భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే వన్డే, టీ20 సిరీసుల్లో నోబాల్స్‌ను మూడో అంపైర్ నిర్ణయిస్తారని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లు మిగతా బాధ్యతలు చూసుకుంటారని వెల్లడించింది. మూడో అంపైర్లు సాంకేతికతను ఉపయోగించి ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను గుర్తిస్తారని తెలిపింది. డిసెంబర్ 6 నుంచి ఈ సిరీస్ ఆరంభమవుతోంది. తొలి టీ20 హైదరాబాద్‌లో జరగనుంది. ‘ఈ ప్రయోగంలో ప్రతి బంతిని పర్యవేక్షించడం, బౌలర్ పాదాన్ని క్రీజు బయట పెట్టాడో లేదో గుర్తించడం మూడో అంపైర్ బాధ్యత. పాదం బయటపెడితే మూడో అంపైర్ ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇస్తారు. నోబాల్‌గా ప్రకటిస్తారు. అంటే ఫీల్డ్ అంపైర్లు ఇకపై మూడో అంపైర్ సూచన లేకుండా నోబాల్ ప్రకటించరు’ అని ఐసీసీ తెలిపింది. ‘ఒకవేళ మూడో అంపైర్ నుంచి నోబాల్ ప్రకటన ఆలస్యమైతే బ్యాట్స్‌మన్ ఔట్‌ను ఫీల్డ్ అంపైర్లు వెనక్కి తీసుకుంటారు. ప్రయోగ ఫలితాలను నోబాల్ నిర్ణయాలు కచ్చితత్వంతో తీసుకోవడంలో సాంకేతిక వ్యవస్థ ప్రభావాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తాం. ఆటంకాలు లేకుండా ఆట సజావుగా సాగుతుందో లేదో పరిశీలిస్తాం’ అని ఐసీసీ వెల్లడించింది. ఈ సాంకేతికతను 2016లో పాక్, ఇంగ్లాండ్ సిరీసులో పరీక్షించారు. ఇప్పుడు సాధ్యమైనన్ని మ్యాచుల్లో పరీక్షించాలని చూస్తున్నారు.
నోబాల్ సంగతి ఫీల్డ్ ఎంపైర్లు చూడరు
Related tags :