Kids

దొంగతనం తప్పు-తెలుగు చిన్నారుల కథ

Teach Kids That Stealing Is Bad-Telugu Kids News-12/05

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

“అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు.

అమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది.

“నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు.

చేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు.

కొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు.

ఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది.

ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి, “నా కొడుకు అలాంటి పనులు చేయడు! నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో!” అని పాలేరుని తిట్టి పంపించేసింది.

పిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు.

కాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కోరలు దొంగాలించే పిల్లాడు, పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు, డబ్బులు దొంగాలించడం మొదలెట్టాడు. పిల్లాడు పెద్ద వాడైపోయాడు, ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు.

ఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి, దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది.

“ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా! నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా!” అని కొడుకు జైలుకి వెళ్ళాడు.

పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే, అవే తప్పులు ముందు ముందు అలవాట్లు, తరవాత గ్రహపాటు అవుతాయి.