శీతాకాలం వచ్చిందంటే నా జుట్టు పొడిబారి, పెళుసుగా మారిపోతుంది. మాడు దురదగా ఉంటుంది. రసాయనరహితంగా, సహజసిద్ధమైన పద్ధతులతో నా శిరోజాలు మృదువుగా అవుతాయా?
శరీరచర్మం పొడిబారినట్లే…ఈ కాలంలో శిరోజాలు కూడా కళావిహీనంగా అనిపిస్తాయి. శరీరతత్వంలాగే జుట్టుకూ…మూడు రకాల తత్వాలుంటాయి. వాటి ప్రకారం వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సహజసిద్ధమైన నూనెలతో తలకు మర్దనా చేసుకుని, తరువాత ఆయుర్వేదపరమైన మూలికలతో తలస్నానం చేస్తే మీ జుట్టు మృదువుగా పూర్వపుస్థితికి వస్తుంది.
వాత ప్రకృతి…
శిరోజాలు ఎండిపోయినట్లు పలచగా, చివరలు చిట్లుతూ, గరుగ్గా అనిపిస్తాయి. చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా జుట్టుకు నువ్వుల నూనె, కొబ్బరి నూనెను వాడితే మంచిది. బ్రాహ్మీ, గుంటగలగర, యష్టిమధు వంటి మూలికలతో తయారైన నూనెలను వీటికి కలిపి, గోరువెచ్చగా తలకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత పైన చెప్పిన మూలికల్లో దొరికిన వాటిని మెత్తని చూర్ణంగా చేసి కుంకుడుకాయ లేదా శీకాయపొడితో నానబెట్టాలి. దీంతో తలస్నానం చేస్తే చాలు.
పిత్త ప్రకృతి…
ఇటువంటివారిలో జుట్టు పలచగా, జిడ్డుగా సన్నని వెంట్రుకలుంటాయి. త్వరగా నెరిసిపోతుంది. బ్రాహ్మీ, మందార, యష్టిమధు, గురివింద, వేప మూలికలతో తయారైన నూనె లేదా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేడిచేసి తలకు రాసుకోవాలి. మూడు గంటల తరువాత బ్రాహ్మీ, వేప ఆకుల ముద్దకు శీకాయపొడిని కలిపి తలస్నానం చేయాలి.
కఫ ప్రకృతి…
జుట్టు ఒత్తుగా, జిడ్డుగా ఉంటుంది. దీనికి కొబ్బరి, ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వాడాలి. గుంటగలగర, కచ్చూరాలు, వేప,పునర్నవ, గురివింద వంటి మూలికలతో తయారైన నూనెలూ… వాడొచ్చు. వీటిలో ఏదైనా నూనెను వేడిచేసి తలకు మసాజ్ చేసుకోవాలి. రెండు గంటల తరువాత గుంటగలగర, గలిజేరు, చంగల్వకోష్టు, బావంచాలు, వేప ఇటువంటి మూలికలను కుంకుడుకాయతో కలిపి పేస్టులా చేసుకుని రుద్దుకోవాలి.