DailyDose

శంషాబాద్ మృగాలకు 2వారాల రిమాండ్-తాజావార్తలు-11/30

Shamshabad Murder Rapists Senteced To Two Weeks Remand-Telugu Breaking News-11/30

* సాగర తీరానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటూనే విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును దశల వారీగా విస్తరిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి విశాఖలో సమీక్ష నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టు పనులను పీపీపీ విధానంలోనే అమలు చేస్తామని బొత్స వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

* భాజపా కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు. దేశ రాజకీయ చిత్రపటంలో రాజధాని అమరావతి పేరు చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల్లో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డి కోరారు. రాజధాని విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు.

* శంషాబాద్‌ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సమర్పించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళసై, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్యామలా కుందర్‌ .. పోలీసులను ఆదేశించారు. యువతి కుటుంబ సభ్యులను వేర్వేరుగా పరామర్శించి ధైర్యం చెప్పారు. వివిధ పార్టీల నేతలు బాధితుల్ని కలుసుకుని ఓదార్చారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* ఆర్టీసీ కార్మికులతో రేపు జరిగే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని కార్మికులను ఆదుకోవాలని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి కోరారు. హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ… విపక్ష పార్టీల నేతలతో సమావేశమైంది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… డిపోల్లో అమాయకులను సీఎం సమావేశానికి పంపిస్తున్నారని ఆక్షేపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశం నిర్వహించాలని కోరారు.

* శంషాబాద్‌లో యువ పశు వైద్యురాలి హత్యకేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు మొబైల్‌ ఫోన్‌ కీలక ఆధారంగా మారింది. 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వైద్యురాలు టోల్‌ ప్లాజా వద్ద వాహనాన్ని పార్కింగ్‌ చేయడాన్ని నలుగురూ చూశారని రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో వారంతా మద్యం సేవిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. పూర్తి రిపోర్ట్ కోసం క్లిక్‌ చేయండి

* టీఎస్‌ ఎస్‌వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో తెదేపా కార్యాలయంలో సమావేశమై.. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

* వందేమాతరం గీతంతో అసెంబ్లీ ప్రారంభమయ్యే సంప్రదాయానికి తూట్లు పొడిచారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించారు. బల పరీక్ష కోసం ప్రత్యేకంగా రెండు రోజులపాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

* ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం సియాచిన్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ సియాచిన్‌లో సైనికులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా భారీ మంచు గడ్డలు విరిగిపడడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు అధికారులు తెలిపారు. సహాయ బృందం వెంటనే స్పందించి మంచు చరియల కింద చిక్కుకున్న సైనికులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు వారిని గుర్తించి తక్షణం హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు సైనికులు మరణించారు.

* మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఓ యువతి పార్లమెంటు ఎదుట ఒంటరి పోరాటం చేసింది. సుమారు పాతికేళ్ల వయసు ఉన్న అను దుబే అనే యువతి శనివారం ఉదయం పార్లమెంటు ఎదుట బైఠాయించి ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసింది. ‘‘నా దేశంలో నాకు భద్రత ఎందుకు లేదు’’ అని నినాదాలు చేసింది. పార్లమెంటు రెండో నంబరు గేటు వద్ద కూర్చొని నిరసన తెలుపుతుండడంతో భద్రతా సిబ్బంది ఆమెను జంతర్‌ మంతర్‌కు వెళ్లాలని సూచించారు.

* శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145 కాగా.. ఉద్ధవ్‌ సర్కార్‌కు 169 ఓట్లు వచ్చాయి. ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ హెడ్‌కౌంట్‌కు ఆదేశించగా.. భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

* శంషాబాద్‌లో యువతిపై హత్య, అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. పోలీస్‌స్టేషన్‌లోనే నిందితులను మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ విచారించారు. అనంతరం వారికి రిమాండ్‌ విధించారు. కాసేపట్లో నిందితులను జైలుకు తరలించనున్నారు. మరోవైపు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళలు, ప్రజా సంఘాల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్దకు అదనపు రక్షణ బలగాలను తరలించారు.

* చిన్నారులు, మహిళలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేయనున్నట్లు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన వైద్యురాలి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు త్వరగా అరెస్ట్‌ చేశారన్నారు. ఇదే స్థాయిలో నిందితులకు కఠిన శిక్షపడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

* కానుకల సమర్పణకు శబరిమల ఆలయంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇకపై డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా భక్తులు కానుకలు చెల్లించవచ్చు. అందుకోసం తగిన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది. సౌత్‌ ఇండియన్ బ్యాంకుతో కలిసి ఆలయ దేవస్థానం బోర్డు ఈ ఇ-హుండీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఆలయంలో నాలుగు చోట్ల స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం ఆలయం తెరిచి ఉన్నంత వరకే ఉంటుందని తెలిపారు.

* జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగులకు అందిస్తున్న పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, ఆపైస్థాయి ఉన్నత విద్యకూ వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌ నవశకం పేరిట విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ కార్డులు జారీ చేయనున్నారు. రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

* మహారాష్ట్రలో ఉత్కంఠ పరిణామాల మధ్య ఉద్ధవ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలపై భాజపా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా ప్రొటెం స్పీకర్‌గా ఉన్న భాజపా ఎమ్మెల్యే కాళిదాస్‌ కొలంబకర్‌ను తొలగించడంపై మండిపడుతోంది. కొలంబకర్‌ స్థానంలో ఎన్సీపీ నుంచి దిలీప్‌ వాల్సే పాటిల్‌ను తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాశ్వత స్పీకర్‌ను సోమవారం ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌ మార్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని భాజపా యోచిస్తున్నట్టు సమాచారం.

* జగన్‌ సర్కారు 6 నెలల పాలనపై తెలుగుదేశం పార్టీ పుస్తకం విడుదల చేసింది. ‘మంచి సీఎం కాదు జనాన్ని ముంచే సీఎం’ క్యాప్షన్‌తో ముద్రించిన పుస్తకాన్ని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. రాష్ట్ర అర్థిక వ్యవస్థ 6 నెలల్లో చిన్నాభిన్నమైందని ఆరోపించారు. రూ.83వేల కోట్ల ఆదాయం వస్తుందని జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో పెడితే… వాస్తవ పరిస్థితుల్లో రూ.21వేల కోట్ల మైనస్‌ ఆదాయం బడ్జెట్‌లో తగ్గనుందని వివరించారు.

* తనను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్‌లు, స్టాక్‌లు వాపస్‌ తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఈవో చందాకొచ్చర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ మకరంద్‌ కార్నిక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్‌2వ తేదీన వాదనలు విననుంది. దీంతో మాజీ సీఈవో, ఐసీఐసీఐ బ్యాంకుకు మధ్య న్యాయపోరాటం తలెత్తినట్లైంది.

* దిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోషియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రజత్‌ శర్మ మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సారి డీడీసీఏ అంబుడ్స్‌మన్‌ దాన్ని ఆమోదించింది. ఆయనతో పాటు సీఈవో రవి చోప్రా రాజీనామా కూడా అంగీకరించింది. దీంతో డీడీసీఏ వైస్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ కుమార్‌ బన్సాల్‌ అధ్యక్ష పదవిని చేపడతాడని అందరూ భావిస్తున్నారు.