Agriculture

తెదేపా రైతుల కోసం పోరాడుతుంది-అసెంబ్లీలో చంద్రబాబు

TDP Will Fight For Farmers-Chandrababu-Telugu Agricultural News Latest Today

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడిగా కొనసాగాయి. రైతుభరోసా అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, అధికార పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తర్వాత రూ.88వేల కోట్ల రుణాలను రూ.24వేల కోట్లకు కుదించారని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. గత ప్రభుత్వంలో రైతులకు బ్యాంకు రుణాలు కూడా అందలేదని.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు రద్దు చేశారని ఆయన విమర్శించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చే మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వైకాపాను ఉద్దేశించి విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేసి చూపించామన్నారు. ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. వైకాపాను నమ్మి ప్రజలు మోసపోయారని ఆక్షేపించారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా కింద రూ.12,500 చెల్లించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండగ .. లెక్కల గారడీ చేయలేరు’ అని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని.. నాలుగు, ఐదు విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ము రైతులకు చెల్లించాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపైనా ఉందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్ని కొనసాగించాల్సిన అవసరముందన్నారు. నాలుగు, ఐదు విడతల రుణ మాఫీ సొమ్ము వడ్డీతో సహా రైతులకు అందేవరకు తెదేపా పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘కుక్కతోక వంకర అనే సామెతకు సాక్షాత్తు చంద్రబాబే ఉదాహరణ’ అంటూ ఎద్దేవా చేశారు.