ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్ గుర్తించడంలో అంపైర్లు పదేపదే విఫలమవుతున్నారు. జట్ల గెలుపోటములపై ఇది ప్రభావం చూపుతుండటంతో ఆటగాళ్లు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షణాల వ్యవధిలో పలు రకాల అంశాలను పరిశీలించాలంటే కష్టంగా ఉంటోందని అంపైర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా సాంకేతికను వినియోగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫీల్డ్ అంపైర్లు దీనిని ఉపయోగించుకొనేలా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఐపీఎల్‌లో విజయవంతంగా వినియోగించాలని అనుకుంటోంది.
‘నిజమే. ఆ పని జరుగుతోంది. ఐపీఎల్ అంటేనే వినూత్నతకు మారుపేరు. ఐపీఎల్ ప్రతి సీజన్‌లోనూ ఓ కొత్త సాంకేతకను ప్రవేశపెట్టి ఆట అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నది మా లక్ష్యం. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సాంకేతికతకు ఉన్నప్పుడు ఆటగాళ్లు ఎందుకు బాధపడాలి? ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను సాంకేతికత గుర్తించగలదని నా అభిప్రాయం. ఇప్పటికే భారీ స్థాయిలో పరీక్షించాం. వెస్టిండీస్ సిరీస్‌లోనూ పరీక్షలు కొనసాగిస్తాం’ అని బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ తెలిపారు.
విండీస్ సిరీస్‌లో సేకరించిన సమాచారంపై బోర్డు అధికారులు, ఐపీఎల్ పాలక మండలితో చర్చిస్తారా అని జార్జ్‌ను ప్రశ్నించగా.. మరోసారి వ్యవస్థను పరీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రనౌట్లను తనిఖీ చేసేందుకు మూడో అంపైర్ ఉపయోగిస్తున్న కెమెరాలనే నోబాల్స్ గుర్తించేందుకు ఉపయోగించారు. ఇవి సెకనుకు 300 ఫ్రేములను రికార్డు చేశాయని సమాచారం.