* రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్టీని పునర్వ్యవస్థీకరించి పన్ను రేటును పెంచాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6శాతానికి పెంచే అవకాశమున్నట్లు కొన్ని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 2017 జులై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం వస్తువుల, సేవలపై 5, 12, 18, 28శాతం.. ఇలా నాలుగు శ్లాబుల్లో పన్నులు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన జీఎస్టీ మండలి సమావేశాల్లో 28శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులపై పన్ను తగ్గించి వాటిని కింది శ్లాబుల్లోకి మార్చారు. ప్రస్తుతం నిత్యావసరాలకు సంబంధించిన చాలా వస్తువులు 5శాతం శ్లాబులోనే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో దాదాపు 5శాతం ఆదాయం ఈ శ్లాబు ద్వారానే వస్తోంది.
* ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ అంశం కూడా అందులో ఒకటని చెప్పారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ లీడర్ షిప్ సమ్మిట్‌లో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడతారా? అని ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ నేను అవునూ అంటే ఎప్పుడు అని అడుగుతారు. అలాగని నేను నో అని చెప్పను. ఎందుకంటే మేం మరిన్ని చర్యలు చేపట్టే దిశగా పనిచేస్తున్నాం’’ అని సమాధానమిచ్చారు.
* ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా నవంబర్ నెల విక్రయాల్లో 77శాతం వృద్ధి కనబరించింది. దేశీయంగా రెనో ఇండియా గత నెలలో 10,882 యూనిట్లను విక్రయించింది. అదే 2018 నవంబరులో ఈ సంఖ్య 6134గా నమోదైనట్లు ప్రకటించింది. పండగ సీజన్ సందర్భంగా అక్టోబర్ మాసంలో రెనో నుంచి 11,516 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2018 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 66శాతం వృద్ధి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదలుకొని నవంబర్ నాటికి రెనో 76,905 యూనిట్లు విక్రయించింది.
* తయారీ రంగంలో మందగమనం వాహన విడి భాగాల తయారీ రంగంపైనా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగంలో ఈ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. జులై నెల వరకు ఈ రంగంలో లక్ష మంది తాత్కాలిక ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్య ఈ రంగం టర్నోవర్ రూ.1.79 లక్షల కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో టర్నోవర్ రూ1.99 లక్షల కోట్లు నమోదు కావడం గమనార్హం. అంటే గతంతో పోలిస్తే టర్నోవర్ 10.1 శాతం తగ్గింది. మందగమనం ఫలితంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి కూడా ఈ కాలంలో నష్టపోయినట్లు ఏసీఎంఏ తెలిపింది.
* ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్ బ్రోకర్లు, వ్యాపారులపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి భారత ఐటీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముంబయి, కోల్‌కతా, కాన్పూర్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. కృత్రిమ లాభ, నష్టాల కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలో రివర్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వివాదాస్పద పద్దతి ద్వారా పలు యోగ్యత లేని సంస్థలు దాదాపు రూ.3500 కోట్లకు పైగా లాభ, నష్టాలను పొందాయని ఐటీ విభాగం అంచనా వేసింది. ఈ సోదాల్లో అధికారులు లెక్కలు లేని నగదు దాదాపు రూ.1.20 కోట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చని.. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.