Movies

ఒత్తిడి చిత్తు

Deepika Padukone Explains How She Fought Depression

ఒకానొక సమయంలో తాను ఒత్తిడి (డిప్రెషన్‌)తో యుద్ధం చేశానని చెప్పుకొచ్చారు బాలీవుడ్‌క నటి దీపికా పదుకొణె. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు సంబంధించిన బ్లాగ్‌లో ఈ విషయం గురించి తెలియచేశారు. ‘‘2014లో నేను డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలను ఎదుర్కొన్నాను. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఓ రోజంతా పనిచేసి సృహ కోల్పోయి పడిపోయా. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని బాధ. బాగా ఏడ్చేశాను. అప్పుడు నాకు నిద్రపట్టేది కాదు. ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. నన్ను నవ్వించడానికి, సంతోషంగా ఉంచడానికి ఎవరైనా మంచి పాటను పెట్టినా సరే నేను దాన్ని వేరేలా తీసుకుని బాధపడేదాన్ని. అలాంటి రోజుల్లో ఒకసారి నా తల్లిదండ్రులు నన్ను చూడడానికి ముంబయి వచ్చారు. వాళ్లు నాతో ఉన్నన్ని రోజులూ ధైర్యంగా ఉన్నట్లు నటించాను. చివరికి వాళ్లు నన్ను వదిలేసి వెళ్తున్న రోజు బాగా ఏడ్చేశా. అది గమనించిన మా అమ్మ నా దగ్గరికి వచ్చి.. ‘ఏమైంది దీపిక?’ అని ప్రశ్నించింది. నేను సమాధానం చెప్పలేదు. తను వెంటనే ‘సినిమాల్లో నటించడం, సహ నటులతో ఏమైనా ఇబ్బందిగా ఉందా?’ అని అడిగింది. నేను ఏం మాట్లాడలేదు. నా బాధను చూసిన అమ్మ వెంటనే డాక్టర్‌ని కలవమని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి నాకు రణవీర్‌ పరిచయమయ్యాడు. తను నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. మేమిద్దరం ప్రేమలో పడ్డాం. అదే సమయంలో నాకెప్పటికీ గుర్తుండిపోయే మూడు సినిమాల్లో నేను నటించాను. ఆ సమయంలో నా కుటుంబం నాకెంతో ఆసరాగా నిలిచింది. నేను డేటింగ్‌ చేసిన వ్యక్తితోనే నా పెళ్లి జరిగింది’’ అని దీపికా పదుకొణె పేర్కొన్నారు.