Devotional

శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు

Kanaka Mahalakhsmi Margasira Utsavam In Uttarandhra-Telugu Devotional News

1.సిరుల తల్లి శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు
ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సత్యంగల తల్లిగా.. కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా, ఆంధ్రజనావళికి అమ్మగా భాసిల్లుతోంది విశాఖపట్నం నగరం ఓడరేవు ప్రాంతంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. తనని సేవించడానికి వర్ణ, వర్గ వివక్షతలేవి ఉండకూడదని అమ్మవారు తనకు గుడి కట్టవద్దని భక్తులకు ఆదేశం ఇవ్వడంతో ఆ తలంపును విరమించుకున్నారు. పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఈ ఆలయ ప్రత్యేకత.
** శ్రీకనక మహాలక్ష్మీ విగ్రహం ఇతర దేవాలయాల వలే గాక గోపురం లేని బహిరంగ మండపంలో ప్రతిష్ఠింపబడింది. భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అమ్మవారికి ప్రీతికరమైన గురువారం తెల్లవారింది మొదలు రాత్రి వరకు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి, నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు. అమ్మవారి ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు.
***రాష్ట్రంలో 10 దేవాలయాల్లో ఒకటి
రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల్లో కనకమహాలక్ష్మి దేవాలయం ఒకటి. మార్గశిర మాసోత్సవాల్లో నెలరోజులు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి కనబడుతోంది.
***మార్గశిర మాసోత్సవాలు..
శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో వచ్చే గురువారాల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నెల 28, డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే గురువారాల్లో ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు, విశేషపూజలు నిర్వహిస్తుంటారు. డిసెంబర్‌ 15న వేదసభ, 21న రథోత్సవం, 22న అర్చక సదస్సు, 26న సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. 19న మహాన్నదానం జరపనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో మాదిరిగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. మార్గశిర మాసం చివరి గురువారం మరింత పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నారు.
****మార్గశిర గురువారాల్లో జరిగే విశిష్ట కార్యక్రమాలు
బుధవారం రాత్రి(తెల్లవారితే గురువారం)
12.05 నుంచి 1.30 గంటల వరకు విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన పూజ, స్వర్ణాభరణ అలంకరణ
1.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు సర్వదర్శనం
11.30 నుంచి 12 గంటల వరకు మహానివేదన(రాజభోగం)
మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన , స్వర్ణాభరణ అలంకరణ
రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు
ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర నామార్చన
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం
11.30 నుంచి మ«ధ్యాహ్నం 12.30 గంటల వరకుపంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన
12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం
రాత్రి 7 నుంచి వేకువజాము 4.30 గంటల వరకు సర్వదర్శనం
మండపంలో జరుగు వైదిక కార్యక్రమాలు.. (గురువారం మినహా..)
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పంచామృతాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన
ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మార్గశిర మాస విశేష కుంకుమార్చన
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మార్గశిర మాస శ్రీలక్ష్మీ పూజ, వేదపారాయణ, మహావిద్యా పారాయణ, సప్తశతీ పారాయణ
ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అష్టోత్తర కుంకుమార్చన
2. పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచాలని టీటీడీ అధికారులు కీలకనిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆగమ సలహామండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వ గా, డిసెంబరు మొదటివారంలో జరగనున్న ధర్మకర్తల మండలి భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.
3.సన్నిధి గొల్లలకు వంశపారంపర్యం!
తిరుమల శ్రీవారి ఆలయంలో సనాతనంగా పనిచేస్తున్న సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులను కల్పించాలని ధర్మకర్తల మండలి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నిత్యం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయ ద్వారాలను తెరిచే హక్కు సన్నిధి గొల్లలకు మాత్రమే ఉంది. ఈ సంప్రదాయాన్ని కొన్నాళ్ల క్రితం పక్కనపెట్టగా.. పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సన్నిధి గొల్లలకు సైతం ఈ హక్కులను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై ధర్మకర్తల మండలి ఇటీవలి సమావేశంలో చర్చించి ఆమోదించింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రభుత్వానికీ నివేదించింది. దీనికనుగుణంగా దేవాదాయశాఖ చట్టంలో మార్పులు చేయాలని కోరారు. ‘సన్నిధి గొల్ల’గా పిలుస్తున్న పేరును సన్నిధి యాదవగా మార్చాలని కూడా ప్రతిపాదించారు. ఇందుకు ప్రభుత్వ ఆమోదం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది.a
4. రాశిఫలం -28/11/2019
తిథి:
శుద్ధ విదియ సా.6.36, కలియుగం – 5121 తీశాలివాహన శకం – 1941
నక్షత్రం:
జ్యేష్ఠ ఉ.8.50
వర్జ్యం:
లేదు
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.49 నుండి 03.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణబాధలు అధికమగును. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
మిథునం:

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కల్తుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
5. శ్రీరస్తు శుభమస్తు
తేది : 28, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
రము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 6 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 59 ని॥ వరకు విదియ తిధి తదుపరి తదియ తిధి)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న ఉదయం 8 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు జ్యేష్ఠ నక్షత్రం తదుపరి మూల నక్షత్రం)
యోగము : (ధృతి ఈరోజు సాయంత్రం 4 గం ll 18 ని ll వరకు తదుపరి శూల రేపు మధ్యాహ్నం 2 గం ll 48 ని ll వరకు)
కరణం : (బాలవ ఈరోజు ఉదయం 6 గం ll 30 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 56 ని ll )
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( ఈరోజు అమృత ఘడియలు లేవు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 43 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 28 ని॥ లకు
ర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : వృచ్చికము
6. శుభోదయం
మహానీయుని మాట
” జీవితంలో మనం నేర్చునున్న ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. ”
నేటీ మంచి మాట
” ధైర్యమంటే.. ఓటమిలోనూ గుండెనిబ్బరాన్ని కోల్పోకపోవడమే.
