Agriculture

కందికి ఆకుచుట్టు తెగులు వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి?

Pests Treatment In Kandhi-Telugu Agricultural News-2019

ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రాష్ట్ర రైతాంగానికి చేస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు.
కంది పంటకు ఆకుచుట్టు పురుగు, మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు ఆశిస్తోంది. ఆకుచుట్టు పురుగు నివారణకు 1.6 మి.లీ., మోనోక్రోటోఫాస్‌ లేదా 2 మి.లీ. క్వినాల్ఫాస్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మారుక మచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ., క్లోరిపైరిఫాస్‌ లేదా 0.75 మి.లీ., నోవోల్యూరాన్‌తో పాటు ఒక మి.లీ., డైక్లోరోవాస్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
శనగపచ్చ పురుగు నివారణకు ఈ యాజమాన్య పద్ధతులను పాటించాలి. వీటి లార్వాలను తినడానికి వీలుగా ఎకరానికి 10-15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గుడ్లు, తొలి దశ లార్వాల నివారణకు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి.
కూరగాయ పంటలకు…
వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు కనిపిస్తోంది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని పర్యవేక్షించాలి. పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్‌ లేదా 0.4 గ్రా. ఇమమెక్టిన్‌ బెంజోయేట్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయ పంటల్లో పొగాకు లద్దె పురుగు గమనిస్తే 1.25 మి.లీ., నోవాల్యురాన్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు.
మిరపలో బాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + ఒక గ్రాము ప్లాంటమైసిన్‌ మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.