగా వచ్చే గోల్డ్ హోల్డింగ్‌పై కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. ఎససీల ఇన్‌కమ్ రికార్డులు ఒక్కోసారి మ్యాచ్ కాకపోయినా.. పెళ్లి అయిన మహిళ వద్ద 500 గ్రాములు, పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల జువెల్లరీ, ఆభరణాలుంటే పన్ను అధికారులు వాటి జోలికి వెళ్లరు. అయితే కుటుంబ సభ్యులది కాకుండగా.. వేరే ఎవరిదైనా జువెల్లరీ ఒకఎససీ వద్ద ఉన్నట్టు పన్ను అధికారులు గుర్తిస్తే మాత్రం, దాన్ని అధికారులు సీజ్ చేసి, స్వాధీనం చేసుకుంటున్నారు.
బంగారం రశీదులు పారేయకుండా దాచుకోండి
Related tags :