7. నేటి సుభాషితం
ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది, లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది.
8. నేటి సామెత
పాడి పసరము, పసిబిడ్డ ఒకటే
రైతు ఇంట్లో వున్న పిల్లలను\పశువులను సమానంగా చూస్తాడని/ఆదరిస్తాడని ఈసామెత అర్థము
9. నేటి ఆణిముత్యం
చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ !
భావం :
చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం, కాలిలోకి ముల్లు గుచ్చుకోవడం వంటి బాధలు ఎంత బాధాకరంగా అనిపిస్తాయో.. అదేవిధంగా ఇళ్లల్లో నిత్యంగ తగువు ఏర్పడం వల్ల కలిగే బాధ చెప్పలేనిది కాదు.
10. మన ఇతిహాసాలు -కశ్యపుడు
కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు ‘ఆకారాత్‌ కూర్మ’ అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. ‘కశ్యపం’ అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే,అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి. ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
11. పవిత్రం అతిపవిత్రం మార్గశిర మాసం
అతి వేగంగా కదలి వస్తూంది మార్గశిర మాసం. స్త్రీలు ఎదురు చూచు గురువారం …వార వారo లక్ష్మీ పూజ.
మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికర మాసం. కార్తీక మాసమంతా శివ పూజలు చేసిన మాన వాళికి శివ విష్ణు భేధము లేదని శివ ప్రీతి కార్తీక మాసం అవుతూనే, విష్ణుప్రీతి మార్గశిరము ప్రారంభ మవుతుంది. ఇది అధ్యాత్మికముగా పెద్దలు ఏర్పరచినారు. కానీ ఇందులో సైన్సు ప్రకారం కూడా ఇది ఒక ఆరోగ్య సూత్ర ప్రణాళిక. ఈ కార్తీక మాసాన పగలంతా ఉపవాసం, నక్త భోజనం. మార్గశిర మాసాన ఉదయమే బోజనo. ఇందులో నిఘూడ పరమార్థం ఆషాడ మాసం నుండి 4 నెలలు వర్షాలు పడుతాయి, నేల బురద మయ మవుతుంది. తేమ వాతా వరణం, వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములు వ్యాప్తికి అణువుగా నుండి, అవి ఉత్పన్నమవుతాయి. వాటి ప్రభావం జనుల పై చూపి, అనారోగ్య సమస్యలు వస్తాయి. “ లంఖణo పరమవుషదం” కాన పూజలు, వ్రతాలు, ఉపవాసాల పేరిట మితముగా తిని జీర్ణసమస్య వ్యాదుల బారినుండి కాపాడ బడతారు. వాతావరణ మార్పు వలన, చల్లటి గాలులు వీచు ఈ హేమంత ఋతువు కాలమున పగలు తక్కువ గాను, రాత్రిళ్ళు ఎక్కువగాను వుంటుంది. ఆకలి మందగించి వుంటుంది. జీర్ణ వ్యవస్థ చురుకు దనం తక్కువగా నుంటుంది. అందువలన ఈ వుపవాస దీక్షలు, దేవుడి పేరిట, మన ఆరోగ్యములు కాపాడు నిమిత్తం పెద్దలు ఏర్పరిచినారు. మార్గశిరం మాసం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింతగా భగవoతుని చింతనలలో తన్మయమవుతారూ మబ్బులు వీడిన నిర్మలాకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం గురించి స్వయం గా ఆయనే తెలియజేసినది ఏమనగా, ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు.చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలని పించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు. ప్రాతః కాల కార్యాలు పుణ్య ఫలితాలనందిస్తుంది.