నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఆనం వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇవ్వాలని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్ ఆదేశించారు.
ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. నెల్లూరు నగరం మాఫియాకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో కబ్జాదారులు, గ్యాంగ్‌స్టర్లు, ఇసుక, బెట్టింగ్, లిక్కర్ మాఫియాలు విజృంభిస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలని, మాఫియా కావాలంటే నెల్లూరులో దొరుకుతారని ఆయన చెప్పారు. ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరంతో పనిచేసే పోలీసు అధికారులున్నా ఒక్క అడుగు ముందుకు వేయాలంటే తమ ఉద్యోగ భద్రత చూసుకునే పరిస్థితి ఉందన్నారు. ‘‘గతంలో ఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఉన్నప్పుడు శాంతిభద్రతలు అదుపులో ఉండేవి. అంతటి ఆత్మస్థ్యైరం ఉన్న అధికారులు ఉన్నారా? ఒకవేళ ఉన్నా మా ప్రజాప్రతినిధులు వెంటనే పంపేస్తాం. అలా ముగ్గురు ఎస్పీలను మార్చేశాం. ఏడాది కూడా పనిచేయని ఎస్పీలు ఉన్నారు. వ్యవస్థలను సక్రమంగా పని చెయ్యనిస్తే ఇలాంటి ఘటనలను ఆపడం సులభమే. వ్యవస్థలు పని చేయనీయకపోతే గ్యాంగ్‌లు, మాఫియాలు, గ్యాంగ్‌స్టర్లు పెరిగిపోతారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాస్వామ్య విధానంలో మార్పు వస్తే తప్ప సమాజానికి మెరుగైన ఫలితాలు అందించలేం’’ అని అభిప్రాయపడ్డారు. 38 సంవత్సరాలు రాజకీయాల్లో పనిచేసిన తర్వాత, ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి మాటలు చెప్పవలసి రావటం బాధ కలిగిస్తోందన్నారు.