Business

భారీగా ఛార్జీల బాదుడు షురూ చేసిన APSRTC

APSRTC Increases Bus Fares On All Services

ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పడం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని దాన్ని భర్తీ చేసుకునేందుకు కేవలం 10 పైసలు మాత్రమే పెంచుతున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ప్రతీ కిలోమీటర్ కు 10 పైసలు పెంచుతున్నట్లు తెలిపారు.

అయితే పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుంచి అమలు అవుతాయో అన్నది త్వరలోనే ప్రభుత్వం తరపున ప్రకటన విడుదల చేస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆర్టీసీకి రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేయాలంటే ఛార్జీలు పెంచక తప్పదన్నారు మంత్రి పేర్ని నాని.

ఆర్టీసీ అప్పులు రూ.6,735 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. వివిధ రూపాలలో రూ.2995 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అలాగే రూ. 3,740 కోట్లు బకాయిలు ఉన్నట్లు స్పష్టం చేశారు. 2015 లో డీజిల్ ధర రూ.50 ఉంటే అది నేడు రూ.75 కు చేరిందని చెప్పుకొచ్చారు.

ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీ భారంగా మారాయని తెలిపారు. వీటి వల్ల ఏటా నికర నష్టం 1200 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఆర్టీసీ అప్పులు ప్రతినెలా రూ.100 కోట్లు పెరుగుతూనే ఉందే తప్ప తగ్గడం లేదన్నారు. ఇవి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు.

పల్లె వెలుగు, సిటీ సర్వీస్ కు 10 పైసలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామని అలాగే ఇతర సర్వీసులకు కిలోమీటర్ కు 20 పైసలు పెంచనున్నట్లు తెలిపారు. 2015 తర్వాత ఇప్పటివరకు చార్జీలు పెంచలేదన్నారు. ఆర్టీసీకి జీవం పోసేందుకే చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.

ఇకపోతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. ఆర్టీసీ విలీనానికి సంబంధించి సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ షిలాబిడే కమిటీ సూచనలు కూడా ఇంకా అమలు కాని పరిస్థితి ఆర్టీసీ సంస్థల్లో నెలకొందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీలు రెండుగా విడిపోయి ఉమ్మడి ఆస్తులు పంచుకుంటామన్నారు.

ఇకపోతే రెండు రాష్ట్రాల ఆర్టీసీల్లో కేంద్రానిది 30 శాతం వాటా ఉన్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పరిణామాలు చోటు చేసుకునేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మంత్రి అన్నారు. అందువల్లే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

ఆర్టీసీ విభజన, ఆస్తుల పంపకం, కేంద్రం వాటా వంటి అంశాలపై త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో వారిని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదన్నారు. నష్టాలను అధిగమించాలంటే రేట్లు పెంచక తప్పదన్నారు.

ఇకపోతే గత ప్రభుత్వాలు ఆర్టీసీ ఆస్తులను సైతం బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.2900 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో కొత్త అద్దెబస్సులు తీసుకునే అవకాశం లేదన్నారు. ఆర్టీసీలో 35శాతం అద్దెబస్సులు తిప్పుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి 23శాతం అద్దెబస్సులు తిరుగుతున్నట్లు తెలిపారు. ఈ 23శాతం అద్దెబస్సులు మాత్రమే తిరుగుతాయని ఇక పెంచే ప్రసక్తే లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.