*మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు త్వరలో మరింత ప్రియం కానున్నాయి. జర్మనీకి చెందిన ఈ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ తన మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి 3 శాతం మేర ధరలు పెంచుతున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల మోడళ్ల స్థాయికి అనుగుణంగా ఈ ధరలు పెరగనున్నట్లు సంస్థ తెలిపింది. తయారీ ఖర్చులు ఎక్కువవడంతో కంపెనీపై పెను ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ‘గత కొంతకాలంగా సంస్థ ఉత్పత్తులపై అవుతున్న తయారీ ఖర్చులపై సమీక్షిస్తున్నాం. ఈ పెరుగుదల సంస్థపై ప్రభావం చూపుతోంది. స్థిరమైన వ్యాపార నిర్వహణ, మా వినియోగదారులను కాపాడుకోవాలంటే పెట్టుబడి అనేది ప్రధానమైనది. పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు దిద్దుబాటు చర్యల్లో భాగంగా స్వల్పంగా ధరలు పెంచాల్సిన అవసరం వచ్చింది. దీంతో మా ఉత్పత్తులపై 3 శాతం వరకు ధర పెంచాలని నిర్ణయించాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ షీవెంక్ తెలిపారు. ఇతర సంస్థలైన నిస్సాన్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఉత్పత్తులపై ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
* రెవెన్యూలోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఓ వైపు జీఎస్‌టీ వసూళ్లు తగ్గుమఖం పట్టడం, రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం బకాయి పడడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులున్నాయి. కొన్నింటిపై జీఎస్‌టీ రేటుకు తోడు సెస్ సైతం విధిస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీ కౌన్సిల్‌కు చేయాల్సిన సిఫార్సులకు తుదిరూపు ఇచ్చేందుకు మంగళవారం కేంద్ర, రాష్ట్రాలకు చెందిన అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుతమున్న జీఎస్‌టీ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి జీఎస్‌టీ మండలి సమావేశంలో ఓ ప్రజంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పలు వస్తువులపై విధిస్తున్న సెస్‌ను కూడా పెంచనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులను మూడుకు కుదించే అంశాన్ని జీఎస్‌టీ మండలి పరిశీలిస్తు్న్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బడ్జెట్ అంచనాల మేరకు జీఎస్‌టీ వసూళ్లు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- నవంబర్ మధ్య సీజీఎస్‌టీ వసూళ్లు ఏకంగా 40 శాతం మేర తగ్గడం గమనార్హం. మరోవైపు జీడీపీ వృద్ధి రేటు సైతం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 4.5 శాతానికి పడిపోయింది. ఇది 26 త్రైమాసికాల కనిష్ఠం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునే మార్గాలపై సూచనలు చేయాల్సిందిగా జీఎస్‌టీ మండలి కేంద్ర, రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీకి లేఖ రాసింది.
* ప్రపంచలోనే అత్యంత విలువైన సంస్థగా సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో అధికారికంగా అవతరించింది. ఇటీవల ఐపీవో బిడ్డింగ్ ముగించుకొన్న ఈ కంపెనీ షేర్లు నేడు సౌదీ స్టాక్ ఎక్స్‌ఛేంజిలో నమోదయ్యాయి. వీటి ట్రేడింగ్ 35.2 (9.39 డాలర్లు) రియాల్స్ వద్ద మొదలైంది. అంటే దాదాపు 10శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిందన్నమాట. ఈ కంపెనీ షేర్లను 32 రియాళ్ల వద్ద ఐపీవోలో కేటాయించారు. ఐపీవోలో ప్రైస్‌బ్యాండ్‌లో అత్యధికంగా ఆరామ్‌కో షేరును 32 రియాళ్లుగా నిర్ణయించారు. దీంతో ఈ ఐపీవో విలువ 2014లో చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా ఐపీవో విలువ (25 బిలియన్ డాలర్లు)ను అలవోకగా దాటేసింది. తాజాగా తొలి ట్రేడింగ్‌లో 10శాతం విలువ పెరగటంతో ఇప్పుడు ఆరామ్‌కో మార్కెట్ విలువ 1.88 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా ఆరామ్‌కో నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థలైన ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, చెవ్రాన్, బీపీల సంయుక్త విలువ కంటే ఇది చాలా ఎక్కువ. ‘‘ నేడు ఆరామ్‌కో ప్రపంచలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. తద్వాల్(సౌదీ స్టాక్ ఎక్స్‌ఛేంజి పేరు)లో కూడా ఇదే అతిపెద్ద కంపెనీ’’ అని సౌదీ స్టాక్ మార్కెట్ ఛైర్‌ఉమెన్ సారా అల్ సుహిమి పేర్కొన్నారు.
* దసరా, దీపావళి పండగ సీజన్‌తో అక్టోబరులో మెరుగుపడిన ప్రయాణికుల వాహనాల విక్రయాలు.. మళ్లీ గత నెలలో కాస్త తగ్గాయి. నవంబరులో 2,63,773 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో విక్రయమైన 2,66,000 యూనిట్లతో పోలిస్తే ఇది 0.84శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాలు వెల్లడించాయి. నవంబరులో దేశీయ కార్ల అమ్మకాలు 10.83శాతం తగ్గి 1,60,306 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 నవంబరులో ఈ విక్రయాలు 1,79,783 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు 14.87శాతం, ద్విచక్రవాహనాల విక్రయాలు 14.27శాతం తగ్గాయని సియామ్ పేర్కొంది. కమర్షియల్ వాహనాల విక్రయాలు కూడా 14.98శాతం తగ్గి 61,907 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరీలు కలిపి ఈ ఏడాది నవంబరులో వాహనాల విక్రయాలు 12.05శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. మరోవైపు విక్రయాలు తగ్గినప్పటికీ గత నెలలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి పెరిగిందని సియామ్ పేర్కొంది. నవంబరులో ఉత్పత్తి 4.06శాతం పెరిగి.. 2,90,727 యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది.