శబరిమలలో జరిగే నిత్య పూజలు ఇవే – ఆద్యాత్మిక వార్తలు – 12/05
హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప, ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం, మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్ సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఉష పాయసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి, ఎలనైవేద్యం, ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్ ;సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం, అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు. సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం, మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో, మేల్ సంతి సహకారంతో జరుగుతుంది. మకరు జ్యోతి దర్శనం తర్వాత, ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు. మండల పూజ సమయంలో పదిరోజులపాటు ఉల్సవం పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ;కొడిమరం అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి, పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ఆరాట్టు వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్ సంతి ఆధ్వర్యం వహిస్తారు.
2.జనవరి నాటికి యాదాద్రి ప్రధాన ఆలయ పనులు పూర్తి
యాదాద్రి నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. జనవరి నెలాఖరునాటికి ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తవుతాయని కార్యనిర్వహణాధికారి (ఈవో) గీతారెడ్డి వెల్లడించారు. వృద్ధులు, ఇతరులు దర్శనం చేసుకునేందుకు వీలుగా లిఫ్ట్ను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. బుధవారమిక్కడ గీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే పెద్దగుట్టపై 250 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేశామని.. దాతల సహాయంతో కాటేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మహాయజ్ఞం ద్వారా ఆలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని.. ఈ మేరకు తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టును శిల్పులు ఎవరూ తాకలేదని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన సిందూరాన్ని మాత్రమే తాము స్వయంగా తొలగించామని స్పష్టంచేశారు. లక్ష్మీనరసింహస్వామి పూర్తి శాంతమూర్తేనన్నారు. సమావేశంలో ‘యాడా’ఉపాధ్యక్షుడు కిషన్రావు పాల్గొన్నారు.
3.7న మస్కట్లో యాదాద్రీశుడి కల్యాణం
మస్కట్లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం యాదాద్రి దేవస్థాన అర్చక బృందాన్ని పంపించేందుకు నిర్ణయించింది. గురువారం శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణమూర్తులతో ఆలయ బృందం మస్కట్కు పయనం కానుంది.
4.తితిదేకి లేని అభ్యంతరం మీకెందుకు?
గరుడ వారధి నిధుల విషయంలో పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి(తితిదే) చెందిన 67% నిధులు పొందాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తితిదేకి లేని అభ్యంతరం మీకెందుకని పిటిషనర్, భాజపా ఏపీ ప్రధాన కార్యదర్శి జి.భానుప్రకాష్రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంతో మీకేమి సంబంధం? మీకొచ్చిన నష్టమేమిటని అడిగింది. ఈ వ్యాజ్యంలో ప్రజాహితమే లేదని పేర్కొంది. దీంతో పిల్ను ఉపసంహరించుకొని, తగిన ఫోరాన్ని ఆశ్రయించడానికి వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
5.రేపు డయల్ యువర్ ఈవో
తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు నిర్వహించే కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు, సూచనలను తితిదే ఈవోకి ఫోన్ ద్వారా నేరుగా తెలుపవచ్చన్నారు. భక్తులు 0877-2263261 నంబరును సంప్రదించాలన్నారు. అదేరోజు ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ఆలయం, తితిదే స్థానికాలయాల ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వివరించారు.
6.నకిలీ వెబ్సైట్లలో ఆలయ సేవలు
చెందిన ఆన్లైన్ సేవలను… కొందరు అనధికార వెబ్సైట్ల ద్వారా బుకింగ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సైట్లలో చిత్తూరు జిల్లా కాణిపాకం విఘ్నేశ్వరాలయం, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల పూజలు, సేవలు బుకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో దేవాయశాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాలు ఉండగా, వాటిలో పూజలు, ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారిక వెబ్సైట్లను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రెండు ఆలయాలకు చెందిన అధికారులు అక్కడి పోలీసులతోపాటు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
7. శబరిమల గుడిలో మొబైళ్లపై నిషేధం
శబరిమల అయ్యప్ప ఆలయ గర్భగుడి సమీపాన మొబైల్ ఫోన్లను నిషేధించారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. గర్భగుడి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు. 18 పవిత్ర మెట్లు దాటి లోపలకు, ప్రధాన ఆలయం ఎదురు ప్రాంతం వద్ద, గర్భగుడి వద్ద మొబైళ్లను అనుమతించబోమని అధికారులు తెలిపారు. పవిత్ర మెట్లకు దారితీసే మార్గం వద్దనే భక్తులు తమ మొబైళ్లను స్విచ్చాఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిషేధాన్ని మొదటిసారి ఉల్లంఘిస్తే హెచ్చరికతో వదిలిపెడతామని, రెండోసారి ఉల్లంఘిస్తే ఆ మొబైళ్లను స్వాధీనం చేసుకుని విజువల్స్ను తొలగిస్తామని అధికారులు చెప్పారు.
శబరిమలలో జరిగే నిత్య పూజలు ఇవే
Related tags :