DailyDose

ఏపీలో అత్యాచారానికి మరణదండన బిల్లు-తాజావార్తలు-12/11

AP Assembly Passes Bill That Lets Law Hang Rape Culprits-Telugu Breaking News-12/11

* మహిళల భద్రత కోసం కఠిన చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ..ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా(సవరణ)చట్టం 2019, ఏపీ దిశ యాక్ట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడినా, చిన్నారులపై లైంగికదాడికి పాల్పడినా ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. నిర్ధరించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా బిల్లు రూపొందించారు.

* గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ క్లీన్‌ చిట్‌ లభించింది. 2002 గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్‌ నివేదికలో మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్‌ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ 2014 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పాలనలో ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలకు అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల విఫలం కావడమే కారణమని తెలిపింది.

* కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2019కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఓటింగ్‌ సమయంలో సభలో 209 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 92 మంది ఓటు వేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

* ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను తరలిస్తోంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు ఐదు వేల మంది సైనికుల్ని తరలిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడడంతో అక్కడి నుంచి 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మీడియా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జమ్మూ నుంచి మొత్తం 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను జమ్మూ నుంచి అసోంకు పంపినట్లు తెలుస్తోంది.

* వాతావరణంలో కలిగే మార్పులు భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం సృష్టించిన ఇబ్బందులు అందరికీ తెలిసినవేనన్నారు. దిల్లీ పర్యటనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

* స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదో అదనపు సెషన్స్‌, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 24 గంటల పాటు పది జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో శాంతి, ప్రశాంతతకు సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

* ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ)ను మణిపూర్‌కూ వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణలను ఐఎల్‌పీ పరిధిలోని రాష్ట్రాలకు వర్తింపజేయబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌ వాసులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మణిపూర్‌ను కూడా ఐఎల్‌పీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

* వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6క్ష్4, 5క్ష్6), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9క్ష్4, 4క్ష్6), విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4క్ష్4, 7క్ష్6) చెలరేగడంతో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది.

* ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలపై సస్పెన్స్‌ వీడింది. ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు, రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత సెన్సార్‌బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి.

* ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఈ మేరకు ప్రకటించారు. వాహకనౌక మోసుకెళ్లిన 10 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రయోగం విజయవంతం కావదం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు.

* రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సూచీ (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారీకి అవసరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే దాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. పట్టణంలో మహతి ఆడిటోరియం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ ‘మహతి’ అని చెప్పారు.

* పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని భాజపా ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పెట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ హామీ మేరకే నేడు దానికి చట్టరూపం కల్పిస్తున్నామని తెలిపారు. దీన్ని ఆయన ఒక చరిత్రాత్మక బిల్లుగా అభివర్ణించారు. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మైనారిటీలకు హక్కులు లభిస్తాయన్నారు. ఈ బిల్లు శరణార్థుల హక్కులు కాపాడుతుందన్నారు. ఈ బిల్లు విషయంలో భారత ముస్లింలు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

* దేశంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ ‘దిశ’ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టంచేశారు. దిల్లీలోనే ఉండి ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు మాజీ జస్టిస్‌ పి.వి.రెడ్డిని సంప్రదించామని.. కానీ, అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

* గజ్వేల్‌లో ఆరున్నర ఎకరాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ విపణిలో మొత్తం ఆరు బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించనుంది. 16 వాణిజ్య దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌, చిన్నారుల కోసంఉద్యానవనం ఏర్పాటుతో ఈ మార్కెట్‌ ప్రాంగణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.

* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ గత ఐదేళ్లలో పాలించిన తీరుపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ మరోసారి గళమెత్తారు. మోదీకి ధీటైన సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్‌ గాంధీనే అని ఆయన పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను ధైర్యంగా ఎదుర్కొగల సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు గాంధీ అని ఆయన మీడియాకు వివరించారు.

* ఇస్రో అంతరిక్ష రేసులో ఓ కీలక మైలురాయిని అధగమించింది. నేడు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ48తో మొత్తం ఈ సిరీస్‌లో 50 అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించినట్లైంది. మన శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన 75 మిషన్‌ ఇది. ఇక వాణిజ్య పరంగా ఇస్రో 319 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చింది. సీ47 ప్రయోగంతో 300 మార్కును దాటి 310కి చేరింది. ఇస్రో ఈసారి మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ-సీ48 ద్వారా నింగిలోకి పంపింది.

* రెవెన్యూలోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చివరి గంటలో కొనుగోళ్ల అండ లభించడంతో నిఫ్టీ 11,900 పాయింట్ల పైన ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 172 పాయింట్ల లాభంతో 40,412 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,910 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది.