Editorials

కాంగ్రెస్‌తో కలిశాడు…ఢింకీ కొట్టాడు

Prashanth Kishore Gets A Huge Blow On The Face By Joining Hands With Congress

పరిచయం అక్కర్లేని వ్యక్తి ప్రశాంత్‌ కోషోర్‌. ఏపీ ప్రజలకు, అక్కడి అన్ని పార్టీల నాయకులకు తెలిసిన ఎన్నికల వ్యూహకర్త. ‘గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా’..అని ఓ సిపిమాలో రాజేంద్రప్రసాద్‌ పాడతాడు. అలాగే ప్రశాంత్‌ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకుంటే ఎన్నికల్లో విజయం గ్యారంటీ అనే అభిప్రాయం కొన్ని పార్టీల్లో ఉంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికైన కలకత్తా కాళిక మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి పీఠం అలంకరించడం కోసం ప్రశాంత్‌ కోషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఏపీలో వైకాపా విజయానికి కారకుడైన ప్రశాంత్‌ కిషోర్‌పై మమత దృష్టి పడటంతో బీజేపీని ఎదర్కోవడానికి ప్రశాంత్‌ను నియమించుకున్నారు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతాయి. ఇది చూసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారు. కేజ్రీవాల్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. మొదటిసారి 2013లో ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 49 రోజులు పీఠంపై కూర్చున్నారు. 2015 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడో….! 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి దోహదం చేసిన ప్రశాంత్‌, బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమి తరపున వ్యూహకర్తగా పనిచేసి నితీష్‌ కుమార్‌ సీఎం కావడానికి కృషి చేసిన ప్రశాంత్‌ యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు తరపున పనిచేసి ఓటమి భారంతో వెనుదిరిగాడు. 2014 పార్లమెంటు, బిహార్‌ ఎన్నికల తరువాత ప్రశాంత్‌ కిశోర్‌ పేరు దేశమంతా మారుమోగిపోయింది. మరోమాటలో చెప్పాలంటే మోదీ, నితీష్‌లతో సమంగా ఆయన కూడా హీరో అయిపోయారు. ఆయన హీరోయిజాన్ని ఉపయోగించుకొని యూపీలో హీరో కావాలని ఆశించిన కాంగ్రెసుకు తీవ్ర భంగపాటు కలగడమే కాకుండా ప్రశాంత్‌ కిశోర్‌ హీరోయిజం కూడా డ్యామేజ్‌ అయింది. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రశాంత్‌ ఏపీలో వైకాపా తరపున పనిచేశాడు. చివరకు ఎన్నికల ఫలితాలు జగన్‌, ప్రశాంత్‌ కూడా ఊహించని రీతిలో వచ్చాయి. ఈ విజయమే మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలను ఆకర్షించింది. ప్రస్తుతం నితీష్‌ కుమార్‌ పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.