మహా భారత యుద్దము కార్తీక మాస అమావాస్య నాడు ప్రారంభ మైనది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునినికి ఉపదేశం చేసినాడు. అది విన్న సంజయుడు, మరునాడు అనగా ఏకాదశి రోజు దృతరాష్ట్ర మహారాజు కు గీతను వినిపించినాడు. అనగా మానవ లోకానికి భగవద్గీత చెప్పిన కార్తీక మాస రోజులలో కాక, మరుసటి దినము మార్గశిర మాసమున ఏకాదశి నాడు మానవాళికి తెలుపబడినది. అందుకే మార్గశిర మాసం విష్ణువుకు ఒక ప్రత్యేక మాసముగా చెప్పా బడినది. అదియును గాక, ఈ మాసాన అతి పవిత్రమైన సుబ్రమణ్య పూజ, , లక్ష్మి పూజలు, దత్త జయంతి, అనఘా వ్రతము, హనుమద్వ్రతము మరియు ధనుసంక్రమణము మొదలైన విష్ణు ప్రీతి దినాలు కూడా కలవు. మాసం శుద్ద త్రయోదశి హనుమత్ వ్రతము, అష్టమి నాడు అనఘా దేవి (దత్తాత్రేయుని భార్య) వ్రతము,వైష్ణవ మద్వ శయన ఏకాదశి,మరియు ఈ మాసాన అన్ని గురువారాలు లక్ష్మి పూజలు, దత్త జయంతి వుంటుంది.
ఆషాడ శుద్ద ఏకాదశిని శయనేకాదశి అని అంటారు. ఆ రోజున శ్రీ మాహావిష్ణువు యోగా నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ద ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కోంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.ఈ నెలల లోనే యతులు, ఎక్కడకు వెళ్ళక చాతుర్మాస వ్రతం చేస్తారు. 2019 మార్గశిర మాస పూజలు.
మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం
27-11-2019 తేది నాడు
చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడుని పూజ చేస్తారు.
30-11-2019 పంచమి నాడు నాగపంచమి వ్రతం
01-12-2019 షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి
02-12-2019సప్తమి నాడు సూర్యారాధన నారాయణు డిని పూజిస్తారు
03-12-2019 నవమి నాడు, త్రివిక్రమ, త్రిరాత్ర వ్రతం జరుపుతారు
05-12-2019 దశమి రోజున పదార్థ వ్రతం, ధర్మవ్రతం.
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథిని మోక్షైకాదశి, సౌఖ్యదా ఏకాదశిగా పిలుస్తారు
07-12-2019 గీతా జయంతి గా వ్యవహరిస్తారు. ఆ
వేళ కృష్ణుణ్ని పూజించి, గీతా పారాయణ చేస్తే మంచిదoటారు.
07-12-2019
ద్వాదశిని మత్స్యద్వాదశి అంటారు
09-12-2019
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భయ, పీడా, నివారణార్థం హనుమద్వతం త్రయోదశీ వ్రతం జరుపుతారు
09-12-2019
శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు
11-12-2019
పౌర్ణమి, దత్తాత్రేయుడు అవతరించిన రోజు ఆరోజున దత్త చరిత్ర పారాయణ చేస్తారు.ఈ పున్నమికే కోరల పూర్ణిమ అని పేరుని పేరు. ఈ పౌర్ణమినాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిదంటారు పండితులు
11-12-2019
మార్గశిర కృష్ణ పాడ్యమినాడు శిలావ్యాప్తి వ్రతం.
13-12-2019
మార్గశిర ధనుస్సంక్రమణము. ర.గం.11-47, ధనుర్మాస పూజ 16-12-2019
సప్తమినాడు ఫలసప్తమీ వ్రతం ,‘కాలభైరవాష్టమి’ 18-12-2019
ప్రతి గురువారం నాడు ‘ మార్గశిర లక్ష్మీవార వ్రతం’ .
