DailyDose

జియో దెబ్బ అదుర్స్ అబ్బా-వాణిజ్యం-12/01

Jio Announces 40% Rate Hikes-Telugu Business News-12/01

* ముకేశ్‌ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో కూడా వినియోగదారులకు షాకిచ్చింది. వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు గానూ ఎఫ్‌యూపీ లిమిట్‌ విధించనున్నట్లు వెల్లడించింది. ‘‘అన్‌లిమిటెడ్‌ వాయిస్‌, డేటాతో కొత్త ఆల్‌ఇన్‌ వన్‌ ప్లాన్లను జియో ప్రవేశపెట్టబోతోంది. ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ (ఎఫ్‌యూపీ)ని ఈ ప్లాన్లు కలిగి ఉంటాయి. 2019 డిసెంబర్‌ 6 నుంచి కొత్త పాన్లు అమల్లోకి రానున్నాయి’’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన టెలికాం ఛార్జీల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 3 నుంచి పెంచుతున్నట్లు ఇవాళే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల వ్యవధిలోనే జియో కూడా పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

* ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా డిసెంబర్‌ 3 నుంచి ఛార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ ఛార్జీల పెంపుదల 42 శాతం వరకు ఉండనుంది. దీనికి తోడు వొడాఫోన్‌ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఓ మొబైల్‌ కంపెనీ టారిఫ్‌ ధరలను పెంచడం గమనార్హం. ‘‘వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ప్రీపెయిడ్‌ కొత్త టారిఫ్‌లు, ప్లాన్లు ప్రకటిస్తోంది. అన్నీ ప్లాన్లు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ మూడో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్‌ 1 నుంచి ఛార్జీలను పెంచనున్నట్లు కంపెనీ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 5న వెలువడే పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో వరుసగా ఆరోసారి సైతం తగ్గింపు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరేళ్ల కనిష్ఠానికి జీడీపీ పడిపోయిన నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో రేట్ల కోత వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 5 సార్లు మొత్తం 135 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించింది. మందగించిన వృద్ధి రేటును పునరుద్ధరించడం, లిక్విడిటీని పెంచడం వంటి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

* నవంబర్‌ నెలలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం పెరిగింది. ఈ మొత్తం రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే 6శాతం ఆదాయం పెరిగి రూ.1.03లక్షల కోట్లకు చేరింది. అక్టోబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.95,380 కోట్లు కాగా.. 2018 నవంబర్‌లో రూ.97,637 కోట్లుగా ఉన్నాయి. ఈ సారి నవంబర్‌లో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,03,492 కోట్లు. వీటిల్లో సీజీఎస్‌టీ రూ.19,592 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.27,144 కోట్లు, ఐజీఎస్‌టీ 49,028 కోట్లు కాగా.. సెస్‌ రూపంలో రూ.7,727 కోట్లు వచ్చాయి. వరుసగా రెండు నెలలు వృద్ధిరేటు తగ్గుతూ వస్తుండగా.. గత నెలలో మాత్రం దీని వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 6శాతం వృద్ధి నమోదైంది. అదే ఈ ఏడాదితో పోల్చుకొంటే 12శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం విశేషం.

* అమెరికాతో తొలివిడత వాణిజ్య ఒప్పందం కుదరడానికి ముందే ఆ దేశం.. చైనా వస్తువులపై వందల బిలియన్ల మేరకు విధించిన సుంకాలను తొలగించాలని చైనా మాజీ వాణిజ్య ఉప మంత్రి వి జియాంగ్‌ గ్లోబల్‌ టైమ్స్‌తో పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పదం కదుర్చుకోవడానికి అమెరికా తహతహలాడుతోంది.. కానీ, కొన్ని టారీఫ్‌లను మొదట తొలగించకపోతే ఈ డీల్‌కు చైనా అంగీకరించదని ఆయన వెల్లడించారు. కేవలం భవిష్యత్తులో విధించబోయే సుంకాలను నిలిపివేస్తామనే షరతుకు చైనా ఏమాత్రం అంగీకరించదని ఆయన పేర్కొన్నారు. తొలి విడత వాణిజ్య ఒప్పందానికి ముందే అమెరికా కొన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలను తొలగించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలుడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా చాలా విడతల్లో చైనా వస్తువులపై సుంకాలు విధించింది. వీటిల్లో సెప్టెంబర్‌ 1 నుంచి 125బిలియన్‌ డాలర్లు విలువైన వస్తువులపై విధించిన 15శాతం సుంకాలను, 250 బిలియన్‌ డాలర్ల యంత్రాలు సెమీకండెక్టర్లపై విధించిన 25శాతం సుంకాలను తొలగించే అవకాశాలు ఉన్నాయని రాయిటార్స్‌ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్‌ 15 అమల్లోకి వచ్చేలా 156 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై విధించిన సుంకాలను కూడా నిలిపివేసే అవకాశం ఉంది.