1. శ్రీవారి కానుకలు శ్రీదేవి వేడుకలు!-డిసెంబరు 1న పంచమీ తీర్థం – తదితర ఆద్యాత్మిక వార్తలు
‘‘అవతారేషు విష్ణోరేషానపాయినీ విష్ణోర్దేహాను రూపాం వైకరోత్యషాత్మనస్తనూమ్’’
అంటే.. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నిటిలో మహాలక్ష్మి ఆయనను విడవకుండా ఉంటుంది.విష్ణువు రూపానికి తగిన రీతిలో తన రూపాన్ని ఆ తల్లి గ్రహిస్తుందని విష్ణుపురాణం చెబుతోంది.శ్రీమన్నారాయణుడిలాగానే ఆ తల్లి ఒక్కో అవతారంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ స్వామి వైకుంఠంలో విష్ణువుగా ఉంటే.. ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది.ఆయన వరాహావతారం దాలిస్తే ఆ దేవి భూదేవి అయింది. రాముడిగా వస్తే సీతగా వచ్చింది. అలాగే మహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వరుడిగా ఆవిర్భవిస్తే పద్మావతిగా అవతరించింది. ఆ తల్లే అలమేలు మంగమ్మగా నీరాజనాలందుకుంటోంది.తమిళ కార్తిక మాసంలో ఆమె ఆవిర్భవించిన పంచమికి పూర్తయ్యేలా అలమేలుమంగ కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొమ్మిది రోజులు పాంచరాత్రాగమ సంప్రదాయానుసారం జరిగే ఉత్సవాల్లో చివరి రోజు పంచమీ తీర్థం నిర్వహిస్తారు. ఈ వేడుక అమ్మవారి ఆలయానికి సమీపంలోని పుష్కరిణిలో వైభవంగా జరుగుతుంది.***అంగరంగ వైభవంగా…* పద్మావతీదేవి ఉత్సవ మూర్తిని అందంగా అలంకరించి, దివ్య పల్లకీలో ఉంచి కోలాహలంగా పుష్కరిణికి తీసుకొస్తారు. సుదర్శన చక్రతాళ్వారును కూడా తీసుకొస్తారు. వారిని పుష్కరిణీ తీర్థంలో ఏర్పాటు చేసిన వేదికపై వేర్వేరు పీఠాలపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.* అదే సమయంలో తిరుమల వేంకటేశ్వరుడు తన దేవేరికి జన్మదిన కానుకగా సారె పంపిస్తారు. తిరుమల నుంచి అర్చకులు, అధికారులు కాలినడకన అలిపిరికి సారెతో చేరుకుంటారు. అక్కడి నుంచి ఏనుగుపై ఊరేగింపుగా తిరుపతిలోని కోదండ రామస్వామి, గోవిందరాజస్వామి ఆలయాల మీదుగా తిరుచానూరు చేరుకొని అమ్మవారికి అందజేస్తారు.* శ్రీవారు పంపిన సారెలో రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికెలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూలమాలలు, తులసి మాలలు, రెండు బంగారు నగలతో పాటు 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు వంటి పిండి వంటలు ఉంటాయి.* స్వామివారి సారెను స్వీకరించిన అర్చకులు.. బంగారు నగలను భక్తులందరికీ చూపించి.. అమ్మవారికి అలంకరిస్తారు. తర్వాత అమ్మవారికి, చక్రతాళ్వారుకు ‘స్నపన తిరుమంజనం’ భక్తులందరి సమక్షంలో నిర్వహిస్తారు. ఈ సమయంలో వేలమంది భక్తులు పుష్కరిణి నీటిలో నిల్చుని ఈ దివ్య దృశ్యాన్ని తిలకిస్తారు.* వేద పండితులు శ్రీసూక్తం పఠిస్తూ ఉండగా అర్చకస్వాములు గంధోదకంతో సంప్రోక్షణ చేసి తిరుమంజనం ప్రారంభిస్తారు. జియ్యంగార్లు బంగారు శంఖాలతో అర్చకస్వాములకు శుద్ధ జలాన్ని అందిస్తూ ఉండగా.. ఆ జలంతో అమ్మవారికి, చక్రతాళ్వారుకు అభిషేకం చేస్తారు. వివిధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత సాంబ్రాణి పొగవేస్తూ శుద్ధ వస్త్రంతో అమ్మవారిని తుడిచి.. పూలమాలలు, కిరీటాన్ని అలంకరించి.. నివేదన చేసి హారతులిస్తారు.* అమ్మవారికి, చక్రతాళ్వారుకు గంధం, పసుపు ముద్దలను ఆపాదమస్తకం అద్దుతారు. కుంకుమ తిలకం తీర్చిదిద్ది తర్వాత మళ్లీ శుద్ధజలంతో అభిషేకించి శుభ్రపరిచి.. హారతులిస్తారు. చివరగా చందనాన్ని అద్ది.. తులసి మాలలతో అలంకరిస్తారు.* బంగారు జల్లెడను ఉంచి సహస్రధారలతో ఇరు మూర్తులనూ అభిషేకిస్తారు. మళ్లీ అందంగా అలంకరించి.. హారతులిస్తారు. అనంతరం చక్రతాళ్వారును పుష్కరిణి నీటిలోకి తీసుకెళ్లి ‘చక్రస్నానం’ నిర్వహిస్తారు. ఇది ముగిసిన తర్వాత భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.* పంచమీ తీర్థ ఉత్సవం ముగిశాక అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వారులు ఊరేగింపుగా ఆలయం చేరుకుంటారు. రాత్రి జరిగే ధ్వజావరోహణతో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.* జ్యేష్ఠ మాసంలో జరిగే తెప్పోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, భాద్రపదమాసంలో జరిగే పవిత్రోత్సవాల్లోనూ తిరుచానూరు పద్మ తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.* తిరుచానూరు క్షేత్రంలోని పుష్కరిణికి ‘పద్మ పుష్కరిణి’, ‘పద్మ తీర్థం’ అని పేరు. ఇందులోనే అమ్మవారు ఆవిర్భవించారని కథనం. అందువల్ల దీనికాపేరు వచ్చింది. ఈ పుష్కరిణిని స్వయంగా శ్రీనివాసుడే ఏర్పాటు చేశాడని చెబుతారు.
2. తిరుమలలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘నాద నీరాజనం’ కళాకారుల గ్రేడ్లను తొలగించినట్లు ఆ ఛానల్ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ ఛానల్ను ఏప్రిల్ నుంచి హెచ్డీగా మార్చుతున్నామన్నారు.
3. శ్రీరస్తు శుభమస్తు
తేది : 29, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం ❄
వారము : భృగువాసరే (శుక్రవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న సాయంత్రం 5 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 40 ని॥ వరకు తదియ తిధి తదుపరి చవితి తిధి)
నక్షత్రం : మూల
(నిన్న ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు మూల నక్షత్రం తదుపరి పూర్వాషాఢ నక్షత్రం)
యోగము : (శూల ఈరోజు మధ్యాహ్నం 2 గం ll 48 ని ll వరకు తదుపరి గండ రేపు మధ్యాహ్నం 1 గం ll 52 ని ll వరకు)
కరణం : (గరజి ఈరోజు సాయంత్రం 5 గం ll 40 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 56 ని ll)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 6 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 5 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 7 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : ధనుస్సు
4. శుభోదయం
మహానీయుని మాట
” ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికి అయినా సిద్దపడతాడు.
అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
5. నేటీ మంచి మాట
బద్దకస్తునికి ఇష్టమైన పదం ‘రేపు ”
నేటి సామెత
పాముకు పాలు పోసి పెంచి నట్టు
దుర్మార్గులను చేరదీస్తే ఏనాటికైనా ప్రమాదమనిసూసించే సామెత ఇది.
6. నేటి సుభాషితం
ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు, పిరికివాడు క్షణ క్షణం మరణిస్తాడు.
నేటి ఆణిముత్యం
ధర నొక్క బుద్ధిహీనున్
దిరముగ రోటనిడి దంచెనేనియు, బెలుచం
దురు, యగును గాని యతనికి
సరసత్వము గలుగదండ్రు సతము కుమారా!
భావం:
ఓ కుమారా! బుద్ధిలేనివాడిని రోటిలో దంచినా బుద్ధిరాదు. వాడి బుద్ధిహీనత ఎక్కువవుతుంది. చతురత మాత్రం వాడికి ఎన్నటికీ కలగదు.
7. నేటి సామెత
కోతలు కోయటంప్రగల్బాలు పలకటం. వాడి మాటలన్ని ఒట్టి కోతలె
8. మన ఇతిహాసాలు -ధర్మవ్యాధుని కథ
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు.కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
9. నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్లను టీడీపీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో క్యాలెండర్‌ను బుక్ చేసుకుంటే వెంటనే వారికి అందజేస్తామన్నారు. త్వరలోనే శ్రీవారి డైరీలను అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీరంగం తరహాలో తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలా లేదా అన్న విషయంపై ఆగమ సలహాదారులతో చర్చిస్తున్నామన్నారు. ఆర్జిత సేవల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భారమైనా సరే దూపదీపనైవేధ్యాలకు నోచుకోని ఆలయాలను టీడీపీ పరిధిలోకి తీసుకుంటామన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్మా ట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని టీటీడీ సమాచార కేంద్రాలలో క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.
10. తిరుమల వెంకన్న కొప్పెరకు కష్టకాలం
నిత్యం కోట్లాది రూపాయల ఆదాయంతో కళకళలాడే శ్రీవారి కొప్పెర (హుండీ)కు కష్టం వచ్చింది. కొప్పెరపై కప్పిఉంచే వస్ర్తాన్ని కుట్టే దర్జీ కాంట్రాక్టు గడువు ముగియటంతో, నూతన వస్ర్తాలకు కొరత ఏర్పడుతోంది. దీంతో సంప్రదాయానికి విరుద్ధంగా ఒకసారి వాడిన వస్ర్తాలనే మళ్లీమళ్లీ వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత తమస్థాయికి తగిన విధంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. హుండీ ద్వారా రోజుకు రూ.2.50 నుంచి రూ.4.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. అలాంటి హుండీకి వస్త్రాన్ని కుట్టేందుకు ప్రస్తుతం దర్జీ కరువయ్యాడు. హుండీని కప్పిఉంచేందుకు కేస్‌మెంట్ వస్త్రం ఉపయోగిస్తారు. ఈ వస్ర్తాన్ని హుండీని పైనుంచి కింది వరకు కప్పిఉంచే పెద్ద సంచిలా కుట్టేందుకు గతంలో టీటీడీకి ప్రత్యేక అనుభవం కలిగిన దర్జీ ఉండేవారు. ఆయన దాదాపు ఆరేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత టీటీడీ హెల్త్ విభాగానికి చెందిన మరో ఉద్యోగి ఆ వస్త్రాలు కుడుతూవచ్చారు. ఆయన కూడా ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి టీటీడీ ఓ ప్రైవేట్ ట్రస్టు ద్వారా దర్జీతో కొప్పెర వస్ర్తాలను కుట్టించి వినియోగిస్తోంది. ఈ కాంట్రాక్ట్ ఈ నెల మొదటివారానికి ముగిసిపోయింది. దాంతో కొత్త వస్ర్తాలకు కొరత ఏర్పడింది.
డిసెంబరు 1న పంచమీ తీర్థం
Related tags :