* దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఈ డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ అనుసంధానిత ఎంసీఎల్‌ఆర్‌కు(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్) అనుసంధానించిన కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. తాజా తగ్గింపుతో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ 8.00శాతం నుంచి 7.90శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది ఎనిమిదోసారి. బ్యాంకులకు నిధులు లభించే రేటునే ఎంసీఎల్‌ఆర్ అంటారు. ‘‘దేశంలోనే అతి తక్కువ రేటుకు రుణాలు సమకూరుస్తున్న సంస్థగా ఎస్‌బీఐ.. చౌకగా నిధులు లభించే లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేస్తోంది’’ అని ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎస్‌బీఐ గృహ, ఆటోమొబైల్ రుణాల్లో ఒక్కో దానిలో 25శాతం వాటాను దక్కించుకొంది.
* ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రెండు పాత ప్లాన్లను పునరుద్ధరించింది. ఇటీవల కొత్త ప్లాన్ల ధరలను సవరించిన ఆ కంపెనీ రూ.98, రూ.149 ప్లాన్లను తొలగించింది. తాజాగా ఆ రెండు ప్లాన్లను మళ్లీ తీసుకొచ్చింది. తాజాగా తీసుకొచ్చిన రూ.98 ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్‌ను వినియోగించుకునే వీలుంటుంది. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిమితి పూర్తయ్యాక డేటా వేగం 64 కేబీపీఎస్‌కు పరిమితం అవుతుంది.
* యమహా సరికొత్త మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన వైజెడ్‌ఎఫ్ ఆర్15 వీ3.0ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.45లక్షలుగా నిర్ణయించింది. బీఎస్4 వెర్షన్‌తో పోల్చుకొంటే సరికొత్త బైకు రూ.2,000 ధర ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యమహా డీలర్ల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్‌ఎస్ మోటార్ సైకిళ్లు బీఎస్ 6 ఇంజిన్‌లోకి అప్‌గ్రేడ్ చేశారు. తాజాగా ఆర్15 మూడోవాహనం. కొత్త వాహనంలో సైడ్‌స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్, డ్యూయల్ హార్న్, వెనుక చక్రానికి రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్‌ను అమర్చారు. పాత వెర్షన్ ఆర్15తో పోలిస్తే కొత్తబైకు దాదాపు 3కిలోలు బరువు అధికంగా ఉంది. దీనిలో 155 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 10,000 ఆర్‌పీఎం వద్ద 18.3 బీహెచ్‌పీ శక్తిని 8,500 ఆర్‌పీఎం వద్ద 14.1 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిలో 6స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. డ్యూయల్ ఏబీఎస్‌తో పాటు డ్యూయల్ డిస్క్‌బ్రేక్‌ను ఇచ్చారు. ఇది మొత్తం రేసింగ్ బ్లూ, థండర్ గ్రే, డార్క్‌నైట్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
* మ్యాగ్‌స్ట్రైప్‌తో ఉన్న డెబిట్ కార్డులను డిసెంబర్ 31 తర్వాత ఎస్బీఐ బ్లాక్ చేయనుంది. వాటి స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను తీసుకోవాలని సూచించింది. ఈ నెల 31లోపు మ్యాగ్‌స్ట్రైప్‌కార్డులను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం మ్యాగ్‌స్ట్రైప్ కార్డు ఉన్న ఖాతాదారులు కొత్త తరహా కార్డుల కోసం తమ హోంబ్రాంచిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఎస్బీఐ తమ ఖాతాదారులకు సమాచారం తెలియజేసింది.
* అమ్మకాల ఒత్తిడి.. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, వడ్డీరేట్లపై ఆర్‌బీఐ నిర్ణయాలు తదితర కారణాలతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 70 పాయింట్ల వరకు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కాస్త తేరుకున్నా.. దిగ్గజ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.