Movies

మిథాలీగా తాప్సీ

Tapsee Pannu As Mithaliraj In Her Biopic-మిథాలీగా తాప్సీ

‘సాండ్‌ కీ ఆంఖ్‌’ సినిమా కోసం షూటర్‌గా మారిన ప్రముఖ నటి తాప్సి.. ఇప్పుడు చేతికి గ్లౌజులు తొడుక్కుని క్రికెట్‌ బ్యాట్‌ పట్టబోతున్నారు. భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిత్తు’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తాప్పి మిథాలీగా నటించనున్నారు. నేడు మిథాలీ పుట్టినరోజును పురస్కరించుకుని తాప్పి సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. మిథాలీతో కలిసి దిగిన ఫొటోలను తాప్పి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. ఎన్నో విషయాల్లో నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీ జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూపించే అవకాశం రావడం, అందుకు నన్ను ఎంపిక చేయడం గర్వంగా ఉంది. ఈ పుట్టినరోజున నీకు ఎలాంటి బహుమతి ఇవ్వగలనో తెలియదు గానీ.. శభాష్‌ మిత్తు చిత్రం ద్వారా వెండితెరపై నిన్ను నువ్వు చూసుకుని గర్వపడేలా మాత్రం చేయగలనని హామీ ఇస్తున్నా’ అని తాప్పి రాసుకొచ్చారు. అంతేకాదండోయ్‌ సినిమా కోసం తాప్పి కవర్‌ డ్రైవ్‌ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వయాకామ్‌18 స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ ఢోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. గతకొంతకాలంగా తాప్సి క్రీడలకు సంబంధించిన బయోపిక్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ మహిళల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ సినిమాలో తాప్సి షూటర్‌గా కన్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ జీవితంపై వస్తున్న ‘రష్మీ రాకెట్‌’ సినిమాలో ఆమె టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.