Politics

విచిత్ర నాయకుడు…జగన్

Jagan Is A Strange Leader-Chandrababu In Kurnool

తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఉంటే వైకాపా ఉండేదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్తలపై 690 కేసులు పెట్టారని.. ఎన్నో దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన తెదేపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెదేపాను కార్యకర్తలే నడిపిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో ఏం పురోగతి సాధించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కూర్చుంటే కేసు.. నిలబడితే కేసు పెడుతున్నారని.. ఇన్నేళ్లలో ఒక విచిత్రమైన నాయకుడిని చూస్తున్నామని సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని గట్టిగా పట్టుబట్టామని గుర్తుచేశారు. తెదేపా హయాంలో కర్నూలు జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ఎక్కువగా వరదలు వచ్చినా ఒక్క చెరువైనా నింపారా? అని ప్రశ్నించారు. తన ఇల్లు ముంచేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీరు పెట్టి విడుదల చేశారని ఆయన ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా మారారని.. సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం వైకాపా కార్యకర్తలకే ఇచ్చారన్నారు. కర్నూలు నుంచి ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ వైఖరితో రాష్ట్రంలో పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. శంషాబాద్‌ సమీపంలో దిశను దారుణంగా హతమార్చారని.. ఘటనకు పాల్పడిన మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.