* ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) ఇక్కడి నుంచే వచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం (ఏయూ)లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో ఏయూ 14వ స్థానంలో ఉందని.. తొలి ఐదు స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆంగ్లమాధ్యమంతో బోధనా సమస్యలు కచ్చితంగా ఉంటాయని.. వాటిని అధిగమించి లక్ష్యం చేరుకుంటామని చెప్పారు.
* తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే ఈ ఏడాది మొత్తం గడిచిపోయిందని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం తప్పిదాల వల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ముందు రుణమాఫీ, నిరుద్యోగభృతిపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ఉత్తమ్ ప్రశ్నించారు.
* అధికారులను బెదిరించే రీతిలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంకు చెందిన జగతి సంస్థ అక్రమాలు వెలికితీసినందుకే ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను సస్పెన్షన్‌తో వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అసెస్‌మెంట్ బృందంలో ఉండటమే కృష్ణకిషోర్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. జైలులో జగన్‌తోపాటు ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు ఇచ్చారని, సహ నిందితులుగా ఉన్నవారిని సలహాదారులుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధానిని మార్చే ఉద్దేశం లేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని మార్పుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో మంత్రులు బొత్స, బుగ్గన తదితరులు చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఒకింత గందరగోళానికి తెరతీశాయి.
* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ హెచ్చరించారు. భాజపా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రెండు రోజులుగా అసోంలో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధ్వంసం వెనుక కాంగ్రెస్ పార్టీ, మత శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. కొందరు వామపక్షవాదుల ప్రమేయం కూడా ఉందని తప్పుబట్టారు.
* వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకొని జోరుమీదున్న టీమిండియాకు ఓ ఎదురుదెబ్బ! పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు గాయమైందని సమాచారం. బహుశా అతడు వన్డే సిరీస్ ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని జట్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడట. ప్రస్తుతానికైతే జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భువి వెన్ను నొప్పితో బాధపడుతూ మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
* పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంది. శుక్రవారం దిల్లీతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ వివాదాస్పద చట్టంపై చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ భవనం వద్దకు దాదాపు 2వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ వద్ద విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని విరగ్గొట్టుకుంటూ విద్యార్థులు ముందుకు సాగారు.
* ‘నమామి గంగే’ పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయనున్నారు. పవిత్ర గంగా నదిలో ప్రయాణించడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయనున్నారు. శనివారం జరగనున్న నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొనటానికి మోదీతో సహా పన్నెండు మంది కేంద్ర మంత్రులు, తొమ్మిది మంది కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాన్పూర్ కు చేరుకున్నారు.
* అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్ రెడ్డి అక్కడ అమెజాన్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ద్వారకానాథ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. ఆయన ఆత్మహత్యతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. ద్వారకానాథ్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు.
* మహిళా భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం జగన్ బిల్లుకు తీసుకురావడానికి గల కారణాలను వివరించారు. మహిళలు, చిన్నారులపై దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని.. వీటిని నివారించాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని చెప్పారు. అనంతరం ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తర్వాత ‘దిశ’ బిల్లు చట్టంగా మారనుంది.
* రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సంవత్సరం దాటిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. ‘రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కరి ఖాతాలోనైనా రూ.5 లక్షలు వేశారా? రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తున్నారు’ అని ఆరోపించారు.
* దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రవేశ పెట్టిన ‘దిశ’ బిల్లుపై చర్చ సందర్భంగా భవానీ మాట్లాడారు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుండేవారని గుర్తు చేశారు. కానీ సమాజంలో తిరుగుతున్న కొందరు మృగాళ్ల వల్ల ఇలాంటి పెద్దల మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
* ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగులు వేయడంపై పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయవద్దని ఆదేశించింది.
* ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది మైనర్లను అదుపులోకి తీసుకొని జైళ్లలో పెట్టారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై జమ్మూకశ్మీర్ హైకోర్టు జువినైల్ జస్టిస్ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో మైనర్లను అదుపులోకి తీసుకున్నారంటూ ఇనాక్షీ గంగూలీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ కమిటీని ఏర్పాటు చేసింది.
* ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 2019’(క్యాబ్)ని తొలి నుంచి తీవ్రంగా విమర్శిస్తున్న ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని అమలుకు అడ్డుకొని ‘భారత ఆత్మ’ను కాపాడాలని వ్యాఖ్యానించారు. ‘‘పార్లమెంటులో మెజారిటీయే గెలిచింది. న్యాయవ్యవస్థను దాటి వెళ్లిపోయింది. ఇక ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన 16 మంది భాజపాయేతర ముఖ్యమంత్రులపైనే భారత ఆత్మను కాపాడాల్సిన బాధ్యత ఉంది. పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇప్పటికే ‘క్యాబ్’, ఎన్‌ఆర్‌సీకి నో చెప్పారు. ఇతరులు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ట్వీట్ చేశారు.
* అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ లోక్‌సభలో భాజపా మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ అన్నారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘నేను క్షమాపణలు చెప్పను. అసలు నేను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో స్పష్టంగా చెబుతాను. ప్రధాని మోదీ పదేపదే మేకిన్ ఇండియా గురించి మాట్లాడుతారు. కానీ వార్తాపత్రికలు చూసినప్పుడు మాత్రం మేకిన్ ఇండియా కంటే ఎక్కువగా అత్యాచార వార్తలే కన్పిస్తున్నాయి’’ అని చెప్పారు.