‘పింక్’, ‘ముల్క్’ ‘సాంద్ కీ ఆంఖ్’ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఆమెది. ఇటీవల ఆమె ‘బద్లా’ సినిమా గురించి పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిని అమితాబ్ చిత్రంగానే చూస్తున్నారని తాప్సీ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తాప్సీ మరోసారి ‘బద్లా’ సినిమా గురించి స్పందించారు. ‘‘బద్లా’ సినిమా విడుదలైన తర్వాత ఓ వెబ్ పోర్టల్ వాళ్లు.. ‘అమితాబ్ బద్లా’ చిత్రానికి ఇన్ని వసూళ్లు వచ్చాయి’ అని రాశారు. వెంటనే నేను.. ‘మీరు నా పేరును ప్రస్తావించడం మర్చిపోయినట్లున్నారు. అది నా సినిమా కూడా.’ అని ఆ పోర్టల్ వారికి రిప్లై ఇచ్చాను. నేను అలా చెప్పేది బిగ్‌బి క్రెడిట్‌ను తక్కువ చేయాలని కాదు. మహిళను కాబట్టే కదా మీరు నాకు సరైన క్రెడిట్ ఇవ్వడం లేదు. అందుకే దీన్ని ఓ హీరో చిత్రంగానే చూస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో నేను నటించినప్పటికీ ఈ చిత్రాన్ని ఒక నటుడి చిత్రంగానే ఎందుకు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని వెనుక ఉన్న లాజిక్‌ను తెలుసుకోవాలనుకుంటున్నాను. అమితాబ్ ఓ లెజెండ్ అనే విషయం నాకు తెలుసు అలాగే ఆయనంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌవరం ఉంది.’ అని తాప్సీ తెలిపారు. తాప్సీ, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘బద్లా’. సుజాయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం రూ.10కోట్లతో తీసిని ఈ సినిమా రూ.138 కోట్లకు పైగా రాబట్టింది.
తాప్సీ క్రెడిట్స్
Related tags :