* ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే’ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీడీని తానే స్వయంగా దిల్లీ వెళ్లి అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశంపట్ల తమ బాధ్యతను గుర్తు చేశారంటూ ప్రధాని మోదీకి పవన్ కృతజ్ఞతలు చెప్పారు.
* ఆర్టీసీ సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 మంది కార్మికులు చనిపోయారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలుత కుటుంబానికి ఒక్కరుచొప్పున ఉద్యోగాలకు ఎంపిక చేశారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి కానిస్టేబుల్, ఒకరిని కండక్టర్ ఉద్యోగానికి ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, రూ.2లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ఇటీవల సీఎం హామీ ఇచ్చారు.
* కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వీడిన రాహుల్ గాంధీ.. మళ్లీ ఆ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్ సూచన ప్రాయంగా వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని, ఇదే విషయమై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని ఆయన అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు.
* వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద ఆచూకీ స్పష్టంగా చెప్పలేమని, అయితే అతడి పాస్‌పోర్టు రద్దు చేశామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాసం అనే పేరు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ‘నిత్యానంద ఎక్కడున్నాడో ఊహించడం కష్టం. అయితే అతడి పాస్‌పోర్టును రద్దు చేశాం. కొత్త పాస్‌పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
* ఉబర్ వాహనాల్లో ప్రయాణిస్తుండగా తమపై అత్యాచారం జరిగినట్టు 2018 జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో తమకు 235 ఫిర్యాదులు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే అమెరికా వాహన సేవల సంస్థ ఉబర్ తొలిసారిగా తన సంస్థ భద్రతా నివేదికను విడుదల చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2017, 2018లో తమ వాహనాల్లో జరిగిన లైంగిక దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు వంటి దుర్ఘటనల సమాచారాన్ని బయటపెట్టింది.
* దేశీయ మార్కెట్లోకి ట్రయాంప్ మోటార్ సైకిల్స్ సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. సరికొత్త రాకెట్ 3 మోడల్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ధర రూ.18 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయంచారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో ఆర్, జీటీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లోకి ఆర్ వేరియంట్‌ను విడుదల చేశారు. దీనిలో శక్తివంతమైన ఇంజిన్, తక్కువ బరువు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌ను అమర్చారు. ఇది పాత మోడల్ కంటే రెండు లక్షలు చౌకగా లభిస్తోంది.
* గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కోచ్ రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనడంలో అర్థం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. పదవీకాలంలో చేసిన ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తుల పనితీరు అంచనా వేస్తారని స్పష్టం చేశారు. 2016లో అనిల్‌కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడంలో దాదా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన శాస్త్రికి ఈ పదవి దక్కలేదు. దీంతో గంగూలీ వల్లే తనకు పదవి దక్కలేదని శాస్త్రి విమర్శించారు. దాదా సైతం ప్రతివిమర్శలు చేశారు.
* 2021 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా డే/నైట్ టెస్టులు ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) బీసీసీఐని కోరనుందని తెలుస్తోంది. దీని గురించి వచ్చే ఏడాది జనవరిలో బీసీసీఐతో చర్చిస్తామని సీఏ ఛైర్మన్ ఎడ్డింగ్స్ ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ఫోతో అన్నారు. జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ‘తొలి డే/నైట్ టెస్టులో భారత్ సులభంగా విజయం సాధించింది. వారు మరిన్ని డే/నైట్ టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనవరిలో దీనిగురించి చర్చిస్తాం’ అని ఎడ్డింగ్స్ అన్నారు.
* సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం ఆరామ్‌కో గురువారం ఐపీవోను ప్రారంభించింది. అత్యధికంగా 32 రియాళ్ల రేటు వద్ద షేరు ధరను నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా 25.6 బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మొత్తం చైనాకు చెందిన ఆన్‌లైన్ ట్రేడింగ్ గ్రూప్ అలీబాబా ఐపీవో (25 బిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ. ఈ సంస్థ మార్కెట్లోకి ప్రవేశిస్తే దీని విలువ 1.7 ట్రిలియన్ డాలర్లతో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న తొలి కంపెనీగా మారుతుంది.
* దిశ హత్యోదంతంలో తొలుత ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించి క్రమంగా సైంటిఫిక్ ఆధారాలను సేకరించామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాల్పుల్లో నిందితులు మృతిచెందిన నేపథ్యంలో ఘటనాస్థలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాల్పులు జరిగిన తీరు, అందుకు గల కారణాలను సీపీ వివరించారు. ‘దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చాం. దిశ ఫోన్, వాచీ, పవర్‌బ్యాంక్ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లాం. అక్కడ రాళ్లు, కర్రలతో పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు’ అని వెల్లడించారు.
* దిశ కేసు నిందితులపై కాల్పుల ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్ శివారులో ఇటీవల దిశపై జరిగిన దారుణం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని అన్నారు. ఆ ఘటన జరిగిన రాత్రి నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు. యావత్ జాతి తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఇలాంటి ఆవేదనేనన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు ముగిసిపోయాయని అనుకోవద్దన్నారు.
* దిశ హత్యోదంతం కేసులో కాల్పుల్లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాలకు తహసీల్దార్ల ఆధ్వర్యంలో పంచనామా పూర్తయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. క్లూస్‌టీం కూడా సంఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పారిపోతున్న క్రమంలో ఇద్దరు నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు మృతిచెందారు. నిందితుల్లో ఆరిఫ్‌తో పాటు చెన్నకేశవులు చేతులో పోలీసులకు సంబంధించిన తుపాకులు ఉన్నాయి. అవి ఘటనాస్థలంలోనే పడి ఉన్నాయి.
* దిశ హత్యకేసు నిందితుల మృతిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల ఘటనపై గుంటూరులోని అభ్యుదయ కళాశాల విద్యార్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ ద్వారా ‘దిశ’కు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగిందని అధ్యాపకులు, విద్యార్థినులు అన్నారు. అయితే ఇలాంటి ఘటనే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళల పట్ల గౌరవ భావం పెరగాలని అన్నారు.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులపై కాల్పులు ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నిజానిజాలు తెలుసుకునేందుకు వెంటనే ఒక బృందాన్ని ఘటనాస్థలానికి పంపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ డీజీ(దర్యాప్తు)ని ఆదేశించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించింది.
* దిశ నిందితులపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులపై హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మరక్షణలో భాగంగా ఇలాంటి కాల్పులు సరైనవే కానీ.. నిందితులకు చట్టపరంగా శిక్ష పడితే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
* దిశ నిందితులపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో న్యాయపరంగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
* దిశ కేసులో నిందితులపై కాల్పుల ఘటనపై పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందలు తెలిపారు. ‘‘దిశ’ ఘటనలోని నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూశాను. నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.
* దిశ హత్యాచార కేసులో కాల్పుల్లో మృతి చెందిన నిందితుల తల్లిదండ్రులు ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. మక్తల్ సీఐ శంకర్ బృందం వారిని సంఘటన స్థలికి తీసుకెళ్లింది. నారాయణపేట జిల్లా గుడిగండ్ల నుంచి మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవుల తండ్రి కురుమప్ప సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు. మృతుల తల్లిదండ్రులతో వనపర్తి ఎస్పీ అపూర్వారావు మాట్లాడారు.