12. జ్ఞాన జ్యోతి
బుద్ధుడు జీవించి ఉన్నకాలంలో, శ్రావస్తీ నగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను సుఖవతి అని పిలిచేవాళ్ళు.ఒకనాడు సుఖవతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- “భగవానుడైన బుద్ధుడు త్వరలోనే శ్రావస్తికి రానున్నాడు” అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు; ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. బుద్ధుడి గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా ‘బుద్ధుడు రావటం’ అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.తర్వాతి రోజుల్లో‌ఆమె బుద్ధుడి గురించి అనేక విషయాలు విన్నది- “రాజకుమారులనుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు శ్రద్ధ తప్ప మరేమీ అక్కర్లేదట..” ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.సుఖవతి తనకు తెలియకుండానే బుద్ధుడి రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు వచ్చాడు. సుఖవతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. బుద్ధుడి వెంట అనేకమంది భిక్షువులు- అందరూ చకచకా నడచుకొంటూ సుఖవతిని దాటుకొని పోయారు. బుద్ధుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, “నా వెంట రా” అని చెప్పినట్లు అనిపించింది సుఖవతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.తెలివి వచ్చి చూసుకునేసరికి సుఖవతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. బుద్ధుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌బుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!వాటిని చూసేసరికి సుఖవతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. ‘అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది?’ అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. సుఖవతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- “ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను” అని ప్రాధేయపడ్డది.’బుద్ధుడికోసం’ అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. సుఖవతి దాన్నిపట్టుకొని పోయి, బుద్ధుడు బస చేసిన ఆరామానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.దానిముందు మోకరిల్లి, “బుద్ధుడా! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి” అనుకున్నది.ఆరోజు రాత్రి ఆరామంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ అడుక్కుతినే ఆమె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ‘మౌద్గలాయనుడు’ అనే శిష్యుడు దాన్ని చూసి “దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు” అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన బుద్ధుడు నవ్వి, అతన్ని వారిస్తూ “ఇది ఇప్పట్లో ఆరదు. సుఖవతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు; అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో ‘దీపకాంతి’ అనే పేరు గల బుద్ధుడు అవుతుంది” అన్నాడు.మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!
13. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
28.11.2019
ఉదయం 7 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-23℃°
• నిన్న 64,394 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 04
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 24,502 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.10 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
శ్రీ పద్మావతి అమ్మ‌వారి
కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబర్ 23 నుండి డిసెంబరు 1 వరకు వైభవంగా జరుగును, ఈ రొజు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు:
నిన్న 13,542 మంది
భక్తులకు శ్రీ పద్మావతి అమ్మ
దర్శన భాగ్యం కలిగినది,
#సర్వభూపాలవాహనం
(ఉ: 8 – 10వరకు)
#స్వర్ణరథం
(సా: 3.30 – 4వరకు)
#గరుడ వాహనం
(రా: 7.30 – 11వరకు)
/ / గమనిక / /
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈ రొజు 5 సంవత్సరం
లోపు పిల్లల తల్లిదండ్రులకు
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వ‌ర‌కు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభా
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి ttd Toll free #18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
14. పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచాలని టీటీడీ అధికారులు కీలకనిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆగమ సలహామండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వ గా, డిసెంబరు మొదటివారంలో జరగనున్న ధర్మకర్తల మండలి భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.
15. కాళీయమర్ధనుడి అవతారంలోశ్రీపద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆరో రోజు అమ్మవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాళీయమర్ధనుడి అలంకారంలో సిరుల తల్లి నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి వాహనసేవ ముందు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అమ్మవారు స్వర్ణ రథంపై శ్రీమహాలక్ష్మి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి గరుడ వాహన సేవ జరగనుంది. అమ్మవారు శ్రీ మహా విష్ణువు రూపాన్ని ధరించి తిరువీధుల్లో విహరిస్తారు.
16. విజయనగరం జిల్లాలో ప్రముఖ దేవాలయం పూలబాగ్‌ శ్రీ వల్లీదేవసేన సుబ్రమణ్య దేవాలయం నుండి కావడి అట్టాం ఊరేగింపు నవంబర్‌ 30 న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుందని ఆలయ వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ… ఈ కావడి ఊరేగింపులో పాల్గనడానికి ఎలాంటి నియమాలూ లేవని, స్త్రీ పురుషులందరూ పాల్గనవచ్చన్నారు. ఊరేగింపు దేవాలయం నుండి బయలుదేరి నీళ్ళ ట్యాంక్‌ మీదుగా మూడు లాంతర్లు, గంటస్థంభం, శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం, ఉల్లివీధి, పాత బస్టాండ్‌, మండపం వీధి మీదుగా దేవాలయానికి చేరుతుందన్నారు. డిసెంబర్‌ 2 న శ్రీ సుబ్రమణ్యం స్వామి పుట్టినరోజు సందర్భంగా.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. 5 వ తేదీన లక్ష పుష్పార్చన, 6 న శ్రీ వల్లీదేవసేన సుబ్రమణ్యం స్వామి వారికి సాయంత్రం 4 గంటలకు కళ్యాణం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కఅష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాల కఅష్ణ, ఉపాధ్యక్షులు దన్నాన రామమూర్తి, ఆలయ అర్చకులు శ్రీనివాస్‌ శర్మ, అగస్త్య శర్మ, ఆర్వీ పంతులు పాల్గన్నారు.