Food

నాలుక లాగితే నాలుగు రొయ్యలు తినండి

Eat shrimp on regular basis for boosting your health-telugu food and diet news

నాలుక లాగినప్పుడు నాలుగు రొయ్యలను నోట్లో వేసుకోకపోతే.. ఇక ఈ తిండి ఎందుకు? ఈ తిప్పలు దేనికి? అనిపిస్తుంది. రొయ్యల వేపుళ్లను తినే కాసేపైనా అనారోగ్య భయాలను పక్కనపెట్టండి. ఎందుకంటే రొయ్య.. బలానికి భయ్యా!

సముద్ర ఆహార ఉత్పత్తుల్లో రొయ్యలంత బలవర్ధకమైన ఆహారం మరొకటి లేదు. వీటిలోని సెలీనియం అనే పదార్థం క్యాన్సర్‌ కారక నివారిణి. క్యాన్సర్‌సెల్స్‌ అడ్డదిడ్డంగా పెరగకుండా అడ్డుకుంటుంది.

ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఉండే మేలిమి గుణం – గుండె శ్రేయస్సుకు పాటుపడటం. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించి.. రక్తసరఫరాకు సులభమైన మార్గం ఏర్పాటు చేయటం. అధిక రక్తపోటును నిలువరించే గుణమూ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఉంది. ఇన్నేసి బెనిఫిట్స్‌ రొయ్యల్లోనే అధికం.

శరీరానికే కాదు, మెదడుకూ మేత అవసరం. దానికి తగిన పోషకవిలువలు అందకపోతే వచ్చే సమస్యల్లో అల్జీమర్స్‌ ఒకటి. రొయ్యలు తింటే ఈ మతిమరుపు జబ్బు అంత త్వరగా రాదు.

దంతాలు, ఎముకలు బలంగా ఉన్నన్నాళ్లు మనిషి అంత త్వరగా నీరసపడిపోడు. ఇవి రెండూ అంత బలంగా ఉండాలంటే పుష్కలమైన కాల్షియం అవసరం. అది రొయ్యల్లో ఎక్కువ.

చర్మం ఎంత నాజూగ్గా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. అయితే చర్మసౌందర్యానికి అవసరమైన ‘విటమిన్‌ ఇ’ని అందించడంలో మాత్రం అంత శ్రద్ధ కనబరచం. ఆ లోటును భర్తీ చేయాలంటే రొయ్యల్ని తినాలి. వీటిలో విటమిన్‌-ఇ దండిగా దొరుకుతుంది. చర్మానికి కావాల్సిన పోషకాలు దొరికినప్పుడు మెరవమంటే ఎందుకు మెరవదు.

గుండెలోని రక్తనాళాల్లో పూడికలు రాకుండా, జ్ఞాపకశక్తి లోపించకుండా ఉండాలంటే విటమిన్‌ బి 12 అవసరం. రొయ్యలో ఈ రకం విటమిన్లకు కొదవ లేదు.

ప్రొటీన్లు శరీరశక్తికే కాదు, బాడీలో ఎక్కడ ఏ డ్యామేజ్‌ జరిగినా తిరిగి కోలుకోవడానికి తక్షణ అవసరం. అందుకని అత్యధిక ప్రొటీన్లు కలిగిన రొయ్యల్ని తింటే సరి.

మిగిలిన మాంసాహారంతో పోలిస్తే.. తక్కువ క్యాలరీలు ఉన్నది రొయ్యల్లోనే. సులువుగా జీర్ణమూ అవుతాయి. రొయ్యలు తిని బరువు కూడా తగ్గొచ్చు.

అయితే రొయ్యల్లో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదాని మోతాదుకు మించి తినొద్దు. అతి అనర్ధదాయకం అన్నది ఆహారానికీ వర్తిస్తుంది.