అమ్మ, అమ్మమ్మ, పిల్లలు కలిసి ఆడుకోగలిగిన ఆటలు ఏముంటాయి? నాన్న, తాతయ్యలతో కలిసి పిల్లలు ఆడుకోవాలంటే? పెద్దవాళ్లు చురుగ్గా కదలలేరు. పిల్లలేమో రెండు పాదాలను ఒక్క క్షణం కూడా నేల మీద ఆన్చరు. అయినప్పటికీ పెద్దవాళ్లను, పిల్లవాళ్లను కలిపి కూర్చోబెట్టి ఒక ఆట ఆడించేందుకు పాత ఆటలన్నిటినీ తవ్వి తీస్తున్నారు బెంగళూరు యువతి శ్రీరంజని! పిల్లల్లో బోర్డ్ గేమ్స్‌పై ఆసక్తి కలిగించి, ఆడించడానికి, వాటి ద్వారా పెద్దవాళ్లకూ ప్రయోజనం కలిగించడానికి ఎక్కడెక్కడి బోర్డ్ గేమ్‌లను కూడా వెతికి పట్టుకుని వస్తున్నారు శ్రీరంజని. శతాబ్దాల కిందట మనవాళ్లు ఆడుకున్న ఆటలతోపాటు ఖండాంతరాల నుంచి కూడా బోర్డ్ గేమ్‌లను శోధించి, పరిశోధించి తెస్తున్నారామె. ‘‘అష్టాచెమ్మా, పరమపద సోపానపటం, బారాహ్ గట్టా, పులి–మేక, వామనగుంటలు.. పిల్లల్లో మేధాశక్తిని పెంచడం ఒక ప్రయోజనం అయితే పెద్దవాళ్లలో మతిమరుపును కూడా తగ్గిస్తున్నాయి ఈ ఆటలు! ఈ విషయాన్ని సైకాలజిస్టులు చెప్పడమే కాదు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న తొంభై ఏళ్ల మహిళ.. తాను ఈ ఆటలు మొదలు పెట్టిన తరవాత మర్చిపోయిన బాల్యస్మృతులన్నీ గుర్తుకు వస్తున్నాయని సంతోషంగా నాతో చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుల పేర్లు గుర్తు చేసుకోవడానికి చాలా కష్టపడేదాన్నని, ఇప్పుడు చాలా సంఘటనలు ఇప్పుడే జరిగినట్లు కళ్లముందు మెదలుతున్నాయని తన బాల్యంలోకి వెళ్లిపోయారావిడ. అరవైలలోకి వచ్చిన వాళ్లు వారంలో కనీసం ఒక గంటయినా సరే ఈ ఆటలు ఆడితే మెదడు చురుగ్గా ఉంటుంది. మతిమరుపు బారి నుంచి దూరంగా ఉండవచ్చు కూడా. స్మార్ట్ ఫోన్ యుగంలో మైండ్ అనుక్షణం ఏదో ఒక టాస్క్‌లో నిమగ్నమై ఉంటోంది. ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ లాగ్‌లోకి వెళ్లిన తర్వాత ఎవరికి ఫోన్ చేయాలనుకున్నామో మర్చిపోయే పరిస్థితి నలభై ఏళ్లకే దాపురించింది. ఈ దుస్థితిని విజయవంతంగా దాటేయడానికి కూడా పిల్లలతో కానీ పెద్ద వాళ్లతో కానీ ఓ గంటసేపు నచ్చిన బోర్డ్ గేమ్ ఆడుకోవడమే దివ్యమైన ఔషధం’’ అంటున్నారు శ్రీరంజని. కూర్చొని ఒకచోట ఆడుకునే ఆటలపై ఆమె బెంగళూరులో వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. బర్త్‌డే పార్టీలతోపాటు ఇతర ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లలో ఇప్పుడు బోర్డ్ గేమ్‌లే ప్రధాన ఆకర్షణ అవుతున్నాయి కూడా. దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఈ ఆటల్లో కొన్నయినా ఉండి ఉంటాయి. అటకెక్కిన ఆటవస్తువులను అటక దించి అక్కున చేర్చుకోవచ్చు. బోర్డ్ గేమ్‌లను పునఃపరిచయం చేయడం కోసం ఏకంగా పరిశోధనే చేస్తున్నారు శ్రీ రంజని. మన పులి–మేకలా..దక్షిణాఫ్రికాలో ఆవు– చిరుత ఆటను, క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి కాలం నాటి నవకంకారి ఆటను కూడా వెలికి తీశారామె.
అష్టాచెమ్మా ఆడేద్దామా?
Related tags :