నటి షకీలా సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల ఆమె నటించిన చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని తిరస్కరించడంపై ఆమె బోర్డు సభ్యులను నిలదీశారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే, పోస్ట్ పొడ్రక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండుసార్లు సెన్సార్ బోర్డ్ సభ్యులు తిరస్కరించారు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని షకీలా ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన చిత్రాన్ని తిరస్కరించడానికి గల కారణమేమిటని సెన్సార్ బోర్డు సభ్యులను ప్రశ్నించారు. ‘‘లేడీస్ నాట్ అలవ్డ్’ అనే చిత్రానికి నేను ఒక నిర్మాతగా వ్యవహరించాను. ఇప్పటికే ఈ సినిమాని సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది. అసలు ఈ సినిమాను తిరస్కరించడానికి కారణమేమిటో నాకు అర్థం కావడంలేదు. ఈ జోనర్‌లో వచ్చిన ఎన్నో చిత్రాలకు సెన్సార్ ఇచ్చారు. కానీ మా చిత్రానికి మాత్రమే సెన్సార్ ఇవ్వడం లేదు. దీనికి గల కారణమేమిటి? నా పేరు ఉండడం మీకు ఇష్టం లేదా? మేమెంతో కష్టపడి, ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకువచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సెన్సార్ పూర్తి చేయడానికి డబ్బులు అడుగుతున్నారని మా దర్శకుడు సాయి చెప్పారు. చిన్న నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతారా? పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్లని మీరు డబ్బులు అడగరు. ‘లేడీస్ నాట్ అలవ్డ్’ ఫ్యామిలీ చిత్రం కాదని, ఇదొక అడల్ట్ కామెడీ సినిమా అని మేమే చెప్పాం. తప్పు ఎక్కడ జరుగుతుందో నాకు తెలుసు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి’ అని షకీలా వార్నింగ్ ఇచ్చారు.
షకీలా చిత్రానికి సెన్సార్ వేధింపులు
Related tags :