DailyDose

తక్షణ న్యాయం సాధ్యపడదు-తాజావార్తలు-12/07

CJI Bobde Says Immediate Justice Is Not Possible-Telugu Breaking News-12/07

* ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌… రెవెన్యూ, ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కేంద్రమంత్రుల మాటలకు, వాస్తవాలకు పొంతన లేదు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గింది’ అని పేర్కొన్నారు. పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సీఎం లేఖ రాశారు. కేంద్రం నిధుల కోసం ప్రధాని మోదీని కలిసే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

* ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. బస్సు ఛార్జీల పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదముద్ర వేసినట్లు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఛార్జీల పెంపు అమలు తేదీని రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.

* చటాన్‌పల్లిలో దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్‌ బృందం పరిశీలించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలోని శవాగారంలో నిందితుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన అనంతరం చటాన్‌ పల్లి చేరుకుని తొలుత దిశ హత్య జరిగిన ప్రదేశం, ఆతర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది. బృందంలోని సభ్యులు.. శంషాబాద్‌ డీసీపీ ప్రతాప్‌రెడ్డిని అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

* ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ అంశం కూడా అందులో ఒకటని చెప్పారు. ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలపై పన్ను భారం తగ్గిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్ను హేతుబద్ధీకరిస్తారా అని ప్రశ్నించగా.. తాము పరిశీలిస్తున్న అనేక అంశాల్లో అదీ ఒకటి అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

* మహిళల భద్రతకు రాష్ట్రాలు అన్ని చర్యలు తీసుకోవాలని.. వారి భద్రతే ప్రభుత్వానికి ముఖ్య అంశమని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇటీవల కాలంలో మహిళలపై చోటుచేసుకున్న అకృత్యాల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా అందులో పేర్కొన్నారు. ‘‘ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ విషయంలో రాష్ట్రాలు పోలీసులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి. మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి’’ అని లేఖలో వెల్లడించారు.

* ‘ఛేదన రారాజు’ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసానికి టీమిండియా తన చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 208 పరుగులను లక్ష్యాన్ని మరో 8 బంతులుండగానే ముగించింది. అతడి బ్యాటింగ్‌కు ముగ్ధులైన ఎంతోమంది అభినందిస్తూ ట్వీట్లు చేశారు. అందులో తాను ఆరాధించే వివియన్‌ రిచర్డ్స్‌ ప్రశంసకు పొంగిపోయిన కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. విండీస్‌పై విజయం సాధించిన తర్వాత ‘అద్భుతం. అత్యద్భుతం కోహ్లీ..’ అని రిచర్డ్స్‌ ట్వీట్‌ చేశారు. దానికి కోహ్లీ ‘ధన్యవాదాలు బిగ్‌బాస్‌. మీ నుంచి ప్రశంసలంటే అవి నాకెంతో అమూల్యమైనవి’ అని తెలిపాడు.

* దొంగతనానికి వచ్చిన ఓ దొంగకు ఆ ఇంట్లో ఏమి దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఇంటి యజమానికే లేఖ రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఆదర్శ్‌ నగీన్‌ నగర్‌లో పర్వేశ్‌ సోని అనే ప్రభుత్వ ఇంజినీర్‌ నివాసం ఉంటున్నారు. ఆయన బుధవారం రాత్రి పని మీద వేరే ఊరు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఓ దొంగ ఆ ఇంటిని దొంగతనానికి ఎంచుకున్నాడు. ఇంటి కిటీకి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఇళ్లు మొత్తం వెదికాడు. కానీ ఎక్కడ కూడా చిల్లిగవ్వ కూడా దొరకలేదు.

* ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోరలేదా.? ఈ విషయమై తాజాగా అతడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను తక్షణమే వెనక్కి పంపాలని పేర్కొన్నాడు. హోంశాఖ పంపిన పిటిషన్‌ను తాను దాఖలు చేయలేదని, దానిపై సంతకం కూడా చేయలేదన్నాడు. వినయ్‌ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను దిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే.

* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసులను పరిష్కరించుకునేందుకే జగన్‌ దిల్లీ వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అనుమతివ్వలేదని ఆరోపించారు. విజయవాడలో యనమల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఇది రెండో పరాభవమని ఎద్దేవా చేశారు. దిల్లీ ఎప్పుడు వెళ్లినా తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారని విమర్శించారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని యనమల ఆగ్రహాం వ్యక్తం చేశారు.

* తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించాలని కోరుతూ చేస్తూ గవర్నర్‌ తమిళిసై కి కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం సమర్పించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు, మహిళలపై దాడులకు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

* తెదేపా సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. పార్టీ కండువా కప్పి బీద మస్తాన్‌ను సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాలో చేరిన మస్తాన్‌రావును ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ అభినందించారు. పార్టీలో చేరిన అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విధానాలు నచ్చే వైకాపాలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేసే దిశగా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు.

* దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమమూర్తి జస్టిస్‌ బొబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తక్షణ న్యాయం అనేది సాధ్యపడదు. ఒకవేళ అది ప్రతీకారంగా మారితే న్యాయం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది’ అని అన్నారు. తన మాటల్లో ఎక్కడా హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. రాజస్థాన్‌ హైకోర్టు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

* ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లఖ్‌నవూ పర్యటనలో ఉన్న ఆమె.. బాధితురాలి మృతి వార్త తెలియగానే హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. గత ఏడాది కాలంగా బాధితురాలి కుటుంబం వేధింపులు ఎదుర్కొంటోందని, నిందితులకు భాజపా నేతల అండదండలు ఉన్నాయని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ‘రాష్ట్రంలో నేరస్థులకు చోటు లేదని సీఎం చెబుతున్నారు. కానీ ఇక్కడ మహిళలకే చోటు లేకుండా పోతోంది’ అని దుయ్యబట్టారు.

* చిన్నారులపై లైంగికదాడుల నివారణకోసం చేసిన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణకు 1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇందుకోసం రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు శుక్రవారం ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.474 కోట్లు కేంద్రం సమకూరుస్తుందని చెప్పారు.

* ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మీ అధికారులుగా నటించి రైఫిళ్లను ఎత్తుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్‌లోని పాచ్మారీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మీ ఎడ్యూకేషన్‌ సెంటర్‌కు వచ్చారు. తమని తాము ఆర్మీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. సిబ్బందిని మాటల్లో పెట్టి ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్స్‌, 20 లైవ్‌ కాట్రిడ్జ్‌లను విడదీసి, దొంగిలించారు. సిబ్బంది రైఫిళ్లు దొంగతనానికి గురైయ్యాయని గుర్తించే లోపే దుండగులు ట్యాక్సీలో పారిపోయారు.

* దేశంలో పెరిగిపోతున్న హింసకు భాజపా ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయన్నారు. తన నియోజకవర్గం వయనాడ్‌ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య భాజపా విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని.. కొంతమంది వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు.

* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించి సరిచేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్‌ డేటా లీక్ ముప్పు తప్పినట్టు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ యాప్‌లోని అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం ద్వారా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్‌ నంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది.