ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారతీయ కోచ్‌లను ఉపయోగించుకోకపోవడం బాధాకరమని టీమిండియా మాజీ సారథి, ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. వారి సేవలు వినియోగించుకోకుండా ఫ్రాంచైజీలు ఓ ట్రిక్కు మిస్సవుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన కోచ్‌లుగా కాకున్నా సహాయ కోచ్‌లుగానైనా వారు విలువ చేకూరుస్తారని వెల్లడించారు. లీగులోని ప్రతి జట్టులో అధికభాగం భారత ఆటగాళ్లే ఉంటారన్నారు. స్థానిక కోచ్‌లకు ఇక్కడి క్రికెట్ వ్యవస్థ, భాష గురించి బాగా తెలుసుకాబట్టి ఆటగాళ్లను సామర్థ్యం మేరకు ఆడించగలరని ద్రవిడ్ తెలిపారు.
‘మన వద్ద మంచి కోచులున్నారు. వారి సామర్థ్యంపై నాకు బాగా నమ్మకముంది. క్రికెట్లోని అన్ని విభాగాల్లో ఉన్నట్టే కోచింగ్‌లోనూ ప్రతిభావంతులు ఉన్నారు. ఐపీఎల్‌లో మా వాళ్లకు సహాయ కోచ్‌లుగానైనా అవకాశాలు రాకపోవడం నన్ను బాధిస్తోంది. భారతీయ కోచ్‌ల నుంచి జట్లు చాలా ప్రయోజనం పొందొచ్చు. ఆటగాళ్లు, భాష, పిచ్‌లు, వాతావరణం గురించి వారికి బాగా తెలుసు. కోచ్‌ల కోసమూ జాతీయ క్రికెట్ అకాడమీలో ఓ కార్యక్రమం రూపొందించాలని అనుకుంటున్నాం. దానివల్ల వారిలో నైపుణ్యాలు, సామర్థ్యం పెరుగుతాయి. పైస్థాయిలో అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ అన్నారు.
టీమిండియా ప్రస్తుత పేసర్లు రాబోయే తరాలపై ప్రభావం చూపిస్తున్నారని ద్రవిడ్ పేర్కొన్నారు. వయసు వారీ పోటీల్లో వారి ప్రభావం కనిపిస్తోందన్నారు. ‘ప్రతి సంవత్సరంలాగే ఈ సారీ అండర్-19 క్రికెట్లో మంచి ఫాస్ట్‌బౌలర్లు భారత్‌కు ఉన్నారు. గత ప్రపంచకప్ (2018)లో మనకు కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి, ఇషాన్ పోరెల్ ఉన్నారు. ఈ సారి జట్టులోని పేసర్లను త్వరలోనే మీరు చూస్తారు’ అని ద్రవిడ్ తెలిపారు.