Food

జామపండుతో మలబద్ధకం నివారణ

Guava Fruit Helps Indigestion And Constipation-Telugu Food And Diet News

ఆరోగ్యానికి ఎవరైనా యాపిల్‌‌‌‌ లేదా దానిమ్మ తినమంటరు కానీ.. మీరేంది జామ పండు తినమంటరు? సర్ది, దగ్గుతో బాధపడమంటున్నరా? అంటారు ఎవరికైనా జామపండు తినాలని చెప్తే. కానీ.. ఆ పండే ఆరోగ్యానికి దివ్యౌషధం అంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత రోగాలకు జామ చెక్‌‌‌‌ పెడుతుందట. ఇది ఒళ్లు నొప్పులు తగ్గించి, ఆకలి పెంచడంలో కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు.జామ ఏడాది పొడవునా అడపాదడపా దొరుకుతున్నా.. చలికాలం మాత్రం ఈ పండ్లకు స్పెషల్‌‌‌‌ సీజన్‌‌‌‌. ప్రపంచంలో సుమారు అన్ని దేశాల్లోనూ దొరుకుతుంది. ఆసియా దేశాల్లో అయితే చాలా ఎక్కువగా పండుతుంది. ఈ పండ్లతో చాలా పేద కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, భూపాలపల్లి, పలిమెల, మహదేవ్పూర్, కాటారం, మల్హర్ మండలాల గ్రామాల నుంచి చాలా మంది మహిళలు జామ పండ్లను తీసుకుని పట్టణ ప్రాంతాలకు వెళ్లి అమ్ముతుంటారు. *ఔషధ గుణాలు పుష్కలం జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌‌‌‌గా పనిచేస్తుంది. కణజాలం పొరను రక్షిస్తుంది. కొలెస్టరాల్‌‌‌‌ను తగ్గిస్తుంది. జామ ఆకులను నమిలితే పంటి నొప్పులు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్లకు ఇది మంచి మెడిసిన్‌‌‌‌. ఎందుకంటే వీటిలో విటమిన్‌‌‌‌–ఎ, విటమిన్‌‌‌‌–సి ఎక్కువగా ఉంటాయి. మినరల్స్‌‌‌‌, పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువే. జామ ఆకులను 1950లో ఔషధ పరిశోధనల్లో అంశంగా చేర్చారు. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు క్యాన్సర్‌‌‌‌, బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు, నొప్పి నివారణ కోసం వాడుతున్నారు. ఈ ఆకుల నుంచి తయారుచేసిన నూనెలు క్యాన్సర్‌‌‌‌ను తగ్గించేందుకు పనిచేస్తాయి. ఈ ఆకులను నాటు వైద్యంలో డయేరియాకి మందుగా వాడతారు. బెరడు యాంటీ మైక్రోబియల్‌‌‌‌, ఆస్ట్రింజెంట్‌‌‌‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. జీర్ణశక్తికి.. జామకాయ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అన్నం తిన్న తర్వాత జామపండ్లు తింటే తొందరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి. గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్, జీర్ణాశయ అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పచ్చి కాయ తింటే చిగుళ్లు గట్టిపడతాయి. గుప్పెడు జామకాయ ముక్కలను తీసుకుని బాగా ఎండబెట్టి దానికి సైంధవ లవణం వేసి మెత్తగా పొడి చేసి సీసాలో నిల్వ చేసుకుని రోజూ పండ్ల పొడిలా వాడితే దంతాలు గట్టి పడతాయి. చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

* మలబద్ధకం నివారణ బాగా పండిన జామ పండ్లపై కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం చల్లుకుని తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అతిసారం, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటివి తగ్గుతాయి.
* జలుబు నుంచి ఉపశమనం జామలో విటమిన్– సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైరస్ వల్ల వచ్చే జలుబు నివారణకు బాగా పని చేస్తుంది. కానీ, జామలో ఉండే కొన్ని లక్షణాల వల్ల కఫం ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. దీనితో కొంతమందికి మాత్రం జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడి చేసి సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే సరిపోతుంది.
* మైగ్రెయిన్ నివారణ దోరజామను సానరాయి మీద గంధంలా చేసి రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రెయిన్‌‌‌‌తో బాధపడే వాళ్లు దీనిని సూర్యోదయానికి ముందే రాస్తే బాధ నుంచి ఉపశమనం ఉంటుంది. జామపండ్లను చిన్న ముక్కలుగా తరిగి రెండు మూడు గంటలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం పొందవచ్చు.