Food

స్టార్ ఫ్రూట్ విశేషాలు

The health benefits of star fruit-telugu food and diet news

* నా చెట్టు కాయల ఆకృతిని బట్టి మీరు నక్షత్ర పండు చెట్టు (స్టార్‌ ఫ్రూట్‌ ట్రీ) అని పిలుస్తారు.. కానీ నిజానికి నా పేరు అవెర్రోవా కారంబోలా.
* నాకు కాసే పండ్లనేమో కారంబోలా అంటారు.
* నన్ను ఆగ్నేయాసియా, దక్షిణ పసిఫిక్‌, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.
* పురాతన కాలం నుంచి మీ దేశంలో నన్ను సాగు చేస్తున్నారు.
* నేను 25 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతాను.
* నా ఆకులు రాత్రి సమయంలో ముడుచుకుంటాయి.
* నాటిన 3 నుంచి 4 సంవత్సరాల్లో కాయలు కాస్తాను.

*** పుల్లగా.. తీయగా..
* నాలో రెండు రకాల పండ్ల చెట్లున్నాయి. ఒక రకం పుల్లగా, మరో రకం తీయగా ఉంటాయి.
* అర్కిన్‌, డాపోన్‌, మా ఫ్యూంగ్‌, మహా, డెమాక్‌ తీయగా ఉండే పండ్ల రకాలు. గోల్డెన్‌ స్టార్‌, న్యూకాంబ్‌, స్టార్‌ కింగ్‌, థాయర్‌ పుల్లగా ఉండే పండ్ల రకాలు.
* మొత్తం పండునంతా చూస్తే నక్షత్ర ఆకారం కనిపించదు.. కానీ.. అడ్డంగా మధ్యలో కోస్తే స్టార్‌ ఆకారంలో కనిపిస్తాయి. అందుకే నాకు కాసిన పండ్లను స్టార్‌ ఫ్రూట్‌ అంటారు.

*** పోషకాల గని
* నా పండ్లలో సి, బి2, బి6, బి9 విటమిన్లు, ఫైబర్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌లాంటి పోషకాలున్నాయి.
* నా పండ్లలో పుల్లని రకాలను వంటకాలు, కూరల్లో వాడతారు. తీయని వాటితో పండ్ల రసాలు, జామ్‌లు తయారు చేస్తారు. నేరుగానూ తినొచ్ఛు
* మీ శరీరంలోని అదనపు నీటిని తొలగించడానికి ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

*** ఔషధగుణాలూ సొంతం
* నా పండ్లతో దగ్గు, కామెర్లు, మలబద్ధకంలాంటి సమస్యలూ దూరమవుతాయి.
* బరువు తగ్గడానికి, రక్తపోటు క్రమబద్ధంగా ఉండటానికి సహాయపడతాను. కొలెస్ట్రాల్‌ స్థాయి అదుపులో ఉంటుంది.
* శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయినీ నియంత్రణలో ఉంచుతాను.
* ఆటలమ్మ, తలనొప్పి, తామర వంటి వ్యాధుల చికిత్సల్లో నా ఆకులు, వేర్లను ఉపయోగిస్తారు.
* మూత్రపిండ లోపాలతో బాధపడుతున్న వారు నా పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలో ఆక్సాలిక్‌ ఆమ్లం ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.