ScienceAndTech

నకిలీ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా

Chinese Physicists In The Process Of Making Artificial Sun

ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో ఏ మూలన తయారైన వస్తువుకైనా ప్రత్యామ్నాయ వస్తువును తయారు చేయడంలో చైనాను మించిన వారు లేరు. అసలు, నకిలీకి తేడా లేకుండా వారు తయారు చేస్తారు. వస్తువుల వరకు అయితే పర్వాలేదు కానీ, ప్రకృతి పరంగా అసాధ్యం అనుకునే వాటికి కూడా తనదైన శైలిలో నకలు సృష్టించేందుకు డ్రాగన్‌ దేశం సిద్ధమవుతోంది. ఇదివరకే కృతిమ చంద్రుడ్ని సృష్టించి ఆశ్చర్యపరిచిన చైనా ఇప్పుడూ అదే కోవలో భూమ్మీదే సూర్యుడిని కూడా తయారు చేస్తానంటోంది. సూర్యుడి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడమే కష్టమవుతున్న ఈ తరుణంలో ఏకంగా ఆ సూర్యడికే ప్రతిసృష్టి చేయాలని భావిస్తోంది.

మనకు ఏదైనా వస్తువుకు నకలు కావాలంటే అది కచ్చితంగా చైనాలో దొరుకుతుందన్నది ఓ నమ్మకం. అసలు సిసలు బ్రాండ్‌ వస్తువులకు ఏమాత్రం తీసిపోని విధంగా నకలు తయారు చేయడంలో ఎవరైనా చైనా తర్వాతే. ఆ వస్తువు ధరను బట్టి అది అసలైనదా, నకిలీదా అని పోల్చవచ్చేమో గానీ.. ఆ రెండింటి ధరలు ఒకటైతే మాత్రం పోల్చడం చాలా కష్టం. చైనా పనితనం అలా ఉంటుంది మరి. ఇవన్నీ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసే కొత్త ప్రయోగానికి చైనా తెరతీసింది. అంటే అది వస్తువుల విషయంలో మాత్రం కాదు. ఏకంగా సూర్యుడినే సృష్టించేస్తానంటోంది.

సూర్యడు ఏమాత్రం కన్నెర్రజేసినా తట్టుకోలేని పరిస్థితి మనది. అలాంటిది ఏకంగా భూమ్మీద సూర్యుడి శక్తిని పునర్‌సృష్టి చేయడం సాధ్యమా! కానీ చైనా మాత్రం సాధ్యమే అంటోంది. ఈ నేపథ్యంలోనే సూర్యుడి శక్తిని భూమ్మీద పొందేందుకు కృత్రిమ సూర్యుడ్ని అభివృద్ధి చేస్తున్నట్లు చైనా సైంటిస్టులు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. హెచ్‌ఎల్-2ఎం టోకమాక్‌ పేరుతో ఈ ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. నిజమైన సూర్యుడి ఉపరితలంపై సహజంగానే ఉండే ప్రక్రియల మాదిరిగానే నమూనా సూర్యుడు కూడా పని చేస్తాడని అంటున్నారు.

సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీన ప్రక్రియను భూమిపై కృత్రిమంగా జరిపించడం ద్వారా సూర్యుడి కన్నా 13 రెట్ల అధిక శక్తిని విడుదలయ్యేలా చేయనున్నారు. అలాంటి ప్రక్రియను ప్రతిబింబించేందుకు హెచ్‌ఎల్‌-2ఎం పరికరాన్ని చైనా తయారుచేస్తోంది. దీనినే కృత్రిమ సూర్యుడిగా పిలుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చైనా నేషనల్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌, సౌత్‌ వెస్ట్రన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ కలిసి చేపట్టాయి. దీనిపై పరిశోధనలు జరిపేందుకు సిజువన్‌ ప్రావెన్స్‌లోని అణు రియాక్టర్‌ ఉన్న లెషన్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. హెచ్‌ఎల్‌-2ఎం పరికరం ద్వారా దాదాపు రెండు వందల మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి సూర్యుడి ఉపరితలంపై కేవలం 15 మిలియన్‌ డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత మాత్రమే వెలువడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ పరికరం ద్వారా ఉత్వత్తయ్యే ఉష్ణోగ్రత 13రెట్లు అధికంగా ఉండనుంది.

సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య నిరంతరం జరుగుతుండడం వల్ల శక్తి అనంతంగా జనిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అణు రియాక్టర్లలో అందుకు భిన్నమైన ప్రక్రియ చేపడుతున్నారు. కేంద్రక విచ్ఛితి ద్వారా అణువులు విడగొడతారు. దీని ద్వారా శుద్ధమైన, చౌకైన శక్తి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధంగా చేయడం ఎంత శ్రమ, ఆపదలతో కూడిన వ్యవహారమో అందరికీ తెలిసిన విషయమే. చైనా కోణంలో ఆలోచిస్తే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం ఎంతో ముఖ్యం. నిజానికి చైనా కృత్రిమ సూర్యుడి శక్తిని భూమి మీద సృష్టించేందుకు మూడు దశాబ్దాల కిందటే మొదలుపెట్టింది. 1984లో తన తొలి సంలీన పరికరమైన హెచ్‌ఎల్‌-1ను రూపొందించింది. దానిని చైనాలోని అతిపురాతన, అతి పెద్దదైన సౌత్‌ వెస్ట్రన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ రూపొందించింది.