వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద ఆచూకీ స్పష్టంగా చెప్పలేమని, అయితే అతడి పాస్‌పోర్టు రద్దు చేశామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాసం అనే పేరు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ‘నిత్యానంద ఎక్కడున్నాడో ఊహించడం కష్టం. అయితే అతడి పాస్‌పోర్టును రద్దు చేశాం. కొత్త పాస్‌పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. నిత్యానంద ఆచూకీ కోసం విదేశాల్లో ఉన్న అన్ని భారత రాయబార కార్యాయాలను అప్రమత్తం చేశామని చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యానందకు చెందిన ఆశ్రమంలో పిల్లలను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై ఇటీవల అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాతి నుంచి నిత్యానంద కన్పించకుండా పోయాడు. అతడు విదేశాలకు పారిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూకార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తాను ఓ దీవిని కొనుగోలు చేశానని, దాన్ని హిందూ దేశంగా గుర్తించాలని నిత్యానంద ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో సహా ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నం, పాస్‌పోర్టులు కూడా ఉంటాయని చెప్పాడు.
నిత్యానంద జాడ మాకు తెలీదు
Related tags :