* భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా
* అర్వింగ్‌లోని మహాత్ముని స్మారకస్థలి వద్ద 150వ జయంతి వేడుకలు
* స్మారకస్థలి సందర్శించిన తొలి భారత రాయబారిగా చరిత్ర లిఖించిన హర్షవర్ధన్
శాంతి, ప్రేమ, క్రమశిక్షణ, అహింస, సోదరభావం వంటి సదాశయాల సమాహారమైన గాంధేయవాదానికి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న ప్రవాస భారతీయుల చొరవ, కృషి అమోఘం అభినందనీయమని అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కొనియాడారు. సోమవారం మధ్యాహ్నం టెక్సాస్ రాష్ట్రంలోని అర్వింగ్‌లో గల మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీజి 150వ జయంత్యుత్సవాలను డా.తోటకూర ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. తాను దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించినప్పుడు గాంధీజి గత చరిత్రను అతి సమీపంగా సున్నితంగా స్పృశించానని, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని అహింసాయుత పోరాటాల వైపు ప్రేరేపించడం గాంధీయిజానికి పాశ్చాత్య దేశాలు పట్టిన గొడుగు అని ఆయన పేర్కొన్నారు. 150వ జయంతి ఉత్సవాలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో సైతం నిర్వహించామ్ని, హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తన జీవితంపై గాంధీజి ప్రభావాన్ని నెమరవేసుకోవడం ముదావహమని అన్నారు. భారతదేశానికి-అమెరికా దేశానికి మధ్య జీవవారధులుగా ప్రవాస భారతీయులు వర్థిల్లుతున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు నిజం చేసేలా గాంధేయవాదానికి కూడా ప్రవాసులు బ్రహ్మరథం పడుతున్నారని వారందరికీ తన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. స్మారకస్థలిని సందర్శించిన ప్రప్రథమ భారత రాయబారి హర్షవర్ధన్ కావడం ఆనందంగా ఉందని MGMNT కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అనుపం రే, కాన్సులేట్ అధికారులు సురేంద్ర, అశోక్, MGMNT కార్యదర్శి కల్వల రావు, సభ్యులు షబ్నం ముద్గిల్, టొరంటోలో భారత మాజీ సాంస్కృతిక రాయబారి, మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. MGMNT ఏర్పాటు, స్మారకస్థలి విశేషాలు, స్థానిక పాఠశాల విద్యార్థులకు అది ఎలా ఉపయుక్తమవుతుందనే అంశాలను డా.తోటకూర ప్రసాద్ రాయబారికి వివరించారు. అనంతరం ఆయన్ను స్పెయిన్ నుండి ప్రత్యేకంగా తయారు చేయించిన గాంధీజి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేసి సత్కరించారు.