రోజురోజుకూ ఘాటెక్కుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఉల్లి కోసం తిరుపతి ఆర్‌సీ రోడ్డు రైతు బజారు వద్ద కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఉదయం నుంచే అన్నమయ్య సర్కిల్ నుంచి రైల్వేగేటు వరకు బారులు దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు. ఉల్లి కోసం అవస్థలు పడుతున్నారు. ఆర్సీ రోడ్డులోని రైతుబజార్‌లో ఆదివారం ఉదయం మార్కెటింగ్ శాఖ ఐదు టన్నుల ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అమ్మకాలు.. కేవలం నాలుగు గంటల్లోనే ముగిశాయి. బయట దాదాపు కేజీ ఉల్లి రూ.150 పలుకుతున్న నేపథ్యంలో.. అధికారులు కేవలం కేజీ రూ.25లకే అందించడంతో ప్రజలు ఎగబడ్డారు. తిరుపతి నగరవాసులే కాకుండా చంద్రగిరి, రామాపురం, ఏర్పేడు, కరకంబాడి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నా కిలోమీటర్ల మేర ఉల్లి కోసం ప్రజలు క్యూ కట్టారు. అవసరమైనంత ఉల్లి అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో 500కిలోల ఉల్లిపాయాలు హాంఫట్
Related tags :