Editorials

అసలు మానవహక్కులు అంటే ఏమిటి?

What exactly are human rights? What does the constitution state?

ఇటీవలి కాలంలో మానవ హక్కుల గురించి బాగా చర్చ జరుగుతోంది. అసలు ఒక మనిషికి ఎలాంటి హక్కులుంటాయి? ఆ హక్కులు కోల్పోకుండా ఎలా జాగ్రత్త పడాలి? మీ హక్కులను ఎవరైనా కాలరాస్తే ఏం చేయాలి? మానవుడిగా మీ హక్కులు మీకు తెలుసా? ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది? మానవ హక్కుల పరిరక్షణకు, మార్పు తీసుకురావడానికి సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్న యువత పాత్రను ఈసారి కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ -యూడీహెచ్‌ఆర్)’ను ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబరు 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు. మానవ హక్కుల చరిత్రలో- ఈ డిక్లరేషన్ ఒక ప్రధానమైన పత్రం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపర అంశాల్లో, సాంస్కృతిక అంశాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండేళ్లలో దీనిని రూపొందించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు. అన్ని దేశాలు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా ఈ పత్రాన్ని నిర్దేశిస్తూ 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచమంతటా పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించింది. డిక్లరేషన్‌ ఏం చెబుతోంది?

*** పీఠికలో ఏముంది?
మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతిలకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు క్రూరమైన దుష్కృత్యాలకు కారణమయ్యాయి. ఇవి మానవాళి అంతరాత్మకు గాయం చేశాయి. భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా)తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ఐక్యరాజ్యసమితి ప్రజలు ఈ పత్రంలో ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువపై, స్త్రీ,పురుషుల సమాన హక్కులపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. వీరు విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించటానికి సంకల్పించారు. ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు ప్రతిన బూనాయి. ఈ ప్రతిజ్ఞను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైనది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తోంది. ప్రతి వ్యక్తీ, సమాజంలోని ప్రతి విభాగమూ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ, విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించటానికి కృషి చేయాలి. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన, ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. ఏ ఆర్టికల్ ఏం చెబుతోంది?

ఆర్టికల్ 1
మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. మనుషులందరికీ సొంత ఆలోచన, అంతః చేతన ఉంటాయి. ఒకరితో మరొకరు సోదరభావంతో మెలగాలి.
ఆర్టికల్ 2
ఈ పత్రంలోని అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జాతి, రంగు, లింగం, భాష, మతం లాంటి అంశాల ప్రాతిపదికగాగాని, రాజకీయ నేపథ్యంవల్లగాని, భిన్నాభిప్రాయం వల్లగాని, జాతీయ లేదా సామాజిక మూలాలవల్లగాని, సంపదలో వ్యత్యాసాలవల్లగాని, పుట్టుక లేదా ఇతర ప్రాతిపదికల వల్లగాని వివక్ష చూపడానికి వీల్లేదు.
వ్యక్తులను వారి దేశం లేదా భూభాగం రాజకీయ/అంతర్జాతీయ హోదా ఏమిటనేదాని ప్రాతిపదికగా ఎలాంటి వివక్షా చూపరాదు.
ఆర్టికల్ 3
జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వీయ భద్రతా హక్కు ప్రతి మనిషికీ ఉంటాయి.
ఆర్టికల్ 4
ఎవ్వరినీ బానిసగా చేసుకోవడానికి వీల్లేదు. బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్ని అన్ని రూపాల్లో నిషేధించాలి.
ఆర్టికల్ 5
ఎవ్వరినీ చిత్రహింసలకు గురిచేయరాదు. ఎవ్వరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమానకరమైన శిక్షకు గురిచేయరాదు.
ఆర్టికల్ 6
ప్రతి చోట చట్టం ముందు వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
ఆర్టికల్ 7
చట్టం ముందు అందరూ సమానులే. ఎలాంటి వివక్షా లేకుండా చట్టపరమైన రక్షణ పొందే హక్కు అందరికీ ఉంది. ఈ డిక్లరేషన్‌కు విరుద్ధంగా, ఎలాంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది.