Politics

రాహుల్ గాంధీకే తిరిగి పగ్గాలు

K Venugopal Hints At Rahul Gandhi Taking INC President's Post

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిని వీడిన రాహుల్‌ గాంధీ.. మళ్లీ ఆ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని, ఇదే విషయమై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని ఆయన అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయన వెంట ఉన్న కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు. జులైలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్‌ తప్పుకోవడం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమన్నారు. మళ్లీ ఆయన ఆ పదవిని అలంకరిస్తారని చెప్పారు. వచ్చే నెలలో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మరో నేత చెప్పారు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.